బాబు భవిత చెప్పిన బ్రహ్మంగారు?
posted on Oct 2, 2012 @ 9:53AM
భవిష్యత్తును ముందుగానే కనిపెట్టి తన కాలజ్ఞానం ద్వారా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రచించారు. ఆయన రచనలో కరువుకాటకాలు, ఆధునిక ప్రపంచ పోకడలు, వావి వరసలు లేని శృంగారం వంటి పలు అంశాలు నిజరూపం దాల్చి ఇప్పటికే సామాజిక అథ్యయనపరులను కలవరపెట్టాయి. ఈ మూడు అంశాలు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ప్రచారాన్ని కూడా పొందాయి. అయితే కాలజ్ఞానంలో కరువు గురించి బ్రహ్మంగారు ప్రస్తావించినప్పుడు ఓ తెల్ల మచ్చలు గల వ్యక్తి రాజ్యమేలుతున్నప్పుడు ప్రజలు ఆకలి అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పారు. చంద్రబాబు హయాంలోనే కరువు కాటకాలు విజృంభించాయన్నది జగమెరిగిన సత్యం. ఈ నిజాన్ని వైఎస్ అభిమానులు రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే ప్రకటించారు. వారు చెప్పినట్లే కరువు కోరల నుంచి రాష్ట్రం కొంత ఊపిరి పీల్చుకుంది. అయితే వైఎస్ అభిమానులు ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. అలా మారిన వారిలో ఎమ్మెల్యేలు భూమా శోభానాగిరెడ్డి, అమరనాధ్‌రెడ్డి తదితరులున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తాజాగా కరువుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఘాటైన పదజాలంతో విమర్శలు చేశారు. అన్ని విమర్శలకు వెంటనే స్పందించే తెలుగుదేశం పార్టీ ఈ విమర్శపై బాబు పాదయాత్రల హడావుడిలో పడి పట్టించుకోలేదు. అయితే ఈ విమర్శకు కర్నూలు, అనంతపురం, కడప తదితర రాయలసీమ జిల్లాల్లో తగిన ప్రాధాన్యత లభించింది. నిజమే కదా అని రాయలసీమవాసులు స్పందించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం మాటెలా ఉన్నా చంద్రబాబుకు కరువుకు మధ్య ఉన్న లింకు మాత్రం తమను పీడిరచి వదిలేసిందని వారు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు.