డాక్టర్‌ను చితక్కొట్టిన రోగి బంధువులు.. సీఎం సీరియస్.. 24మంది అరెస్ట్..
posted on Jun 2, 2021 @ 5:43PM
వైద్యో నారాయణో హరి. రోగి బతికితే.. ఆ వైద్యుడు దేవుడవుతాడు. అదే ఆ రోగి మరణిస్తే.. ఆ వైద్యుడిని హంతకుడిగా చూస్తారు. ఓ కొవిడ్ కేర్ సెంటర్‌లో అదే జరిగింది. తమ బంధువు మృతికి కారణం అయ్యాడనే కోపంతో.. జూనియర్ డాక్టర్‌పై దారుణంగా దాడి చేశారు. ఒకరు, ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో బంధువులు ఆగ్రహంతో రగిలిపోతు.. ఆ వైద్యుడిని గొడ్డును బాదినట్టు బాదారు.
అసోంలోని హోజాయ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. డాక్టర్ సియూష్ కుమార్ సేనాపతి హోజాయ్‌లోని కొవిడ్ కేర్ సెంటర్‌లో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన చికిత్స చేస్తున్న కరోనా బాధితుడు చనిపోవడంతో.. ఆ డాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ బంధువులు ఇలా బరితెగించారు. 24 మంది కలిసి.. ఒక్కసారిగా వైద్యుడి మీద పడి కుమ్మేశారు. చేతికి దొరికిన వస్తువులతో దాడి చేశారు.
దాడి వీడియో సోషల్ మీడియాకు ఎక్కడం.. అది కాస్తా వైరల్ కావడంతో వెంటనే ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఈ కేసును స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నట్టు.. దాడి కేసులో 24 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ ట్వీట్ చేశారు. బాధిత వైద్యుడికి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. వైద్యుడిపై దాడి అనాగరిక చర్య అని.. ఫ్రంట్‌లైన్ కార్మికులపై దాడులకు పాల్పడితే.. సహించేది లేదని హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు.
యువ వైద్యుడిపై దాడి ఘటనను అసోం ఐఎంఏ ఖండించింది. ఔట్ పేషెంట్ సర్వీసులను నిలిపివేసి నిరసన తెలిపింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.