అవును.. ఆ ఇద్దరూ కలిస్తే! ఆయన బలైనట్టే?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖరారై పోయింది.ఈటల మరో వారంలో తమ పార్టీలో చేరతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రకటించారు. సో ... ఇక ఈటల రాజకీయ భవిష్యత్’పై వినవచ్చిన ఊహగానాలు, వ్యూహాగానలకు తెరపడినట్లే అనుకోవచ్చును. అయితే ఒక ప్రశ్న మాత్రం అలాగే వుంది. భవిష్యత్’లో బీజేపీతో తెరాస చేతులు కలిపితే? ఈ సదేహం ఎవరికో వచ్చింది కాదు. స్వయంగా ఈటల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముందుంచిన ప్రశ్నగా ప్రచారం జరుగుతోంది. భవిష్యత్’లో కారు కమలం చేతులు కలిపితే, మా గతేంటని ఈటల నేరుగా నడ్డానే ప్రశ్నించినట్లు.. అందుకు నడ్డా, అలాటిదేమీ ఉండదని హామీ ఇచినట్లు, తెలంగాణాలోనూ బెంగాల్లోలా దూకుడు పెంచుతామని చెప్పినట్లు ... కథలు, కథనాలు చాలానే వచ్చాయి.
అందులో నిజానిజాలు ఎలా ఉన్నా రాజకీయాలలో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చును. ఇది అందరికీ తెలిసిన విషయం. రాజకీయాలు డైనమిక్’గా మారుతూ ఉంటాయి, నిశ్చలంగా నిలిచిపోవు. ఒకప్పుడు మమతా బెనర్జీ బీజేపీ మిత్ర పక్షం, వాజపేయి మంత్రి వర్గంలో మంత్రి. ఇప్పుడు అదే మమతా బెనర్జీ బీజేపీ పై ఒంటి కాలుమీద లేస్తున్నారు. 2009లో టీడీపీ, తెరాస మిత్ర పక్షాలు. వామపక్షాలను కలుపుకుని మహా కూటమిగ ఏర్పడి అసెంబ్లీ ఎన్నికలలో కలిసి పోటీ చేశారు. మొన్నటి బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వామ పక్షాలు, బెగాల్’లో కలిసి పోటీ చేశాయి, కేరళలో ప్రాధాన ప్రత్యర్ధులు. టీడీపీ, బీజేపీలు కలుస్తూ, విడిపోతూ, విడిపోయి కలుస్తూ... ఇలా చెప్పు కుంటూ పోతే, రాజకీయాలలో శతృమిత్ర సంబధాలలో ఏదీ శాశ్వతం కాదని అర్థమవుతుంది. అందుకే, రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరంటారు. .
భవిష్యత్ లో బీజేపీతో తెరాస చేతులు కలిపే అవకాశం ఉందా అంటే, లేదని చెప్పలేము. అలాగని ఉందనీ అనలేము. ఎన్నికల సమయానికి ఉన్నపరిస్థితిని, సమీకరణాలు, లెక్కలు సరిచూసుకుని, పొత్తులు ఎత్తులు నిర్ణయం అవుతాయి. అయితే,కొన్ని సందర్భాలలో ముందు నుంచి కూడా ఒక, వ్యూహం ప్రకారం పావులు కదుపుతూ రావచ్చును.ఈ విషయంలో, బీజేపీకి ఒక స్పష్టమైన వ్యూహం ఉందని, అనేక రాష్ట్రాలలో ఆ పార్టీ వ్యవహరించిన తీరును బట్టి అర్థమవుతుంది. బీజేపీ ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ ముక్త భారత్. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనంగా ఉన్నా, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీనే బీజేపీ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధిగా చూస్తుంది. కాబట్టి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకొంత పుంజుకుని, తెరాసకు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి వస్తే, బీజేపీ, తెరాసతో చేతులు కలిపేందుకు ఏమాత్రం సంకోచించదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశాలు అంతగా లేవనే పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, దేశంలో ఎలా ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్ క్యాడరుంది. పటిష్ట ఓటు బ్యాంక్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే,పట్టణ ప్రాంత పేదల్లో, కొన్ని కొన్ని సామాజిక వర్గాల్లో కాంగ్రెస్ ఇంకా బలంగానే వుంది. అయితే,అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా, నాయకుల మధ్య ఐక్యత లేదు. ప్రస్తుత పీసీసీ నియామకం విషయాన్నే తీసుకుంటే, ఆలూ లేదు చూలు లేదు, అయినా కొడుకు పేరు ఎదో అన్నట్లుగా, ఢిల్లీలో చిన్నకలయిక రాగానే ఇక్కడ గాంధీ భవన్’లో గందరగోళం మొదలైంది. రేసులు మొదలయ్యాయి. పాత కాపులు, కొత్త ముఖాల మధ్య ఫైట్ మొదలైంది. అలాగే, ఈటల రాజేందర్ విషయంలో కూడా పార్టీ సీనియర్ నాయకుడు హనుమంత రావు, తమదైన శైలిలో పార్టీ రాష్ట్ర నాయకులను తప్పు పట్టారు. నిజానికి, సిద్దాంత పరంగా, భావసారుప్యత పరంగా ఎలా చూసినా ఈటల కాంగ్రెస్ పార్టీలోనే చేరాలి..కానీ, బీజేపీని ఎంచుకున్నారంటే, రాష్ట్రంలో కాంగ్రెస్’కు భవిష్యత్ లేదనే అవగాహానాతోనే కావచ్చును. అది నిజం అయినా కాకపోయినా, అలంటి పర్సెప్షన్ అయితే ఏర్పడింది. అయితే, ఎన్ననుకున్నా, రాజకీయలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. రేపు ఈటల’ మళ్ళీ సొంత ఇంటికి చేరినా ఆశ్చర్య పోనవసరం లేదు . అదే రాజకీయం.