సాహో రంజిత్.. సొంత కారులో కరోనా రోగుల తరలింపు
posted on Jun 2, 2021 @ 9:10PM
కరోనా వైరస్ సోకిందంటే చాలు రోగిని తమవాళ్లే వదిలేస్తున్న పరిస్థితి.. వాళ్లవైపు చూడటానికి కూడా పక్కింటివాళ్లు భయపడిపోతున్నారు. పాజిటివ్ వచ్చిందని తెలియగానే ప్రాణ స్నేహితులు కూడా పత్తా లేకుండా పోతున్నారు.. కరోనాతో చనిపోతే అనాథలుగా అంత్యక్రియలు జరుగుతున్న ఘటనలు చూస్తున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొందరు మాత్రం ప్రాణాలకు తెగించి బాధితులకు అండగా నిలుస్తున్నారు. కొవిడ్ రోగులకు తమ వంతు సాయం చేస్తూ రియల్ హీరోస్ అనిపించుకుంటున్నారు.
సొంతవాళ్లే దగ్గరకు రాని సమయంలో కరోనా రోగులకు అన్నీ తానై ఔరా అనిపించుకుంటున్నారు ఖమ్మంకు చెందిన యువకుడు నల్లమళ్ల రంజిత్. ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్‌లో చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తుంటారు రంజిత్. అయితే కరోనా సోకిన రోగులు హాస్పిటల్ కు వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను గమనించారు. అంబులెన్సుల కోసం వేలకు వేల చెల్లించలేక పడే బాధలను చూశాడు. కరోనా రోగులకు తాను ఏదో ఒకటి చేయాలని తలంచాడు. అంతే మంచి ఆలోచన చేశాడు. తన కారునే అంబులెన్సుగా మార్చేశారు నల్లమల్ల రంజిత్.
కరోనా బాధితులను తన ఇన్నోవా కారులో ఆస్పత్రులకు చేరుస్తూ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. జిల్లాలోని ఇతర గ్రామాల నుంచి ఖమ్మానికి, అవసరమైతే హైదరాబాద్ కు తనకారులో కరోనా రోగులను ఉచితంగానే తీసుకువెళుతున్నాడు రంజిత్. ఇందుకోసం కారులో ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. రోగులకు ఆక్సిజన్ పెట్టేందుకు సౌకర్యాలు కల్పించారు. వ్యాధి తీవ్రంగా ఉన్న రోగులను హైదరాబాద్‌కు కూడా తన వాహనంలో తీసుకుని వెళ్తున్నారు నల్లమల్ల రంజిత్. హైదరాబాద్ తీసుకెళ్లడమే కాదు.. అక్కడి నుంచి తిరిగి సొంత గ్రామాలకు తీసుకువస్తున్నాడు. హాస్పిటల్ లో ఎవరైనా చనిపోయినా.. అతని కుటుంబ సభ్యులు సాయం కోరితే.. తన కారులోనే శవాలను కూడా తరలిస్తున్నాడు నల్లమల్ల రంజిత్.
కరోనా పాజిటివ్ అని తేలగానే సొంత కుటుంబ సభ్యులే ముఖం చాటేస్తున్న రోజుల్లో.. ఆస్పత్రికి తరలిస్తూ ఆపద్బాంధవుడు అయ్యారు నల్లమల రంజిత్.ఇంటి వద్ద చికిత్స పొందుతూ పరిస్థితి విషమించిన రోగులను వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాల్సి ఉంటుంది. అటువంటివారు సాయం అంటూ ఫోన్ చేస్తే స్పందిస్తున్నారు రంజిత్. సొంత వాహనంలో పదుల సంఖ్యలో కరోనా రోగులను ఖమ్మంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు చేరుస్తున్నారు. సొంత వాళ్లే దగ్గరికి రాని పరిస్థితుల్లో రంజిత్ చేస్తున్న సేవ అద్బుతమంటూ అతన్ని స్థానికులు కొనియాడుతున్నారు.
ఖమ్మం జిల్లా నందమూరి యువసేన నాయకులు, తెలుగు యువత అధ్యక్షులు కూడా అయిన నల్లమల రంజిత్.. నందమూరి ఫ్యామిలీ పట్ల వీరాభిమానిగా పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పేద కుటుంబాలకు ఆర్ధికంగా సహకారం చేస్తుంటారు. కరోనా సమయంలోనూ తన సేవలను కొనసాగిస్తున్నారు. బాధితులకు పలు రకాలుగా రంజిత్ అండగా నిలుస్తున్నారు. రంజిత్ చేస్తున్న సేవలను తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ.. అతనికి ఫోన్ చేసి అభినందించారు. కరోనా తగ్గాక ఖమ్మం జిల్లాకు వస్తానని కూడా చెప్పారు. బాలకృష్ణ అభినందనలతో మరింత ఉత్సాహంగా కరోనా రోగులకు సేవ చేస్తున్నారు నల్లమల్ల రంజిత్.