కరోనాతో చనిపోతే రూ.10 లక్షలు, ఐదేళ్లు జీతం.. సేవలోనూ శ్రీమంతుడు..
posted on Jun 3, 2021 @ 11:29AM
సంపదలోనే కాదు.. సేవలోనూ తాము సంపన్నులమేనని నిరూపించుకుంటున్నారు కొందరు. ప్రస్తుత కొవిడ్ కల్లోల సమయంలో ఉద్యోగులకు మేమున్నామంటూ భరోసాగా నిలుస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఇప్పటికే టాటా స్టీల్ సంస్థ తమ ఉద్యోగి కరోనాతో చనిపోతే ఏడాది పాటు అతని కుటుంబానికి నెల నెలా జీతం చెల్లిస్తామని ప్రకటించి అందరి మన్ననలు పొందింది. తాజాగా, టాటాల బాటలో రిలయెన్స్ కూడా చేరింది. కంపెనీ స్థాయికి తగ్గట్టే.. సేవలోనూ అందరికంటే ముందుంది. ఇప్పటికే ప్రత్యేక కొవిడ్ హాస్పిటల్, ఆక్సిజన్ ట్యాంకర్స్, పేదలకు భోజనంతో సామాజిక సేవలో ఉందున్న రిలయన్స్ సంస్థ.. తాజాగా తమ ఉద్యోగుల్లో ధైర్యం నింపే మరో ప్రకటన చేసింది.
సంస్థ ఉద్యోగి ఎవరైనా.. కొవిడ్ బారిన పడి మృతి చెందితే, అతని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనుంది రిలయెన్స్. అలాగే, కరోనాతో మృతి చెందిన ఉద్యోగి.. చివరి నెల జీతం ఎంత తీసుకుంటారో అంతే జీతం ఐదు ఏళ్ల పాటు మృతుని కుటుంబానికి అందించనున్నట్టు వెల్లడించింది.
అంతేకాకుండా మరణించిన ఉద్యోగి పిల్లల చదువులకు అయ్యే ఖర్చు భరిస్తామని తెలిపింది. హాస్టల్ వసతి, ట్యూషన్ ఫీజు, ఇతర విద్యకు సంబంధించిన ఖర్చులన్నీ చెల్లిస్తామని ప్రకటించింది.
ఎవరైనా ఉద్యోగి కరోనా బారిన పడిన సమయంలో వారు కోలుకునే వరకు.. పూర్తి కాలానికి కొవిడ్ సెలవులను పొందవచ్చని తెలిపింది. కరోనా సోకిన ఉద్యోగులపై ప్రత్యేక శ్రద్ద వహిస్తామని.. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇది కదా కావలసింది. ఇలాంటి ధైర్యమే.. కరోనాతో పోరాడేలా బాధితుల్లో స్పూర్తిని నింపుతుంది. ఎంత సంపాదించామనే కాకుండా.. ఎంత తిరిగిచ్చామనే మనసు ఉండటం కూడా ఈ రోజుల్లో గొప్ప విషయమే. అందుకే, రతన్ టాటా, ముకేశ్ అంబానీలు నిజమైన శ్రీమంతులు.