మిషన్ హుజూరాబాద్.. కేసీఆర్ పక్కా స్కెచ్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయకముందు నుంచే ఉప ఎన్నికల వ్యూహంపై కసరత్తు ప్రారంభించిన ముఖ్యమత్రి, తెరాస అధ్యక్షుడు, కేసీఆర్ ఇప్పుడు తమ వ్యూహానికి మరింత పదును పెడుతున్నారు.అలాగే రాజీనామాకు ముందు నుంచే స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ, పార్టీ వదిలి పోకుండా ముఖ్యమంత్రి పక్కా ఏర్పాట్లు చేశారని, ప్రతి పదవికి ఒక రేటు ఫిక్స్ చేసి, వారిని పార్టీకి కట్టిపడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈటల వర్గం ఆరోపిస్తోంది. స్వయంగా ఈటల రాజేందర్ కూడా అలాంటి ఆరోపణలే చేశారు ఇప్పటికే కోట్లు కుమ్మరించి, స్థానిక ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే, హుజురాబాద్ ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆత్మాభిమానాన్ని చంపుకోరని, తనను వదులుకోరని ఈటల ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రాత్రి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఅర్, మంత్రి హరీష్ రావు, కరీంనగర్ మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్’ తో ప్రత్యేకంగా హుజురాబాద్ ఉప ఎన్నిక వ్యూహరచన పై చర్చించారు. ఈ సమావేశంలో ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని పక్కన పెట్టి, ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో నాగార్జున సాగర్, అంతకు ముందు హుజూర్‌నగర్, ఉప ఎన్నికలలో అనుసరించిన వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించింది. మరోవంక ఆదివారం నుంచే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, కమలాపూర్ మండలాలతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట పురపాలక సంఘాలుండగా వాటన్నింటికి మంత్రులను ఎన్నికల బాధ్యులుగా నియమించనున్నట్లు తెలిసింది. అలాగే, మేజర్ పంచాయతీల బాధ్యతలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రుల సందర్శన, కొవిడ్ రోగుల పరామర్శ పేరున స్వయంగా కరీంనగర్ జిల్లలో పర్యటనకు వెళుతున్నట్లు సమాచారం.
అయితే ఈటల రాజీనామా చేసినా,వెంటనే ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు. సహజంగా, అసెంబ్లీ లేదా లోక్ సభ స్థానం ఖాళీ అయిన తర్వాత ఆరు నెలలలోగా ఉపఎన్నిక జరుగుతుంది. అయితే, కరోనా కారణంగా, ఎమ్మెల్సీ ఎన్నికలు సహా అన్ని ఎన్నికలను, కేంద్ర ఎన్నిక సంఘం వాయిదా వేస్తోంది. ఈ నేపధ్యంలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుంది అనే విషయంలో స్పష్టత లేదు. మరో వంక ఆరునెలల గడువు లోగా ఉపఎన్నిక జరుగుతుందని అనుకున్నా, అప్పటికి, ప్రస్తుత అసెంబ్లీ గడువు మహాయితే, మరో సంవత్సరానికి కొంచెం అటూ ఇటుగా మాత్రమే ఉంటుంది.అయినా, ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ఇప్పటినుంచే కేసీఆర్ పక్కా ప్రణాళికతో పావులు కడుపుతున్నారంటే, ఉపఎన్నికకు ఆయన ఎంత ప్రధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది.
రెండేండ్లు కూడా గడవు లేని స్థానానికి జరిగే ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు, అంటే హుజూరాబాద్ ఉపఎన్నిక కేవలం ఉపఎన్నిక మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలు కావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఉపఎన్నికల్లో తెరాసకు ‘దుబ్బాక’ పునరావృతం అయితే, ఇక ఆ తర్వాత బీజీపీ దూకుడును ఎదుర్కోవడం కొంచెం చాలా కష్టం అవుతుంది. ఇప్పటికే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణలో బెంగాల్ దూకుడు చూపుతామని చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపధ్యంలోనే కేసీఆర్, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నారు.