భర్తల కోసం గృహహింస చట్టం లేకపోవడం దురదృష్టం.. చెప్పుల సామెత చెప్పిన హైకోర్టు..
posted on Jun 2, 2021 @ 7:31PM
498A. గృహహింస చట్టం. భార్యల చేతిలో బ్రహ్మాస్త్రం. ఈ సెక్షన్ ప్రకారం కేసు పెడితే చాలు. ఇక ఆ భర్తకు చుక్కలే. కోర్టులు చుట్టూ తిరగలేక.. తోక ముడవాల్సిందే. భర్తే తాను భార్యను హింసించలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కేసు పెట్టిన వెంటనే ఎలాంటి విచారణ లేకుండా అరెస్ట్ చేసే అధికారమూ ఉంటుంది. ఇన్ని పవర్‌ఫుల్ వెపన్స్ ఉన్నాయి కాబట్టే.. 498A, గృహహింస చట్టం పేరు వినగానే భర్తలకు ముచ్చెమటలు పడుతుంటాయి. అయితే.. ఈ చట్టాన్ని చాలామంది భార్యలు దుర్వినియోగం చేస్తున్నారని.. తప్పుడు కేసులు పెట్టి.. భర్తలను అనవసరంగా వేధిస్తున్నారనే అభియోగమూ ఉంది. అందుకే, తాజాగా ఓ గృహహింస కేసులో మద్రాసు హైకోర్టు ఆసక్తికర కామెంట్లు చేసింది.
భార్యపై తప్పుడు కేసు పెట్టడానికి.. భర్తల కోసం గృహ హింస చట్టమంటూ ఒకటి లేకపోవడం దురదృష్టమంటూ వ్యాఖ్యానించింది. శశికుమార్ అనే వెటర్నరీ వైద్యుడు వేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ ఎస్. వైద్యనాథన్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
మద్రాసు హైకోర్టు ముందుకు వచ్చిన ఆ కేసులో అనేక ట్విస్టులు ఉన్నాయి. 2015లో, ప్రభుత్వ ఉద్యోగి శశికుమార్‌పై అతడి భార్య గృహ హింస కేసు పెట్టింది. ప్రతిగా, తన భార్యే తనను చిత్రహింసలు పెట్టిందని, తనను వదిలేసి వెళ్లిపోయిందంటూ శశికుమార్ సైతం ఫిర్యాదు చేశారు. కేసుపై కోర్టులో విచారణ జరిగి.. విడాకులు రావడానికి 4 రోజుల ముందు సదరు భార్య.. భర్తను ఇరికించే మరో పని కూడా చేసింది. భర్త పనిచేసే యానిమల్ హస్బెండ్రీ అండ్ వెటర్నరీ సర్వీసెస్ డైరెక్టర్‌కూ తన భర్తపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. దీంతో శశికుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆ మర్నాడే, ఆ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.
తనను సస్పెండ్ చేయడంపై శశికుమార్ హైకోర్టులో కేసు వేశారు. తాజాగా, ఆ కేసు విచారణలో భాగంగా జస్టిస్ వైద్యనాథన్.. పిటిషనర్‌ను కావాలనే ఇబ్బందులకు గురిచేసినట్టుందని అన్నారు. విడాకులు వస్తాయని ముందే తెలిసీ ఆమె ఇలా ఫిర్యాదు చేసినట్టు అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మంచి ఉపదేశమూ ఇచ్చారు.
భార్యాభర్తలు తమ అహాన్ని పాదరక్షల్లా చూడాలని, ఇంటి బయటే దానిని వదిలేసి రావాలని సూచించారు. లేదంటే దాని ఫలితాన్ని పిల్లలు అనుభవించాల్సి వస్తుందన్నారు. ఓ వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది పవిత్రమైన కార్యమని.. తలపాగా తీసేసినంత ఈజీగా బంధాన్ని తెంచుకోవద్దని సూచించారు జస్టిస్ వైద్యనాథన్. పిటిషనర్ శశికుమార్‌ను 15 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.