వైకాపా, కాంగ్రెస్ మధ్య సీమలో ప్రొటోకాల్ ఘర్షణలు?
posted on Oct 3, 2012 @ 11:36AM
నన్ను గౌరవించలేదంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రొటోకాల్ ఘర్షణలకు కాలుదువ్వుతున్నారు. తాజాగా ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో రాయలసీమ నుంచి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ పార్టీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిని ప్రభుత్వఅధికారులు, అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పట్టించుకోవటం లేదు. దీంతో తమకు గౌరవం ఇవ్వటం లేదని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ నిరసనలకు దిగుతున్నారు. వీరితో పాటు కార్యకర్తలూ ఈ నిరసనల్లో పాల్గొని వివాదాన్ని పెంచుతున్నారు. రాయలసీమలో ఇటీవల తరుచుగా ఈ తరహా ఘర్షణలు ఎక్కువయ్యాయి. తాజాగా గాంధీజయంతి పురస్కరించుకుని తననెందుకు ఆహ్వానించలేదని అనంతపురం నగరంలోని పాతూరులో వైకాపా ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లోనే తమను పట్టించుకోకపోతే ఎట్లా అని ఆయన తరుపున కార్యకర్తలు ఎంపి అనంతవెంకటరామిరెడ్డిని, జిల్లా కలెక్టరు, ఎస్పీని నిలదీశారు. ఈ దశలోనే ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి విగ్రహం దగ్గర బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సమయంలోనే ఇరువర్గాల కార్యకర్తల మధ్య ప్రారంభమైన వాగ్వాదం పెరిగి చివరికి ఘర్షణ స్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు దాడికి దిగేంత పరిస్థితి ఏర్పడిరది. పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించేందుకు కృషి చేశారు. కావాలనే ఈ తరహాలో కాంగ్రెస్ పార్టీ తమను కవ్విస్తోందని రాయలసీమలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళ వ్యక్తం చేస్తోంది.