జర్నలిస్ట్ రఘు కిడ్నాప్ కలకలం! అరెస్ట్ చేశామన్న సూర్యాపేట పోలీసులు
posted on Jun 3, 2021 @ 3:28PM
తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత కాలంగా కథనాలు రాస్తున్న తొలివెలుగు యూట్యూబ్ చానల్ జర్నలిస్ట్, యాంకర్ రఘు కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపింది. మల్కాజిగిరిలోని ఆయన ఇంటి సమీపంలో ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు వార్తలు వచ్చాయి. నెంబర్ ప్లేట్ లేని జీపులో... తలకు ముసుగు కప్పి, చేతులు కట్టి బలవంతంగా రఘును తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. "కోకాపేట కాందిశీకుల భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కథనాలను ప్రసారం చేస్తే.. ఖబడ్దార్" అంటూ దుండగులు పెద్దపెట్టున కేకలు వేస్తూ జర్నలిస్ట్ రఘును బలవంతంగా జీపు ఎక్కించినట్లు రఘు కుటుంబ సభ్యులు తెలిపారు.
తొలివెలుగు యూట్యూబ్ చానల్లో గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. తెలంగాణ వాదులను, టీఆర్ఎస్ను గట్టిగా వ్యతిరేకించే వాళ్లను రఘు నిత్యం ఇంటర్వ్యూలు చేస్తుంటారు. కోకాపేట కాందిశీకుల భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆయన ఇటీవల తొలివెలుగులో కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ క్రమంలో ఆయన కిడ్నాప్ సంచలనంగా మారింది. అయితే రఘు కిడ్నాప్ ప్రచారానికి తెర దించుతూ తామే అరెస్ట్ చేసి తీసుకెళ్లామని ప్రకటించారు సూర్యాపేట జిల్లా పోలీసులు.
గతంలో సూర్యాపేట జిల్లా గుర్రంపోడులో అసైన్డ్ భూములు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్కడి ఎమ్మెల్యే ఈ భూములను కబ్జా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గుర్రంపోడు వెళ్లారు. అయితే బీజేపీ నేతలు గుర్రంపోడు వెళ్లినప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సదరు న్యూస్‌ను కవర్ చేసిన జర్నలిస్ట్ రఘుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులోనే రఘును అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట జిల్లా పోలీసులు ప్రకటించారు. జర్నలిస్ట్ రఘుపై ఐపీసీ IPC 143, 144, 147, 148, 149, 332, 333 r/w, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈకేసులో రఘు A-19గా ఉన్నాడు. ఈ విచారణలో భాగంగా గురువారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో మల్కాజ్‌గిరిలోని తన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నామని మట్టపల్లి పోలీసులు రఘు భార్యకు నోటీసులు ఇచ్చారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్‌కు పంపుతామని నోటీసుల్లో స్పష్టం చేశారు.
జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేయడంపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మీడియా గొంతు నొక్కెందుకే రఘును పోలీసులే అరెస్టు చేసి వుంటారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆరోపించింది. రఘును తక్షణం విడుదల చేయాలని టీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యకర్శి బసవపున్నయ్య డిమాండ్ చేశారు.