వానలతో హాయ్ హాయ్.. తెలుగురాష్ట్రాల్లో జాయ్ జాయ్..
posted on Jun 3, 2021 @ 10:50AM
జూన్ మొదటివారం. అందరినీ మురిపించే వారం. నైరుతి నాట్యం చేసే కాలం. రుతుపవనాలు రయ్ రయ్ మంటూ దూసుకొచ్చే సమయం. నైరుతి రాకకు చిహ్నంగా.. తెలుగురాష్ట్రాలు మేఘావృతమయ్యాయి. చినుకు చినుకు సందడితో.. ప్రజలంతా ఎండ వేడి నుంచి సేద తీరుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వర్షాలకు తడిసి ముద్దవుతోంది.
ఆగ్నేయ అరేబియా సముద్రంలో బలపడుతున్న నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల రాకతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే రాష్టంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
కోస్తాలో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్ష బీభత్సానికి పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది.
అరకులోయలో పిడుగుపాటుకు 13 ఆవులు, 6 మేకలు మృత్యువాత పడ్డాయి. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
అటు, తెలంగాణలోనూ దాదాపు అన్ని జిల్లాల్లో ముసురు పట్టేసింది. బుధవారం హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురవగా.. సూర్యుడి చుట్టూ రంగుల వలయం ఆవిష్కృతమై.. ఆకాశంలో అద్భుతం దర్శనమిచ్చింది. గురువారం సైతం నగరమంతా వాన పడుతోంది. జిల్లాల్లోనూ ఉదయం నుంచి నాన్‌స్టాప్ రెయిన్. ఉరుములు, పిడుగులతో.. వాతావరణం దడ పుట్టిస్తోంది. మార్కెట్ యార్డుల్లో ధాన్యం నిల్వలు ఇంకా భారీగా ఉండటంతో.. వానలకు తడిసి ముద్దవుతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు.