మద్దతు బేరీజు వేసుకుంటున్న బాబు?
posted on Oct 2, 2012 @ 9:52AM
తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే వారి సంఖ్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బేరీజు వేసుకుంటున్నారు. దీని కోసం తన కుమారుడు నారా లోకేశ్, బావ బాలకృష్ణ, కోడలు, ఇతర కుటుంబసభ్యులకు బాబు పని కల్పించారట. యాత్రకు ఎంత మంది మద్దతు ఇస్తారు అన్నది లెక్కించటమే కుటుంబం మొత్తం చేయాల్సిన పని. పాదయాత్రలు ముగిసిన తరువాత తమ పార్టీ వాస్తవ పరిస్థితి అంచనా వేసుకోవాలని చంద్రబాబు ఆలోచన. ప్రత్యేకించి ఇలా అంచనాలన్నీ క్రోడీకరించాక నాయకత్వ మార్పు కనుక ప్రజలు కోరుకుంటే నారా లోకేశ్‌బాబును రంగంలో దింపవచ్చని కూడా బాబు ఆలోచిస్తున్నారట. తన కుమారుడినే రంగంలోకి దింపాల్సి వస్తే కోడలును ప్రచారకార్యదర్శిగా నియమించాలని కూడా యోచిస్తున్నారని బాబు విశ్వాసపాత్రుల భోగట్టా! ఇంతకీ బాబు తన 17వేల కిలోమీటర్ల పాదయాత్రను భారీస్థాయిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సన్నాహాల్లో అన్నిరంగాల వారినీ బాబు సంప్రదించారు. ప్రత్యేకించి పారిశ్రామికవేత్తలు ఇచ్చిన భరోసా పాదయాత్ర నిర్వహణ కొంతవరకూ లాభదాయకమనే భావన కూడా బాబుకు కలిగిందట. గతంలో తమ ప్రభుత్వహయాంలో పారిశ్రామిక మేళ్లు పొందిన వారందరినీ పాదయాత్ర వల్ల ఉపయోగాల గురించి బాబు ప్రశ్నించారని కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. దాంతో పాటు పార్టీపై ఎవరు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో గమనించిన బాబు భవిష్యత్తులో తమకు సహకారం అందించాలని ఓ మాట వేసి ఉంచారట. దీంతో ఎన్నికల ఖర్చుకు కొంత వెసులుబాటు కూడా లభించవచ్చన్న నమ్మకం బాబుకు కుదిరిందని కూడా చెప్పుకుంటున్నారు. దాంతో పాటు సినీరంగంలో తమ మద్దతుదార్లను కనిపెట్టేందుకు నిర్మాతలను, దర్శకులను బాబు ఆహ్వానించారు. దర్శకులు బాబు ఆహ్వానం అందగానే తమ వంతు సలహాలను ఇచ్చేశారు. దీంతో సినీరంగంలో ఇప్పటికే తమ పార్టీ పరిస్థితిపై బాబు ఒక అంచనాకు వచ్చారు. రాజ్యసభ సభ్యుడు మోహన్‌బాబును బాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తారని తాజాసమాచారం. ఈ సమాచారం ప్రకారం చిత్తూరు పర్యటన విజయవంతం చేసేందుకు మోహన్‌బాబు అభిమానులను తెలుగుదేశం నేతలు సిద్ధం చేశారని తెలిసింది. ఇలా చంద్రబాబు తన పర్యటనలో ఊహించని మలుపులు తిప్పేందుకు జోరుగా కసరత్తులు చేస్తున్నారని తాజాగా తెలిసింది. గాంధీ జయంతి సందర్భంగా జరిగే ఈ పాదయాత్రలకు బావ హరికృష్ణ మద్దతు ప్రకటించటం చంద్రబాబు శుభసూచకంగా భావిస్తున్నారట.