ఆ ఇద్దరు కలిశారా? సీఎం జగన్ రెడ్డి చాప్టర్ క్లోజ్?
posted on Jun 3, 2021 @ 2:39PM
సీఎం జగన్‌రెడ్డి బెయిల్ రద్దుకు అభ్యంతరం చెప్పని సీబీఐ. జగన్‌పై లేటెస్ట్‌గా నమోదైన 18వ కేసులో విజయసాయిరెడ్డి పేరు తొలగింపు. కొంత కాలంగా విజయసాయిని విశాఖకే కట్టడి చేసిన జగన్. అటు తాను ముఖ్యమంత్రి అయితే తప్పేంటంటూ పెద్దిరెడ్డి వ్యాఖ్యలు. ఆయనపై జగన్‌రెడ్డి నిఘా పెట్టారంటూ ప్రచారం..
ఏదో తేడాగా లేదూ? సమీకరణాలు మారిపోతున్నట్టు అనిపించడం లేదూ? రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరుగుతున్నట్టు లేదూ? జగన్‌పై కొత్తగా సీబీఐ కేసు నమోదు అవడం.. సీఎం జగన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై విచారణ వెంటవెంటనే జరుగుతుండటం ఆసక్తికర పరిణామం. బెయిల్ రద్దు నిర్ణయం మీ ఇష్టమేనంటూ కోర్టుకే సీబీఐ ఆప్షన్ వదిలేయడం కీలకాంశం. ఎక్కడో జగన్‌కు వ్యతిరేకంగా పావులు కదులుతున్నాయని.. ఆ ఉచ్చు సీబీఐ కోర్టులో బిగుసుకుంటోందని రాజకీయ వర్గాల అంచనా.
జగన్‌రెడ్డి బెయిల్ రద్దు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి కొన్ని శక్తులు. అందులో అందరికన్నా ముందు ఉండేది ఎంపీ రఘురామ అయితే.. ఆ తర్వాత శక్తి మంత్రి పెద్దిరెడ్డే అంటున్నారు. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా.. జరుగుతున్న రహస్య పరిణామాల గురించి తెలిస్తే నమ్మాల్సిందే. మంత్రి పెద్దిరెడ్డి.. అత్యంత బలమైన నాయకుడు. ఆర్థికంగానూ బాగా నిలదొక్కుకున్న నేత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి పెద్ద మొత్తంలో ఫండింగ్ చేశాడు. ప్రస్తుతం వైసీపీలోని పలువురు ఎమ్మెల్యేలు ఆయన మనుషులే. జగన్ జైలుకు వెళితే..? అనే ప్రశ్న తలెత్తినప్పుడల్లా వినిపించే పేరు పెద్దిరెడ్డిదే. అందుకే, ఆయనలో తాను ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతాననే ఆశ ఎప్పటినుంచో బలంగా నాటుకుపోయింది. అప్పటిదాకా వేచిచూడటం ఎందుకన్నట్టు.. ఇప్పటి నుంచే కార్యచరణ మొదలుపెట్టారటని అంటున్నారు. అందుకే, ఇటీవల ఆయన తన మనసులో మాటను బయటపెట్టేశారు కూడా. అవును, తాను ముఖ్యమంత్రిని అయితే తప్పేంటి? అంటూ ఓ మీడియా సమావేశంలో బయటకు అనేశారు.
తాజాగా, సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు కేసుపై వేగంగా విచారణ జరుగుతుండటం.. జగన్‌కు త్వరలోనే కేంద్రం చెక్ పెట్టడం ఖాయమంటూ ఢిల్లీ నుంచి లీకులు వస్తుండటంతో.. మంత్రి పెద్దిరెడ్డి అలర్ట్ అయ్యారట. వైసీపీలో ఉన్న తన గ్రూపు ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు. ఆ అనుమానంతోనే సీఎం జగన్.. కొంతకాలంగా పెద్దిరెడ్డిపై నిఘా పెట్టారట. మంత్రి గూడుపూటానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చాయని తెలుస్తోంది. అందుకే, ఇటీవల వారిద్దరి మధ్య సఖ్యత చెడిందని చెబుతున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో వైసీపీకి 6 లక్షల మెజార్టీ వస్తుందని అనుకున్నా.. ఆధిక్యం 3 లక్షల లోపునకే పడిపోవడానికి.. మంత్రి పెద్దిరెడ్డే కారణమని జగన్ ఆయన్ను మరింత దూరం పెట్టారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మంత్రి పెద్దిరెడ్డి సైతం ఒంటరివాడేం కాదంటున్నారు. ఆయనతో మరో మాస్టర్ మైండ్ జతకలిశారని చెబుతున్నారు. జగన్ కేసుల్లో ఏ2గా జైలుకెళ్లినా.. ఇంకా తనను జగన్ అనుచరుడిగానే చూస్తున్నారని.. తనను ఎవరూ నాయకుడిగా గుర్తించడం లేదనే అక్కస్సుతో ఉన్నారట విజయసాయిరెడ్డి. తాజా సీబీఐ కేసు, బెయిల్ రద్దు కేసుతో జగన్‌రెడ్డికి ఇబ్బందులు తప్పవనే పాయింట్‌పై .. పెద్దిరెడ్డి, విజయ సాయిరెడ్డిలు ఏకమయ్యారని చెబుతున్నారు. కేంద్రంతో, ఢిల్లీ లెవెల్‌లో మాంచి పరిచయాలున్న విజయసాయి.. తాను కేసుల ఊబి నుంచి బయటపడాలంటే.. జగన్ కంటే మోదీని నమ్ముకుంటేనే బెటర్ అనే భావనలో ఉన్నారట. అందుకే, బీజేపీతో, కేంద్రంతో, ప్రత్యేకించి ప్రధాని మోదీతో విజయసాయిరెడ్డి విపరీతంగా అంటకాగుతున్నారని సీఎం జగన్‌కు ఇప్పటికే రిపోర్ట్ వచ్చిందని తెలుస్తోంది. అందుకే, ఆయనను కొంతకాలంగా విశాఖకే పరిమితం చేశారని.. స్టేట్ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేకుండా.. విజయసాయి స్థాయిని తగ్గించారని చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ల అయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవాల్లోనూ విజయసాయి ఎక్కడా కనిపించలేదు. జగన్, విజయసాయి మధ్య దూరం బాగా పెరిగిపోయిందని అంటున్నారు.
ఈ విషయం గుర్తెరిగే.. ఎన్నాళ్లైనా జగన్ చెంతన ఉంటే తన పరపతి పెరగదని.. మంత్రి పెద్దిరెడ్డితో కలిసి.. అనూహ్య నిర్ణయం తీసుకోవడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. విజయసాయికి కేంద్రం ఆశీసులు దండిగా ఉండటం.. తాజాగా, ఓ సీబీఐ కేసు నుంచి ఆయనకు విముక్తి లభించడం.. అదే సమయంలో జగన్‌రెడ్డిపై కేసులు చకచకా ముందుకు సాగడం.. ఆ రాజకీయ పర్యవసానంలో భాగమే అంటున్నారు. అవసరమైతే జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారుతారని ఢిల్లీ వర్గాల్లో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
సీబీఐ కేసులు కొలిక్కి వచ్చి.. రఘురామ వేసిన బెయిల్ రద్దు పిటిషన్ ఫలించి.. జగన్‌రెడ్డి జైలుకు వెళితే.. ఆయన స్థానంలో ఏ విజయమ్మనో.. భారతమ్మనో.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారు జగన్. ఇన్నేళ్లూ పార్టీకి అంతలా సేవ చేసిన పెద్దిరెడ్డి.. జగన్ కోసం జైలుకు సైతం వెళ్లొచ్చిన విజయసాయిరెడ్డిలు.. ఎప్పటికైనా ముఖ్యమంత్రి పీఠానికి బానిసలుగానే పడుండాలి. అంతేగాని.. వారు జగన్ స్థానంలోకి వచ్చే అవకాశమే లేదు. ఈ తర్కం ఆలస్యంగా బోధపడిన ఆ ఇద్దరు నేతలు.. ఇప్పుడిప్పుడే వాస్తవంలోకి వస్తున్నారు. కట్టప్ప వారసులుగా మిగలడం ఇష్టం లేక.. ఆర్థిక, అంగ బలంతో మంత్రి పెద్దిరెడ్డి.. కేంద్రం దన్నుతో విజయసాయిరెడ్డిలు తమ భవిష్యత్తు ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు. బీజేపీ డైరెక్షన్‌లో వారిద్దరు కలిసి ముందుకు సాగేలా.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా.. రహస్య కసరత్తు చేస్తున్నారని సమాచారం. త్వరలోనే కీలక పరిణామాలకు వైసీపీ వేదిక కాబోతోందని అంటున్నారు. సీఎం జగన్ కేసుల్లో ఏదైనా జరగవచ్చనే చర్చ జరుగుతోంది. అందుకే అంటారు కాబోలు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని.....