ఎవరి తెలంగాణ ఇది? తెరాస ఎవరిది?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు పూర్తయ్యాయి. ఎన్నో ఆశలు, ఆశయాల వేదికగా ఆవిర్భవించిన రాష్ట్రం ఎనిమిదవ ఆవిర్భావం దినోత్సవం జరుపుకుంటోంది.ఈ సందర్భంగా సంబురాలు జరుగుతున్నాయి. సమస్యలూ ఎదుర్కుంటోంది. అన్నిటినీ మించి ఇప్పుడు ప్రధానంగా, తెలంగాణ సాధనలో కీలక పాత్రను పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ఓనరెవరు? ఈ పార్టీ ఎవరిదీ? ఈ తెలంగాణ రాష్ట్రం హక్కుదారులెవరు. ఇది బడుగుల రాజ్యం , బడుగుల రాష్ట్రం, బడుగుల పార్టీనా, లేక దొరల రాజ్యం, దొరల రాష్ట్రం, దొరల పార్టీనా? ఎవరి తెలంగాణ ఇది ? తెరాస ఎవరిదీ? అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదే అంశం రాజకీయ వర్గాల్లో,సామాన్యజనంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, బడుగు నేత ఈటల రాజేందర్’కు ముఖ్యమంత్రి కేసీఆర్ తమ మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికిన నేపధ్యంలో, ఈప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు, కేసీఆర్, పార్టీలో ఉన్న పాత కాపులు అందరినీ ఏరివేస్తూ వస్తున్న క్రమంలో బడుగు నేత ఈటల రాజేందర్’కు ఇటీవల ఉద్వాసన పలికారు. ఈ నేపధ్యంలో, తెరాస ఎవరిదీ? తెలంగాణ ఎవరిదీ? అన్న ప్రశ్న చర్చకు వస్తోంది. బడుగులం మేము తెరాస ఓనర్లమే ఆనందుకే ఆయనపై వేటుపడింది.
అయితే ఇది ఈరోజు మొదలైన చర్చకాదు, కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఎప్పుడు అయితే రాజకీయ అరంగేట్రం చేశారో, అప్పటినుంచే, బయట పడినా పడక పోయినా, పార్టీ భవిష్యత్ స్వరూప, స్వభావాలపై చర్చ మొదలైంది. 2001 జరిగిన పార్టీ ఆవిర్భావ సభ (సింహగర్జన సభ) వేదిక నుంచి కేసీఆర్ తమ కుటుంబ సభ్యులు ఎవరూ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరని, రాజకేయాలోకి రారని చాలా స్పష్టంగా ప్రకటించారు. చివరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాను సైతం పదవువులు ఆశించనని, దళితుని ముఖ్యమంత్రిని చేసి తాను కాపలా కుక్కలా ఉంటానని అన్నారు. అయితే ఆతర్వాత ఏమి జరిగిందో వేరే చెప్పనక్కరలేదు. కొడుకు , కూతురు మాత్రమే కాదు , ముందునుంచి ఉన్న మేనల్లుడు, మరో బంధువు, మరో బంధవు ఇటు పార్టీలో అటు ప్రభుత్వం లోనూ కీలకంగా మారారు.
అయితే ఇదేమీ అనూహ్యం కాదు. ఇలా కాకుండా ఇంకోలా జరిగుంటే, అది ఆశ్చర్యపోవలసిన విషయం అవుతుంది. కేసీఆర్ మాత్రమే కాదు,రేపు ఈటల సొంత పార్టీ పెట్టినా, అది కూడా చివరాఖరుకు, మరో కుటుంబ పార్టీగానే రూపాంతరం చెడుతుంది. దేశంలో ఉన్న ఏ ప్రాతీయ పార్టీ చరిత్ర తీసుకున్నా, అన్ని పార్టీలదీ ఒకటే చరిత్ర. తెరాస అందుకు భిన్నం కాదు. అందుకే, జలదృశ్యం మారి పోయింది. ఉద్యమ పార్టీగా అవిర్భవించిన తెరాస రూపాంతరం చెందింది. రాష్ట్ర ఆవిర్భావంతోనే ఉద్యమ అవతారం చాలించింది. ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీగా అవతరించింది. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఎన్నికలలో విజయం సాధించిన వెంటనే, కేసీఆర్ పలికిన తొలి పలుకులు, చేసిన తొలి ప్రకటన ఇదే.. “తెరాస ఇక ఎంతమాత్రం ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ గా పనిచేస్తుంది” అని ప్రకటించారు. నిజంగా కూడా, ఉద్యమ లక్ష్యం నెరవేరిన తర్వాత, ఉద్యమ పార్టీ అవసరం తీరిపోయిన తర్వాత, పార్టీ కొత్త అవతారం తీసుకోవడం తప్పుకాదు. అయితే, ఉద్యమ లక్ష్యాలను వదిలేసి, చివరకు, ఫక్తు పదహారణాల , ‘కుటుంబ’ పార్టీగా మారిపోవడం, ఉద్యమానికి ద్రోహం చేయడంతో సమానం.
ఇప్పుడు, ఈటలకు ఉద్వాసన చెప్పడానికి కూడా ప్రధాన కారణం అదే. కుటుంబ పాలనను కాదనడమే అయన చేసిన నేరం. కేటీఆర్’ను ముఖ్యమంత్రిని చేయాలన్న, కుటుంబ నిర్ణయాన్ని, పత్యక్షంగా పరోక్షంగా ప్రశ్నించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. అందుకే ఆయన్ని ఆ విధంగా సాగనంపారు. నిజానికి, ఇలా సాగనంపిన వారిలో ఈటల మొదటి వ్యక్తి కాదు, బహుసా చివరి వ్యక్తికూడా కాకపోవచ్చును.
ఇలా కేసీఆర్ రాజకీయ ‘చతురత’ కు చిత్తయిన వారి జాబితా చాలా పెద్దది. నరేంద్రతో మొదలు పెడితే, కేసీఆర్ కంటే ముందునుంచి తెలంగాణ నిదాదాన్ని వినిపించిన ఇన్నయ్య, విజయరామ రావు, రవీంద్ర నాయక్ (ఈయనకు కేసీఆర్ ఇచ్చిన బిరుదు, బంజార గాంధీ, అయితే, అదే గాంధీని తెలంగాణ భవన్ మెట్లు ఎక్కనీయ లేదు. చెప్పులతో కొట్టి , చొక్కా చింపి బయటకు గెంటేశారు),నారయణ రెడ్డి, చెరకు సుధాకర్, సంతోష రెడ్డి, మందాడి సత్యనారాయణ, విజయశాంతి, కొదండ రామ్ ఇలా చెప్పుకుంటూ పోతే, ఇంతకు ముగియనంత జాబితా ఉటుంది.
కాబట్టి, ఇప్పడున్న పార్టీ ఎవరిదో వేరే చెప్పనక్కరలేదు. ఎవరో అన్నట్లుగా ఇది, ఇతర కుటుంబ పార్టీలలానే, తెరాస కూడా ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ ... కాదు, వద్దనుకుంటే ప్రజల ప్రత్యాన్మాయం పుట్టుకురావాలి ... ఇప్పటికైతే, తెరాస ఒక ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ,, తెలంగాణ కంపెనీ ప్రాపర్టీ ..కాదంటే మరో ఉద్యమమే శరణ్యం.