బీజేపీ డైరెక్షన్’లో శశికళ యాక్షన్
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు పంపిన సంకేతాలు తమిళనాడు రాజకీయాలలో సంచలనంగా మారాయి. అయితే, ఆమె వస్తానన్నా, తాము ఆమెను పార్టీలోకి తీసుకోమని, ఆమె అవసరం పార్టీకి లేదని, అన్నా డిఎంకే నాయకులు తెగేసి చెపుతున్నారు. అంతే కాదు, ఎప్పుడోనే పార్టీతో తెగతెంపులు చేసుకున్న ఆమెకు, పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఏ విధమైన సంబంధం లేదని, ఏఐఏడీఎంకే డిప్యూటి కోఆర్డినేటర్ కేపీ మునుసామి స్పష్టం చేశారు. ఆమె చాలా రోజుల నుంచి పార్టీలో లేరని మునుసామి తెలిపారు. పార్టీపై తిరిగి పట్టు సాధించాలనే యోచనతో కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అయితే, జయలలిత మరణంతోనే అన్నా డిఎంకేలో నాయకత్వ సమస్య తలెత్తింది.నిజానికి జయలలిత మరణించిన వెంటనే, ఏఐఏడిఎంకే శాసన సభా పక్షం, జయ స్థానంలో శశికళను నాయకురాలుగా ఎన్నుకుంది. అయినా, అప్పటి రాష్ట్ర ఇన్ - చార్జి గవర్నర్ సీహెచ్. విద్యాసాగర రావు, ఢిల్లీ పెద్దల జోక్యంతో,ఆమెతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించలేదు.ఇంతలో జయలలిత, శశికళ సహా ముద్దాయిలుగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు వచ్చి ఆమె జైలుకు వెళ్ళడంతో కథ మలుపు తిరిగింది.
ఇక అక్కడి నుంచి అన్నాడిఎంకే’ రిమోట్ బీజేపీ పెద్దల చేతికి వెళ్ళింది. ఒకవిధంగా బీజేపీ నాయకత్వం, అన్నా డిఎంకే అధిష్టానం అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. అలాగే, శశికళ కూడా బీజేపీ చెప్పు చేతల్లో, పార్టీ నాయకుల డైరెక్షన్’లోనే నడుస్తున్నారని, సన్నిహిత వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించినా, ఇప్పుడు క్రియాశీల రాజకీయాలలోకి వస్తున్నానని ఫీలర్స్ పంపినా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఢిల్లీ పెద్దలవే అని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె మేనల్లుడు పెట్టిన ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీ అభ్యర్ధులను నిలిపితే తమ మిత్ర పక్షం అన్నా డిఎంకేకి నష్టం. సో, ఢిల్లీ పెద్దలు ఆమె చేత సన్యాసం ప్రకటన చేయించారు. ఇక ఇప్పుడు పళనిస్వామి, పనీర్ సెల్వం వర్గాల మధ్య అంతర్గత విబేధాలు ముదిరి పాకాన పడిన నేపధ్యంలో ఆమె అవసరం ఏర్పడింది. అందుకే ఢిల్లీ డైరెక్షన్’లోనే ఆమె కథకు కొత్త ట్విస్ట్ ఇచ్చారని అంటున్నారు.
అదే నిజం అయితే, పళని, పన్నీర్ ఎమన్నా,అన్నా డిఎంకే నో’ అన్నాశశికళ క్రియాశీల రాజకీయాలలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, లోక్ సభ ఎన్నికల నాటికీ అయినా పార్టీని ఒక ఫోర్సుగా తయారు చేయాలంటే, జయలలిత స్టైల్లో పనిచేసే శశికళ లాంటి స్ట్రాంగ్ లీడర్ కావాలని బీజేపీ బావిస్తోంది కాబట్టి ఆమె క్రియాశీల రాజకీయల్లోకి రావడమే కాదు, పార్టీ పగ్గాలు చేపట్టడం కూడా జస్ట్ మ్యాటరాఫ్ టైం అంటున్నారు. అంతే కాదు, పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లు పళని, పన్నీర్ తగువును శశికళ తీర్చడం ఖాయమని తమిళ రాజకీయ పండితులు అంటున్నారు.