హేరామ్..!
posted on Oct 2, 2012 @ 10:18AM
సత్యమే ఆచారం, అహింసే ఆయుధం.. బతికున్నన్నాళ్లూ మహాత్ముడి ఈ రెండు ఆయుధాల్నే నమ్ముకున్నాడు. వీటితోనే అత్యద్భుతమైన విజయాల్ని సాధించాడు. తను నమ్మిన సిద్ధాంతంకోసం, భారతీయులకు దాస్య విముక్తిని కల్పించడంకోసం మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ.. తన సర్వస్వాన్నీ త్యాగం చేశాడు. తన జీవితాన్ని జాతికి అంకింతం చేశాడు. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. గాంధీ తత్వం ముందునుంచీ కొంతమంది అతివాదులకు నచ్చేదికాదు. కానీ.. గాంధీ ఏమాత్రం తొణకలేదు, బెణకలేదు. సత్యాన్ని, అహింసని నమ్ముకుని వాటి శక్తిని గ్రహించి నిబ్బరంగా ముందుకు సాగాడు. వీరావేశాన్ని ప్రదర్శించినవాళ్లు లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ఎంతోమంది గొప్ప దేశభక్తులు ప్రాణాల్ని దేశంకోసం ధారపోశారు. కానీ.. స్వాతంత్ర్యాన్నిమాత్రం సాధించలేకపోయారు. అది మహాత్ముడు నమ్ముకున్న సత్యమార్గంలోనే వచ్చింది. అఖరికి గాడ్సే మహాత్ముడిని కాల్చి చంపినప్పుడుకూడా మహాత్ముడి పెదాలపై చిరునవ్వు చెదరలేదు. హేరామ్.. అంటూ కుప్పకూలిపోయారు తప్ప గాడ్సేమీద ఆయనకు కోపం కూడా రాలేదు. అదీ మహాత్ముడి గొప్పదనం. అందుకే ఆయన జాతిపిత అయ్యాడు. అందుకే మహనీయుడిగా మనందరి గుండెల్లో కొలువయ్యాడు.