ప్రచారాభిలాషలో బాబుకు ప్రథమస్థానం?
posted on Oct 3, 2012 @ 11:21AM
ఎటువంటి చిన్న అవకాశం లభించినా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాన్ని భారీస్థాయిలో ప్రచారం చేసుకుంటారు. చేసినది కొంచెమైనా ప్రచారం భారీగా చేసుకునే స్టయిల్ చంద్రబాబు సొంతమంటారు. రాష్ట్రంలో ఇటువంటి ప్రచారాభిలాష ఉన్న నేతలే తక్కువని కూడా గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకమునుపు పత్రికలకు ప్రచారం కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఓ ప్రత్యేకమైన వాటా వేసి మరీ పత్రికలను అప్పట్లో బాబు పోషించారు. ఆ తరహాలో ఇంకెవ్వరూ ప్రచారం చేయలేరని కూడా ఆయన నిరూపించారు. అందుకే అప్పటి ప్రతపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబులాంటి ప్రచారకర్త ఏమి చేసినా అబ్బురమే మరి అని కూడా వ్యాఖ్యానించారు. దీనికి బాబు సమాధానం ఇవ్వలేదు. చంద్రబాబు అథికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు జరిగాయి. ఆ పుష్కరాలకు బాబు కాబట్టి అంత డబ్బు ఖర్చు పెట్టారని పలువురు కొనియాడారు. రాజమండ్రి రహదారులతో సహా అన్ని రూపురేఖలు అకస్మాత్తుగా మార్చేసిన ఘనత, ప్రచారం చంద్రబాబుకే దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు ప్రచారం కోసం ఏదో ఒక వింత పని చేయటం కూడా అలవాటు చేసుకున్నారు. ఇటీవల విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌తో ఢీ కొనేందుకు సిద్ధమైన బాబు అస్సలు రాజగోపాల్‌కు దొరక్కుండా తిరిగేసి హైదరాబాద్ చేరుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలానే తాజాగా పాదయాత్రలను ప్రారంభిస్తూ సినీదర్శకుల సూచనలు పాటిస్తామన్నారు. ఇలాంటి వింతతరహా ప్రచారానికి బాబు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.