ఈటల రాజీనామాపై ట్విస్ట్! బైపోల్ కు బీజేపీ భయపడుతుందా..
posted on Jun 3, 2021 @ 10:34AM
కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. భవిష్యత్ కార్యాచరణపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్ర నేతలను కలవడంతో.. ఆయన కమలం గూటికి చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. బీజేపీలో చేరినా.. ఆయన ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారన్నది తేలడం లేదు. నిజానికి మంత్రివర్గం నుంచి తొలగించిన వెంటనే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. తన అనుచరులతో జరిగిన సమావేశంలోనూ ఈటల రాజీనామా చేస్తాననే సంకేతం ఇచ్చారు. కారు సింబల్ పై గెలిచిన పదవి తనకు అక్కరలేదని చెప్పారు. అయితే రాజీనామాను ఈటల ప్రకటించలేదు. కొందరు టీఆర్ఎస్ నేతలు రాజీనామా చేయాలని సవాల్ చేసినా... రాజేందర్ మాత్రం స్పందించలేదు. ఇప్పుడు బీజేపీలో చేరినా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్నది అనుమానంగానే కనిపిస్తోందని అంటున్నారు.
ఈటల రాజేందర్ రాజీనామాపై మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. వారం రోజుల్లో బీజేపీలో చేరతారని బండి సంజయ్ చెప్పారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని తెలిపారు. న్యాయ సలహా తర్వాతే రాజీనామాపై ఈటల నిర్ణయం తీసుకంటారని తెలిపారు. సంజయ్ వ్యాఖ్యలను బట్టి... రాజేందర్ ఇప్పట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవచ్చని తెలుస్తోంది. అసలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి న్యాయ సలహా తీసుకోవడం ఏంటన్న చర్చ వస్తోంది. గతంలో ఎంతో మంది నేతలు.. వేరే పార్టీలో చేరినప్పుడు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఈటల రాజీనామా చేయాలని కోరుకుంటోంది. ఇలాంటి సమయంలో న్యాయ సలహా తీసుకోవాల్సిన అవసరం ఏంటన్నది ఎవరికి అర్ధం కావడం లేదు.
తెలంగాణ బీజేపీ నేతలు, ఈటల రాజేందర్ కదలికలను బట్టి.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాకుండా ఉండాలని వాళ్లు కోరుకుంటున్న
ట్లు కనిపిస్తోంది. ఈటలను కేబినెట్ నుంచి తొలగించిన వెంటనే హుజురాబాద్ పై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. పార్టీ కేడర్ తో మాట్లాడాలని మంత్రి గంగుల కమలాకర్ ను పంపించారు. బోయినపల్లి వినోద్ కుమార్ కూడా అదే పనిలో ఉన్నారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు హుజురాబాద్ బాధ్యతలు అప్పగించారనే చర్చ జరుగుతోంది. ఆ నియోజకవర్గ నేతలతో హరీష్ రావు చర్చలు జరపడం ఇందుకు బలాన్నిస్తోంది. ఇటీవలే మండలానికో నేతను ఇంచార్జ్ గా నియమించారు కేసీఆర్. వాళ్లంతా నియోజకవర్గంలో తిరుగుతూ.. గులాబీ కేడర్ అంతా పార్టీలోనే ఉండేలా చూస్తున్నారు. ఇతర పార్టీల నేతలకు గాలం కూడా వేస్తున్నారు. ఇప్పటికే హుజురాబాద్ మున్సిపాలిటీలోని ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు గులాబీ కండువా కప్పుకున్నారు. త్వరలో మరికొందరు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు కారు ఎక్కనున్నారని తెలుస్తోంది.
హుజురాబాద్ పై కేసీఆర్ ఫోకస్ చేయడంతో.. ఉప ఎన్నికకు బీజేపీ భయపడుతుందని తెలుస్తోంది. తన రాజీనామా తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలవకపోతే తన రాజకీయ జీవితం సమాధి అయినట్లేనని రాజేందర్ కుడా భయపడుతున్నారట. ఉప ఎన్నికల్లో గులాబీ బాస్ వ్యూహాలు అద్బుతంగా ఉంటాయని చెబుతారు. గతంలో జరిగిన చాలా ఉప ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాల ముందు విపక్షాలు నిలవలేకపోయాయి. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ బై పోల్ లోనూ కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని చిత్తుగా ఓడించింది అధికార పార్టీ. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు రాజేందర్ కు తెలుసు కాబట్టే ఆయన వెనుకాడుతున్నారని చెబుతున్నారు. అన్ని అంశాలు పరిశీలంచాకే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని ఈటలతో పాటు కమలం నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు.
మరోవైపు ఈటల రాజేందర్ ఈ నెల 4న టీఆర్ఎస్ కు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. రాజీనామా చేసిన తర్వాత రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని ఈ నెల 8 లేదా 9 న బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఈటెల గురువారం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ముందు ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేసి.. మంచిరోజు చూసుకుని ఢిల్లీకి వచ్చి బీజేపీలో చేరతానని రాజేందర్ అన్నట్లు సమాచారం. ఈటల సహా మొత్తం అయిదుగురు నేతలు బీజేపీలో చేరనున్నట్లు చెబుతున్నారు.