ఆ జిల్లాలో థర్డ్ వేవ్ మొదలైందా? ఒకే నెలలో 10 వేల మంది చిన్నారులకు కరోనా..
posted on Jun 2, 2021 @ 7:23PM
దేశంలో విలయతాండవం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే క్రమంగా తగ్గుముఖం పట్టింది. సెకండ్ వేవ్ లో ఊహించని విధంగా విరుచుకుపడిన వైరస్.. వేలాది మందిని బలి తీసుకుంది. హాస్పిటల్స్ లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక రోగులు తీవ్ర నరకయాతన అనుభవించారు. కరోనా రోగులతో కొన్ని ప్రాంతాల్లో అత్యంత దయనీయ పరిస్థితులు కనిపించాయి. కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించని తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న జనాలకు.. థర్డ్ వేవ్ వార్తలు భయాందోళన కల్గిస్తున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో థర్డ్ వేవ్ రావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో దశ అంటూ వస్తే చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం చూపవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
థర్డ్ వేవ్ పిల్లలకు గండమనే వార్తలు వస్తుండగానే మహారాష్ట్రలో షాకింగ్ న్యూస్ వెలుగులోనికి వచ్చింది. ఆ రాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లాలో మే నెలలో దాదాపు 10 వేల మంది మైనర్లు కరోనా భారీన పడటం కలకలం రేపుతోంది. మే నెలలో మొత్తం 9,928 మంది చిన్నారులకు కరోనా సోకిందని అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే తెలిపారు. ఇందులో 97 శాతం మంది చిన్నారుల్లో కరోనా లక్షణాలు కనిపించలేదని వెల్లడించారు. కొవిడ్ సోకిన మొత్తం 9,928 మంది మైనర్లలో 11-18 ఏళ్ల వయసు గల వారు 6,787 మంది ఉండగా.. 1-10 సంవత్సరాల లోపు చిన్నారులు 3052 మంది ఉన్నారు. మరో 89 మంది ఏడాది లోపు పిల్లలు. మేలో అహ్మద్‌నగర్ జిల్లాలో మొత్తం 86 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.
అహ్మద్ నగర్ జిల్లాలో దాదాపు 10 వేల మంది చిన్నారులు కరోనా భారీన పడటంతో.. ఆ జిల్లాలో థర్డ్ వేవ్ మొదలైందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే చిన్నారుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అహ్మద్ నగర్ జిల్లా పిడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ మెంబర్ సచిన్ సోలత్ చెబుతున్నారు. మే నెలలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల్లో చిన్నారుల శాతం 11.5 మాత్రమే,, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదన్నారు. కొవిడ్ పాజిటివ్‌గా గుర్తించిన 97 శాతం మంది చిన్నారుల్లో కరోనా లక్షణాలు లేవన్నారు. ఉమ్మడి కుటుంబాల్లో అందరూ ఒకేచోట నివసిస్తున్నందున చాలా మందికి పెద్ద వాళ్ల నుంచే కరోనా సోకి ఉండొచ్చని సచిన్ సోలత్ తెలిపారు.
మరోవైపు అహ్మద్ నగర్ జిల్లాలో 10 వేల మంది చిన్నారులకు కరోనా సోకిందన్న వార్తలతో మహారాష్ట్రలోని ఇతర ప్రాంత ప్రజల ఆందోళన పడుతున్నారు. మూడో దశ వచ్చేసిందని, తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలంటూ భయపడిపోతున్నారు. కరోనా సోకకుండా తమ పిల్లలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.