‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’
posted on Oct 3, 2012 7:24AM
మేం ఏం చేసినా అదేమని ప్రశ్నించే అధికారం ఎవకవరికీ లేదంటూ ఒంటెత్తుపోకడలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. దేశాన్ని తమ చిత్తమొచ్చినరీతిలో పాలించేస్తామనీ, మాకోటేసిన పాపానికి మేం అధికారంలో ఉన్నన్నాళ్ళూ భరించాల్సిందేనన్న కాంగ్రెస్ పిడివాదానికి సుప్రీం చెక్ చెప్పింది.బొగ్గుగనులను ఇష్టంవచ్చినట్లుగా కేటాయించేసి, దేశాదాయానికి గండికొట్టారంటూ కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికనివ్వడంపై షాక్‌కు గురైన కాంగ్రెస్ మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకెక్కడిదని సవాల్ చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌పార్టీ అభిమానిగా చెప్పుకునే అరవింద్‌గుప్తా అనే ఆయన కాగ్ అధికారాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సుప్రీం ఈ పిటీషన్‌ను త్రోసిపుచ్చుతూ, ప్రభుత్వం ఏం చేసినా విధేయత ప్రదర్శించేందుకు కాగ్ సర్కారు వారి గుమాస్తా కాదని స్ఫష్టం చేసింది. కాగ్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ అనీ, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో బాటు కేంద్ర పాలిత ప్రభుత్వాలు జరిపే ఆదాయవనరుల కేటాయింపులపై సమీక్ష జరిపే అధికారం కలిగి ఉందని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అనుకున్న కేంద్రం ఎవరెన్ని మొట్టికాయలేసినా కాగ్ నివేదికపై బదులిచ్చేందుకు ససేమిరా అంటోంది. జవాబివ్వటంలేదంటే ఖచ్చితంగా ఏదో గోల్‌మాల్ జరిగే ఉంటుందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.