తొమ్మిది మంది ఎమ్మెల్యేల మలేషియా పర్యటన మతలబేమిటో?
తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లోని తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మలేషియాలో పర్యటిస్తున్నారు. మలేషియా అందాలను చూసేందుకు వీరు వెళ్లారని చెప్పుకుంటున్నారు. అయితే దీని వెనకాల మతలబు ఉందని ఈ మూడు జిల్లాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. దీనిపై ‘తెలుగువన్.కామ్’ చేసిన పరిశీలనలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తొమ్మిది మందినీ ఉభయగోదావరి జిల్లాల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఈ మలేషియా తీసుకువెళ్లారు. ఆయన సొంతఖర్చులపై ఈ ఎమ్మెల్యేలను తీసుకువెళ్లటానికి మాత్రం ప్రత్యేకమైన రాజకీయ కారణాలు లేవని ఆ ఎమ్మెల్సీ బంధువులు చెబుతున్నారు. ఏ కారణం లేకుండా ఎందుకు తీసుకువెళతారు? అని ప్రశ్నిస్తే కేవలం ఇది ఒక జాలీట్రిప్పు అని వారు కొట్టిపారేస్తున్నారు. కానీ, తాజాగా హైదరాబాద్ నుంచి వెల్లడైన సమాచారం ప్రకారం డిప్యూటీ సిఎం పదవికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ప్రకటించే అభ్యర్థులు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఎమ్మెల్సీ అటువంటి పదవిని ఆశించే ఈ మలేషియా ట్రిప్పు ఏర్పాటు చేసి ఉంటారని రాజధానిలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటున్నారు. అయితే చిత్రంగా చివరి నిమషం వరకూ వస్తానని చెప్పిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆగిపోయారు. ఆయన తనకు ఉన్న పనుల రీత్యా ఆగిపోతున్నానని ఎమ్మెల్సీకి చెప్పారట. వాస్తవానికి చంద్రశేఖరరెడ్డి కాంగ్రెసు నుంచి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌కు మారాక అవసరమైనంత వరకే స్పందిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, అలానే రామచంద్రపురం ఎమ్మెల్యే తోటత్రిమూర్తులు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, ఇంకా మరికొందరు ఈ ట్రిప్పులో జాయిన్ అయ్యారు. వీరంతా హైదరాబాద్ వెళ్లి అక్కడ నుంచి మలేషియా వెళ్లారని తెలుస్తోంది. ఏదేమైనా ఈ మలేషియా ట్రిప్పు ద్వారా ఎమ్మెల్సీ ఏదో ఆశిస్తున్నారని మాత్రం స్పష్టం అవుతోంది. ఆయన ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు సహకరిస్తారా? లేక ట్రిప్పు పూర్తయ్యాక మరిచిపోతారా? అన్నది భవిష్యత్తులోనే తేలుతుంది.