భానుని విశ్వరూపం? పెరుగుతున్న నమ్మకం!
posted on Oct 2, 2012 @ 9:46AM
భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సూర్యోదయాన్ని తన వెలుగులతో నింపాడు. ఇది ఏ రచనలో వాడిన వాక్యాలు కావు. నిజంగానే అరసవిల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో అరుదైన వెలుగులు ప్రసరించాయి. అసలు ఆలయ నిర్మాణంలో సూర్యుని కిరణం పడటానికి అవకాశాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా ఆ సూర్యకిరణాలు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో విగ్రహంపై పడి భక్తుల నమ్మకాన్ని పెంచుతుంటాయి. గ్రహదోషాలతో బాధపడే వారి కోసం అరసవిల్లిలో నిర్మించిన ఈ సూర్యదేవాలయం హిందువులకు ఎంతో పవిత్రమైనది. గ్రహదోషాలను పరిహరించే శక్తి ఉన్న సూర్యనారాయణమూర్తి విగ్రహాన్ని శాస్త్రరీతుల ప్రకారం నిర్మించారు. ఆ విగ్రహం నిర్మించినప్పటి నుంచి ప్రతీ ఏడాది ప్రత్యేకదినాల్లో క్రమంగా తప్పకుండా సూర్యనారాయణుడు వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నాడు. ఆయన వెలుగులు అరుదైన వింతగా చరిత్రపుటల్లో నమోదవుతూనే ఉంది. భారతదేశంలో సూర్యనారాయణమూర్తికి కోణార్క్, ఆ తరువాత అరసవిల్లిలో ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాలను ప్రతిపాదికగా చేసుకుని తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలోనూ సూర్యనారాయణమూర్తి దేవాలయం నిర్మించారు. ఈ మూడు ఆలయాల్లోనూ సూర్యకాంతి పడటానికి ప్రధానద్వారం, గవాక్షంలో సుదూరంగా ఖాళీలు ఉంచితే ప్రత్యేకదినాల్లో సూర్యకాంతి విగ్రహాలపై పడుతోంది. ఇది ఎలా సాధ్యమైందని పరిశోధకులు పలురకాల పరిశీలనలు జరిపారు. కానీ, వైజ్ఞానికశాస్త్రానికి ఇది అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. అటువంటి అరుదైన సందర్భం తాజాగా ఆదివారం నమోదైంది. ఈ వారాన్నే భానువారం అని కూడా పిలుస్తారు. అందువల్ల తన వారపురోజున వింత ప్రకాశంతో సూర్యనారాయణమూర్తి దర్శనమివ్వటం భక్తుల్లో నమ్మకాన్ని పెంచింది. అలానే హిందువులు విశ్వసించే గ్రహదోషాలు నివారించుకునేందుకు పూజలు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ ఆలయంలోని పూజారులూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.