మతం మారితే ఉద్యోగం ఉష్ ..కాకీ ..
posted on Jun 2, 2021 @ 5:54PM
దేశంలో రిజర్వేషన్ల దుర్వినియోగం గురించి, ఎప్పటికప్పుడు ఎన్నో విధాల చర్చ జరుగుతోంది.అలాగే, కోర్టు తీర్పులు, వస్తూనే ఉన్నాయి, అయినా, దుర్వినియోగం సాగుతూనే వుంది. ఇందుకు సంబంధించి,తాజాగా మద్రాస్ హై కోర్టు స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. మార్గదర్శకాలను జారీచేసింది. మతం మారిన వ్యక్తి, అప్పటికే పొందిన రిజర్వేషన్ సదుపాయంతో పాటుగా, భవిష్యత్ ప్రయోజనాలను కూడా కోల్పోతారని, మద్రాస్ హై కోర్టు తాజా తీర్పులో పేర్కొంది.
వివరాలలోకి వెళితే, కోయంబత్తూర్’లోని భారతియార్ యూనివర్సిటీలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (లైబ్రరీ) నియామకం, తదనంతరం టెక్నికల్ ఆఫీసర్’గా పొందిన పదోన్నతికి సంబంధించి దాఖలైన పిటీషన్’పై విచారణ జరిపిన హై కోర్టు నాయయమూర్తి, జస్టిస్ ఆర్. మహదేవన్, ‘మతం ప్రాతిపదికన రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ పరిధిలో ఉద్యోగం పొందిన వ్యక్తి నియామకానికి ముందు లేదా తర్వాత మతం మారితే, వారు ఆ ఉద్యోగంలో కొనసాగే హక్కును కోల్పోతారు, అలాంటి ఉద్యోగిని ఉద్యోగం నుంచి తక్షణం తొలిగించాలి’ ఆని న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతే కాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా, నియామకం జరిపిన సెలక్షన్ కమిటీ సభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి యూనివర్సిటీని ఆదేశించారు.
అయితే, దురదృష్టం ఏమంటే, కోర్టు ఆదేశాలను యూనివర్సిటీ పట్టించుకోలేదు. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్’గా నియామకం పొంది, టెక్నికల్ ఆఫీసర్’గా పదోన్నతి పొందిన గౌతమ్, నియామకం రద్దు చేయలేదు. ఈలోగా ఆయన, పదవీ విరమణ చేశారు. కాగా,ఇప్పుడు తాజాగా నాయయస్థానం ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపేయమని ఆజ్ఞాపించింది. అంతే కాదు, సదరు వ్యక్తి అనర్హుడని తెలిసినా, యూనివర్సిటీ రిజిస్టార్’ నిబంధనలను పెడచెవిన పెట్టి అక్రమాలు కొంసగించారు, కాబట్టి, అక్రమ నియామకాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా అభ్యర్ధులు ఉద్దేసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఉద్యోగం పొందినా , వెంటనే ఉద్యోగం నుంచి తోలోగించదాంతో పాటుగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.
నిజానికి, మద్రాస్ హై కోర్టు ఒక నిర్దిష్ట కేసుకు సంబంధించి ఇచ్చిన డైరెక్షన్స్ అయినా, దేశంలో మతపరమైన రిజర్వేషన్లు అనేక విధాల దుర్వినియోగం అవుతున్న ఉదంతాలు అనేక వెలుగు చూస్తున్నాయి. ఉదాహరణకి, ఆంధ్ర ప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, మతం మారినప్పటికీ షెడ్యూల్డ్ కులాలకు ఉద్దేశించిన రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులకు సంబంధించి అనేక ఆరోపణలున్నాయి. అంతే కాదు, ఏపీలో ఎండోమెంట్స్ డిపార్టుమెంటులోనూ అక్రమమార్గంలో నియమకాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి.
ఈ నేపధ్యంలో, విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాల్లో రిజర్వేషన్లు పొందే ఉద్దేశంతో క్రైస్తవంలోకి మారినప్పటికీ అధికారిక రికార్డుల్లో ఆ విషయాన్ని తెలియజేయకుండా దాచిపెడుతున్న ఉదంతాలకు సంబంధించి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర పాటి దృష్టికి తీసుకెళ్ళింది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకుని, సంబంధిత చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ (సోషల్ వెల్ఫేర్ విభాగం)ని కోరింది. అయితే, కోయంబత్తూర్ యూనివర్సిటీ’లానే ఏపీ ప్రభుత్వంలో కూడా చలనం లేదు. కేంద్రం నుంచి తాఖీదులు అంది సుమారు సంవత్సరం పైనే అయింది. మరోవంక వైసీపీ, రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, ఇదే విషయంగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
అదలా ఉంటే, ఆంధ్ర ప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాల్లో, పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు, అంతకు ముందు లేదా ఆ తర్వాత బాప్టిజం తీసుకున్న ఉదంతాలున్నాయి. ఏపీ హోం మంత్రిపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి..మరి వీరి మీద చర్యలుండవా ... వీరిపై అనర్హత వేటు పడదా ? చట్టం ముందు అందరూ సమానం కాదా ..