పంజాబ్’లో వాక్సిన్ కుంభకోణం
ఓ వంక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కొవిడ్ 19 వాక్సిన్, దేశ ప్రజలు అందరికీ ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ప్రధాని మోడీ ప్రభుత్వం వాక్సిన్ పాలసీ, చెత్తగా, చండాలంగా ఉందని, ఊరూరా తిరిగి విమర్శిస్తున్నారు. దేశంలో కారోనా సెకండ్ వేవ్’కు మోడీ చేతకాని తనమే కారణమని, చాలా తీవ్రమైన పదజాలంతో ప్రధాని మోడీని దూషిస్తున్నారు. మరో వంక కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ప్రభుత్వం,కేంద్రం ఉచితంగా ఇచ్చిన వాక్సిన్’ను ప్రైవేటు, ఆసుపత్రులకు అమ్ముకుంటోందని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజంగా, ఇది చాలా దుర్మార్గపు చర్య. ప్రజలు ప్రాణాలతో వ్యాపారం చేసే నికృష్టపు చర్య.
ఇంతవరకు కరోనా సెకండ్ వేవ్ విషయంలో, అదే విధంగా వాక్సిన్ పాలసీ విషయంలో విపక్ష్లాల విమర్శలకు సమాధానం చెప్పుకోలేక, సతమతముతున్న మోడీ ప్రభుత్వానానికి పంజాబ్ ప్రభుత్వం ఎదురు దాడికి అస్త్రాన్ని అందించింది. ప్రైవేటు ఆసుపత్రులకు వాక్సిన్ విక్రయానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో, బీజేపీకి అస్త్రంలా చిక్కింది. బీజేపీ కేంద్ర మంత్రి హర్దీప్ పూరీని రంగంలోకి దించింది. పూరీ, శనివారం పంజాబ్ ప్రభుత్వం పై ఎటాక్ స్టార్ట్ చేశారు. వాక్సిన్ అక్రమ విక్రయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, విచారణ జరిపితే, భయంకరమైన నిజాలు బయటకు వస్తాయని, ‘ముఖ్య’ నేతల గుట్టు రట్టవుతుందని అంటున్నారు.
నిజానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వాక్సిన్ అక్రమ అమ్మకాల విషయంలో, వేరే విచారణ అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న జీవో ఉత్తర్వులే అందుకు సాక్ష్యంగా నిలుస్తాయని, కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో పంజాబ్ ప్రభుత్వం రూ.38 కోట్ల అవినీతికి పాల్పడిందని హర్దీప్ పూరీ వరస అస్త్రాలను సంధించారు. అలాగే, మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్’లో పెద్ద మొత్తంలో వాక్సిన్’ డంప్’లలో దాచిన విషయాన్నిప్రస్తావిస్తూ, బంతిని, కాంగ్రెస్ కోర్టులోకి నెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పంజాబ్ వాక్సిన్ కుంభకోణానికి సమాధానం చెప్పాలని, బీజేపీ డిమాండ్ చేస్తోంది.ఇప్పుడు ఈ వ్యవహారం, రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయిలో చర్చనీయాంసంగా మారింది.
ఇక ఈ కుంభకోణం వివరాలలోకి వెళితే, పంజాబ్ ప్రభుత్వం కొవిషీల్డ్ వాక్సిన్’ డోస్ రూ. 412కు కొని, వాటిని రెండు ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1000కి విక్రయించింది. ఆ ప్రైవేటు ఆసుపత్రులు, ఒక్కొక్క డోసుకు రూ .1500 నుంచి రూ.1560కి ప్రజలకు అమ్ముకున్నాయి. అయితే, విమర్శలు రావడంతో ప్రభుత్వం, ఇందుకు సంబందించి జారీ చేసిన జీవోను ఉపసంహరించుకుంది. జీవోను అయితే ఉపస్మ్హరించుకుంది కానీ, విమర్శల నుంచి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కావడం లేదు. ఓ వంక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో వంక పార్టీలో ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, మాజీ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూల మధ్య యుద్ధం సాగుతోంది. ఆ ఇద్దరు అగ్ర నేతల మధ్య వివాదం పరిష్కారానికి, కేంద్ర పార్టీ ఏకంగా ఒక కమిటీనే వేసి విచారణ జరుపుతోంది. ఇలాంటి పరిస్థిటిలో వెలుగు చూసిన వాక్సిన్ కుంభకోణం,కాంగ్రెస్ కథను ఏ మలుపు తిప్పుతుందో.. ఎక్కడికి తీసుకుపోతుందో ..