అమ్మిరెడ్డి అవుట్.. తర్వాత అతనేనా? రఘురామ రఫ్పాడిస్తున్నారుగా..
posted on Jun 3, 2021 @ 1:49PM
రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు తన పోరాటం కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రఘురామ.. అక్కడి నుంచే తన పవరేంటో చూపిస్తున్నారు. కాలి గాయాలు తగ్గకపోవడంతో వీల్ చైర్ తోనే ఉంటున్న రఘురామ.. తన అరెస్టు అక్రమమని ఆరోపిస్తూ.. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారు.
రఘురామ రాజు ఎఫెక్ట్ తో గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆయన్ను ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల రఘురామకృష్ణంరాజు అరెస్టు సమయంలోను, ఆ తర్వాత అమ్మిరెడ్డి విమర్శలు ఎదుర్కొన్నారు. తనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చే రేలా ఉత్తర్వులిచ్చినా.. అక్కడి నుంచి డిశ్చార్జ్ కాగానే తనను అరెస్టు చేసేందుకు అమ్మిరెడ్డి ప్రయత్నించారని, ఇందుకోసం పోలీసులను ఆస్పత్రి వద్దకు పంపారని రఘురామరాజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అకస్మాత్తుగా అమ్మిరెడ్డిని బదిలీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రఘురామ కేసు విషయంలో మరో అధికారిపై వేటు పడనుందని తెలుస్తోంది. టీటీడీ అదనపు ఈవోగా పని చేస్తున్న ధర్మారెడ్డిని కేంద్రం వెనక్కి పిలవడం ఖాయమని చెబుతున్నారు. రక్షణ శాఖలో అధికారిగా పనిచేస్తున్న ధర్మారెడ్డి డిప్యుటేషన్‍పై మొదటగా టిటిడి ప్రత్యేక అధికారిగా.. తరువాత ఆ పోస్టును అదనపు ఈవోగా మార్పించుకుని.. తాజాగా ఇంఛార్జి ఈవో బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో ఆర్మీ ఆసుపత్రిలో జరిగిన కుట్రకు సూత్రదారి, తెర వెనుక పాత్రదారి ధర్మారెడ్డే అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‍నాధ్‍సింగ్‍కు ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఎంపీ రఘురాంకృష్ణం రాజు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తనను మరోసారి అరెస్టు చేసేందుకు ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డితో కలిసి అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి కుట్ర పన్నారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
గుంటూరు నుంచి ప్రత్యేకంగా పోలీసు బృందాలను ఆర్మీ ఆస్పత్రికి పంపడం, కొద్ది రోజులు వారు అక్కడే మకాం వేసి ఉండటం, అక్కడి మెస్‌లో వారు భోజనాలు చేయడం వంటి ఆధారాలను కూడా కేంద్ర మంత్రికి ఎంపీ రఘురామ అందజేశారు.రక్షణ శాఖకు చెందిన అధికారి అయిన ధర్మారెడ్డిపై ఆధారాలతో తాను ఫిర్యాదు చేశానని. ఆయనపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవటం ఖాయమని ఎంపీ రఘురాంరాజు అంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్మీ ఆసుపత్రి ఎపిసోడ్‍లో పరోక్ష భాగస్వామిగా వ్యవహరించిన గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని బదిలీ చేసినందున.. ధర్మారెడ్డికి కూడా అదే పరిస్థితి ఎదురవటం ఖాయమంటున్నారు.
ఎప్పటికైనా టిటిడి ఈవోగా బాధ్యతలు చేపట్టాలని ధర్మారెడ్డి కలలు కన్నారు. ఆ కలలను నిజం చేసుకునేందుకు సిఎంవో అధికారులు, సలహాదారుల సూచనలతో ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కెపి.రెడ్డితో ఉన్న పరిచయాన్ని అనుకూలంగా మలుచునేందుకు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. అయితే
ఆ ప్రయత్నాలు ముందుగానే తెలుసుకున్న రఘురాంరాజు ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ధర్మారెడ్డికి, కెపి.రెడ్డికి, పాలకులకు తిరిగి కోలుకోలేనంతగా షాక్ ఇచ్చారని చెబుతున్నారు. ఇక అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించని.. ధర్మారెడ్డిపై పాలకులు, సలహాదారులు కూడా అసంతృప్తిగా ఉన్నారని.. ధర్మారెడ్డి విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.