మావోయిస్టులపై కరోనా పంజా! 12 మంది అగ్రనేతలకు సీరియస్?
posted on Jun 2, 2021 @ 6:23PM
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహ్మమారి మారుమూల గ్రామాలకు పాకింది. సెకండ్ వేవ్ లో పట్టణాల్లో కంటే పల్లెల్లోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పల్లెల్ల్లో కాదు కారడవులను కరోనా చుట్టేసింది. అడవుల్లో ఉండే మావోయిస్టులు వైరస్ భారీన పడి అల్లాడిపోతున్నారని తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలోని పలువురు సీనియర్లు, కీలకమైన నేతలు కరోనా సోకడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఓ మావోయిస్టు కీలక నేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని విచారించగా సంచలన విషయాలు తెలిశాయని తెలుస్తోంది.
కరోనా వైరస్ బారిన పడి తగిన చికిత్స కోసం చత్తీస్‌ఘడ్ నుంచి వరంగల్‌కు వస్తున్న మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ అలియాస్ శోభ్రాయ్ అలియాస్ మోహన్‌తో పాటు మరో కొరియర్‌ను వరంగల్ పోలీసులు ములుగు రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మావోయిస్టును జుడీషియల్ రిమాండ్‌కు పంపే క్రమంలో చేసిన వైద్య పరీక్షల్లో అతనికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసులు ఈ కోణంలో ఆరా తీశారు. మావోయిస్టు ఉద్యమంలోని పలువురు కీలక నేతలను సైతం కరోనా చుట్టుముట్టిందని అతను పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీలోని కీలకమైన పన్నెండు మంది నేతలు కొవిడ్ పాజిటివ్‌తో బాధపడుతున్నారని పట్టుబడిన మావోయిస్టులు చెప్పారని తెలుస్తోంది. అగ్ర నేతలు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజి, యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కటకం రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న, కట్టా రాంచందర్‌రెడ్డి అలియాస్ వికల్ప్, మూల దేవేందర్‌రెడ్డి అలియాస్ మాస దడ, కంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, ముచ్చకి ఉజల్ అలియాస్ రఘు, కొడి మంజుల అలియాస్ నిర్మల, పూసం పద్మ, కాకర్ల సునీత అలియాస్ బుర్రా కరోనా సోకిన వారిలో ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి కూడా ఈ విషయాలను ధృవీకరించారు. వీరంతా బయటకు వస్తే చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు.
కొవిడ్ సోకిన వారికి చికిత్స అందించే విషయంలో మావోయిస్టు పార్టీలో తీవ్రమైన ఆంక్షలు విధిస్తోందని తెలుస్తోంది. పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న సమయంలోనే చికిత్సకు అనుమతి ఇస్తున్నారట. మారుమూల గిరిజన గూడేల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో కరోనా సోకిన మావోయిస్టులు పరిస్థితి విషమంగా మారుతుందని చెబుతున్నారు.చత్తీస్‌ఘడ్‌లోని బీజపూర్ జిల్లా సిల్గేర్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపును వ్యతిరేకిస్తూ మేనెల మూడో వారంలో చత్తీస్‌ఘడ్, తెలంగాణ సరిహద్దు గ్రామాలకు చెందిన వేలాది మంది గిరిజనులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా కోవిడ్ పాజిటివ్ ఉన్న వారిని మావోయిస్టు నాయకులు కలవడం వల్ల వారికి వైరస్ సోకిందని భావిస్తున్నారు.
మరోవైపు అడవుల్లో ఉండే మావోయిస్టులకు కరోనా సోకడంతో దండకారణ్యంలో భయాందోళన వ్యక్తమవుతోంది. గిరిజన, ఆదివాసి తండాలకు వైరస్ వ్యాప్తిస్తే పరిస్థితి చాలా కఠినంగా మారుతుందని, వైరస్ ను కంట్రోల్ చేయడం కష్టమన్నది వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు గిరిజన తండాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా లేదు. తాజాగా వెలుగుచూసిన ఘటనతో ప్రభుత్వ యంత్రాంగాలు కలవరపడుతున్నాయి.