ఇద్దరు సీనియర్ IASల ఫైట్! రూ. 12 కోట్లు ఏమయ్యాయో.. ? 

కరోనా మహమ్మారితో దేశమంతా పోరాడుతోంది. ఫ్రంట్ లైన్ వర్కర్స్ ప్రాణాలకు తెగించి కరోనా కట్టడికి శ్రమిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కొందరు అధికారులు నీచంగా వ్యవహరిస్తున్నారు. కాసుల కక్కుర్తితో స్కాములకు తెగబడుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులే కాదు కొందరు ఐఏఎస్ అధికారులు కూడా అత్యంత దిగజారి వ్యవహరిస్తున్నారు. తాజాగా కోవిడ్ కంట్రోల్ కోసం కేటాయించిన డబ్బుల విషయంలో ఇద్దరు ఐఏఎస్ లు మధ్య జరిగిన గొడవ తీవ్ర కలకలం రేపుతోంది.  కర్నాటకలో ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల మధ్య వివాదం రచ్చకెక్కింది. మైసూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్, డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తనను రోహిణి సింధూరి వేధించారంటూ శిల్పా నాగ్ పదవికి..రాజీనామా చేయగా.. తానేమీ వేధించలేదని, ఆమె ఆరోపణలు నిరాధారమని రోహిణి కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య రగడకు 12 కోట్ల రూపాయలే కారణమని తెలుస్తోంది.  కొవిడ్ కంట్రోల్, చికిత్స కోసం గ్రామాలకు డాక్టర్ల మార్చ్  పేరిట కర్ణాటక సర్కార్ నిధులిస్తోంది. కొవిడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా రూ. 12 కోట్ల కార్పొరేట్ ఫండ్ ను మైసూర్ కార్పొరేషన్ కు  కేటాయించింది. ఈ నిధుల గురించి తాను కమిషనర్ శిల్పా నాగ్ ను ప్రశ్నిస్తే ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతోందని రోహిణి ఆరోపించింది. ఈ సీఎస్ఆర్ నిధులను ఎలా ఖర్చు పెట్టారని అడిగితే ..ఒక రోజున ప్రజలకు 400 ఇన్ఫెక్షన్లు, మరో రోజున-40 ఇన్ఫెక్షన్లు సోకాయని చెబుతున్నారన్నారు.  జులై 1 నాటికి మైసూరును కొవిడ్ రహిత జిల్లాగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందువల్ల తాము గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా వివరాలను తెలుసుకోదలిచామని రోహిణి చెబుతున్నారు. చీఫ్ సెక్రటరీ రవికుమార్ దృష్టికి అన్ని అంశాలనూ తీసుకు వచ్చామని ఆమె చెప్పారు. తన అనుమతి లేకుండా శిల్పా నాగ్ ప్రెస్ మీట్ ఎలా పెట్టారని రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు డిప్యూటీ కమిషనర్ (రోహిణి సింధూరి) తన అధికారిక నివాసంలో రూ. 50 లక్షల వ్యయంతో స్విమ్మింగ్ పూల్, జిమ్నాసియం ఎలా నిర్మించారో దర్యాప్తు చేయాలని ప్రభుత్వం రీజనల్ కమిషనర్ ని ఆదేశించింది.  మరోవైపు ఇద్దరు మహిళా సీనియర్ ఐఏఎస్ అధికారుల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. అధికారుల మధ్య వివాదంపై  మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ అసమర్థతని చూపుతోందని, ఇంతకీ రూ. 12 కోట్లు ఏమయ్యాయని అన్నారు.

ఈటలతో బీజేపీకి బ‌ల‌మా? బీజేపీతో ఈట‌ల‌కు లాభ‌మా? కేసీఆర్ లెక్కేంటి?

ఎన్నెన్నో అనుకుంటారు. అన్నీ అవుతాయాయేం. రాజ‌కీయాల్లో మ‌రీ అసాధ్యం. ఈట‌ల వ‌స్తారు.. కొత్త పార్టీ పెడ‌తారు.. అంద‌రినీ క‌లుపుకొని కేసీఆర్‌ పోరాడుతారు.. గ‌డీల పాల‌న పోయి గ‌రీబోళ్ల ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని త‌లిచారు.. ఒక‌లా అనుకుంటే.. ఈట‌ల మ‌రోలా నిర్ణ‌యం తీసుకున్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేర‌బోతున్నారు. ఆ ప్ర‌క‌ట‌న చాలా మంది తెలంగాణ‌వాదుల‌కు న‌చ్చ‌లేదంటున్నారు. ఉద్య‌మ వీరుడు.. మ‌రోసారి ఉద్య‌మ బాట ప‌డ‌తాడేమో.. తాము సైతమంటూ క‌దం క‌ద‌ప‌టానికి.. ఈట‌ల వెన‌కాలే న‌డ‌వ‌డానికి.. చాలా మంది సిద్ద‌మ‌య్యారు. కానీ, ఆయ‌న ఆస్తుల ర‌క్ష‌ణ కోస‌మో.. కేసుల కుట్ర‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికో.. కార‌ణం ఏమో తెలీదు కానీ.. జాతీయ పార్టీ బీజేపీకి జై కొట్టారు. సొంత జెండా ఆలోచ‌న వ‌దిలేసి.. కాషాయ కండువా క‌ప్పుకోబోతున్నారు.  బీజేపీలో ఈట‌ల చేరిక ఎవ‌రికి లాభం? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ‌లో బ‌ల‌మైన ఉనికి కోసం క‌సిగా పోరాడుతున్న బీజేపీకి ఈట‌ల చేరిక‌ నిస్సందేహంగా బ‌ల‌మే. క‌మ‌లం పార్టీకి తెలంగాణ‌లో అభిమానులు ఎక్కువే. కానీ, ఆ అభిమానాన్ని ఓట్లుగా మార్చే స‌త్తా గ‌ల నాయ‌కులు త‌క్కువే అని చెప్పొచ్చు. బీజేపీ అంటే.. హైద‌రాబాద్‌లో కూర్చొని కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేసే.. గుప్పెడు మంది నాయకులే అనే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఉంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్ పాల‌న‌పై ప్ర‌జా వ్య‌తిరేక‌త భారీగానే ఉన్నా.. ఆ వ్య‌తిరేకుల‌ను బీజేపీ వైపు మ‌ర‌ల్చే ఛ‌రిష్మా ఉన్న నేత‌ల కొర‌త ఆ పార్టీని వేధిస్తోంది.  ద‌శాబ్దాల త‌ర‌బ‌డి.. విద్యాసాగ‌ర్‌రావు, ద‌త్తాత్రేయ‌, కె.ల‌క్ష్మ‌ణ్‌, కిష‌న్‌రెడ్డిలాంటి సైద్ధాంతిక ప‌ర‌మైన, క్లాస్ లీడ‌ర్లే బీజేపీకి బాస్‌లుగా ఉండేవారు. బండి సంజ‌య్ బీజేపీ అధ్య‌క్షుడిగా వ‌చ్చాక పార్టీలో దూకుడు పెరిగింది. గ్రామ‌స్థాయి కార్య‌క‌ర్త‌పై లాఠీ దెబ్బ ప‌డినా.. బండి సంజ‌య్ నుంచి రియాక్ష‌న్ వ‌స్తోంది. కార్య‌క‌ర్త‌ల‌కు నేనున్నాన‌నే భ‌రోసా క‌ల్పిస్తున్నారు సంజ‌య్‌. కానీ, బండి సంజ‌య్ ఒక్క‌రే.. ఒంటి చేతితో కేసీఆర్‌పై దండ‌యాత్ర చేయ‌లేరు. ఈట‌ల లాంటి బ‌ల‌మైన నాయ‌కుడు జ‌త క‌లిస్తే.. ఇక బీజేపీకి తిరుగుండ‌దు అంటున్నారు. ఈట‌ల‌కు స్టేట్ వైడ్ పాపులారిటీ ఉంది. ఉద్య‌మ నాయ‌కుడిగా మంచి ప‌రిచ‌యాలు, ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఎక్కువే. అందుకే, ఈటల బ‌లం.. ఇక‌పై బీజేపీకి అద‌న‌పు బ‌లంగా మార‌నుంది. సో, ఈట‌ల చేరిక బీజేపీకే లాభం!.. మ‌రి, ఈట‌ల‌కు...? అటు, ఈట‌లకూ తాత్కాలికంగా లాభ‌మేనంటున్నారు విశ్లేష‌కులు. కేసీఆర్ కుట్ర‌లు, కేసులపై పోరాడే ధైర్యం, తెగువ వ‌స్తుంది. కాషాయ‌ జెండా నీడ‌న కాస్తంత‌ సేద తీర‌వ‌చ్చు. సొంత‌పార్టీ పెడితే మ‌నుగ‌డ క‌ష్టం. బీజేపీ అయితే.. ఇప్ప‌టికిప్పుడు త‌న వాయిస్ బ‌లంగా వినిపించేందుకు, గులాబీ బాస్‌పై పోరాడేందుకు స‌త్తా, స‌త్తువ వ‌స్తుంది.  అయితే, బీజేపీలో ఈట‌ల ఎప్ప‌టికైనా టాప్ లీడ‌ర్ కాగ‌ల‌డా? అంటే అనుమాన‌మే అంటున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ లేని ఏ నాయ‌కుడూ.. బీజేపీలో కీల‌క నేత కాజాల‌డు. ఇది చ‌రిత్ర చెబుతున్న స‌త్యం. సంఘ్ ప‌రివార్ ఆశీస్సులు లేని వారికి ఉన్న‌త ప‌ద‌వులు ద‌క్క‌క‌పోవ‌చ్చు. బ‌య‌టి పార్టీల నుంచి వచ్చి.. బీజేపీ త‌ర‌ఫున‌ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అయిన వారు దేశవ్యాప్తంగా ఎక్క‌రంటే ఒక్క‌రు కూడా లేరు. కాబ‌ట్టి, ఈట‌ల బీజేపీ నుంచి సీఎం కేండిడేట్ కానే కారు. అదే, సొంత‌పార్టీ పెట్టుకుని ఉంటే ఆ ఛాన్స్ ఉండేది.  ఇక బీజేపీ అంద‌రిపార్టీ కాదు.. కొన్ని వ‌ర్గాల్లో మాత్ర‌మే క‌మ‌లంపార్టీకి ఆద‌ర‌ణ ఉంద‌నేది వాస్త‌వం. ప్ర‌ధానంగా అర్బ‌న్ ఏరియాల్లో, వ్యాపార వ‌ర్గాల్లోనే బీజేపీకి బ‌లం. గ్రామాల్లో, రైతుల్లో, కూలీల్లో బీజేపీ సానుభూతిప‌రులు త‌క్కువే. ఇక ముస్లింలు బీజేపీని అంట‌రాని పార్టీగా చూస్తారు. ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాలకు క‌మ‌ల‌నాథులు ఇంకా చేరువ కాలేద‌నే చెప్పాలి. బీసీల్లోనూ బీజేపీ ఇంకా పుంజుకోనే లేదు. ఆ ప్ర‌భావం ఈట‌ల‌పైనా ప‌డొచ్చు. ఇన్నాళ్లూ ఈట‌ల‌ను.. అన్ని వ‌ర్గాల వారూ ఆద‌రించ‌గా.. ఇక‌పై బీజేపీ నేత‌గా కొన్ని వ‌ర్గాలకు ఆయ‌న‌ దూరం కాక త‌ప్ప‌దు. అదే స‌మ‌యంలో ఈట‌ల‌ను ఇష్ట‌ప‌డే మ‌రికొన్ని వ‌ర్గాలు బీజేపీకి చేరువ‌చ్చే అవ‌కాశ‌మూ ఉంటుంది.  అటు.. కోదండ‌రాం సార్ సైతం ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఈటల చేరిక వలన బీజేపీకే లాభమన్నారు. ఈటలకొచ్చేదేమీ లేదని వాపోయారు. బీజేపీలో చేరాల‌నే ఈట‌ల నిర్ణ‌యం ఉద్య‌మ‌కారుల‌తో పాటు కోదండ‌రాం సార్‌ను సైతం నిరుత్సాహ ప‌రిచింది. మంచి అవకాశాన్ని ఈటల చేజార్చుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడే శక్తిగా ఈటల మారతారని ప్రజలు భావించారని, ఒక ఫోర్స్‌గా తయారవుతారని తెలంగాణ సమాజం ఈటల వైపు చూసిందన్నారు. ఈటల నిర్ణయంతో కేసీఆర్‌పై పోరాడాలని అనుకున్న వాళ్లు సైతం చల్లబడిపోయారన్నారు. కేసీఆర్ మీద పోరాటం చేస్తే తాను, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కలసివస్తామని ఈటలకు చెప్పామన్నారు కోదండ‌రామ్ వివ‌రించారు. కానీ, ఈట‌ల బీజేపీలో చేరాల‌నే నిర్ణ‌యం.. తెలంగాణ‌లో వ‌స్తుంద‌నుకున్న మ‌రో స్వ‌ప‌రిపాల‌న‌ ఉద్య‌మం.. ఆలోచ‌న స్థాయిలోనే చ‌తికిల‌ప‌డింది. ఈట‌ల లాంటి నేతే.. కొత్త పార్టీ పెట్ట‌డానికి వెన‌కంజ వేశారంటే.. ఇక ఇప్ప‌ట్లో తెలంగాణ గ‌డ్డ‌పై కొత్త‌పార్టీ పెట్టాల‌నే ధైర్యం మ‌రెవ‌రూ చేయ‌క‌పోవ‌చ్చు అంటున్నారు. కేసీఆర్‌కూ కావ‌ల‌సింది ఇదే.  

అరగంటలో పెళ్లి అంతలోనే విషాదం..  

ఏ నిమిషానికి ఏమి జరిజరుగునో ఎవరూహించెదరు.. అనే పాట వినే ఉంటారు.. ప్రస్తుత కాలంలో మృత్యువు ఏ వైపు నుండి వస్తుందో తెలియడం లేదు. కరోనా వైరస్ రావడం వల్ల గత సంవత్సరం నుండి  మరణ వార్తలు ఎక్కువగా  వినిపిస్తున్నాయి. దేశంలో మిగతా విషయాలు పక్కన పెట్టి. మీడియా కూడా రెట్టింగ్ కోసం పరుగులు తీస్తుందని, అనవసరంగా దేశ ప్రజలను  దారి మళ్లించడానికే ఒకే వార్తలు మోస్తున్నారని దేశ ప్రజలకు  సందేహాలు రాకపోలేదు. సరే ఏది ఏమైనా.. ఆ విషయం పక్కన పెట్టి విష్యంలోకి వెళదాం..    ఓపెన్ చేస్తే.. అది కామారెడ్డి జిల్లా. గాంధారి మండలం. జువ్వాడి గ్రామానికి చెందిన మల్లమారి పెద్ద సాయిలు కూతురు మల్లికకు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. అందరికి పెళ్లి పత్రికలు ఇచ్చారు. అమ్మాయి కుటుంబ సభ్యులు, సహాయానికి వెనకుండే,  బంధువులు తినడానికి రెడీ అయ్యారు. జక్కడు జమ్మాడు అందరు కలిసి సుమారు 20 మంది.. ట్రాక్టర్‌లో పెళ్లి సామానుతో తాడ్వాయి మీదుగా కామారెడ్డి లో ఉన్న పెళ్ళికొడుకు ఇంటికి బయల్దేరారు. అంతే రామేశ్వరం వెళ్లిన శనేశారం వెంట ఉన్నట్లు. అరగంటలో పెళ్లి.. ఇంతలో ట్రక్కు రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. వెనక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు పెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. కళ్లుమూసి తెరిసేలోపు పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడిండి. అక్కడికక్కడే ఇద్దరి మృతి చెందగా, 15 మందికి గాయాలు ఈ విషాద ఘటన తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామం వద్ద చోటుచేసుకుంది. బాధితుల  వివరాల ప్రకారం..  పెళ్లికి మరొక అరగంట సమయం ఉందనగా.. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో పెద్దమ్మ ఆలయం మూల మలుపు వద్ద గ్రామానికి చెందిన మరొక పెళ్లి బృందం రోడ్డుపై నుంచి వెళ్తుండటంతో ట్రాక్టర్ డ్రైవర్ సడన్  బ్రేక్ వేసాడు. అప్పటికే వెనక  ట్రాక్టర్ వెనకాలే సుమారు నాలుగు ట్రక్కులు వస్తున్నాయి. అతివేగంగా వస్తున్న ట్రక్కు.. ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ క్రమంలో ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ట్రాక్టర్‌లో ఉన్న పెళ్లి సామగ్రి.. మంచం, బీరువా ఇతర సామాను పెళ్ళికి వెళ్తున్న వారిపై పడటంతో సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆటోలు, 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాడ్వాయి పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. జిల్లా ఆస్పత్రికి తరలించిన వారిలో జువ్వాడి గ్రామానికి చెందిన కాశవ్వ అనే మహిళ మృతి చెందినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తాడ్వాయి ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు.  

ఎంపీ రఘురామ మొబైల్ ఎక్కడ? పీవీ రమేష్ ట్వీట్ కలకలం.. 

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన‌తో పాటు తన కుటుంబ స‌భ్యుల‌కు ఓ మొబైల్ నంబ‌రు నుంచి మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌ని, ఆ నంబ‌రు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుద‌ని తెలిసింద‌ని రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి, ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి  పీవీ ర‌మేశ్ ట్వీట్ చేశారు. దీనిపై ర‌ఘురామ‌కృష్ణ‌రాజు స్పందించాల‌ని ఆయ‌న కోరారు. దీంతో ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ట్విట్టర్ ఖాతాలోనే స్పందించారు. 'ఏపీ సీఐడీ పోలీసులు మే 14న న‌న్ను అరెస్టు చేసిన రోజున నా మొబైల్ ఫోనును అన‌ధికారికంగా స్వాధీనం చేసుకున్నారు. ఇప్ప‌టికీ అది వారి వద్దే ఉంది. దాన్ని తిరిగి ఇచ్చేయాలని శుక్రవారం లీగ‌ల్ నోటీసులు పంపాను. నాలుగు రోజుల క్రితం అందులోని సిమ్ కార్డును బ్లాక్ చేయించాను.. కొత్త సిమ్ కార్డు తీసుకున్నాను' అని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వివ‌రించారు. 'మే 14 నుంచి జూన్ 1 వ‌ర‌కు నేను ఎవ్వ‌రికీ, ఎటువంటి మెసేజ్‌లూ పంప‌లేదు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నా మొబైల్‌ను దుర్వినియోగం చేస్తే కనుక, సునీల్ కుమార్‌తో పాటు ఇత‌రుల‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకునేలా చేస్తాన‌ని హామీ ఇస్తున్నాను' అని ర‌ఘురామ చెప్పారు. దీనిపై స్పందించిన పీవీ ర‌మేశ్ స్ప‌ష్ట‌త ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ మ‌రో ట్వీట్ చేశారు.   రాజద్రోహం కేసులో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును ఏపీ సీఐడీ పోలీసులు మే14 సాయంత్రం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అదే రోజు గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. తనను అరెస్ట్ చేసిన తన ఐఫోన్ ను సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని గతంలోనే రఘురామ కృష్ణం రాజు చెప్పారు. ఇప్పుడు రఘురామ ఫోన్ నుంచి తమ కుటుంబ సభ్యులకు మెసేజులు వస్తున్నాయని రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి పీవీ ర‌మేశ్ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. రఘురామ రాజు ఫోన్ ఎక్కడుంది.. ఆయన నెంబర్ నుంచి మెసేజ్ లు ఎవరు చేస్తున్నారన్నది సంచలనంగా మారింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్ నుంచి మెసేజ్ లు రావడం తీవ్ర అంశంగా మారే అవకాశం ఉంది. అది కూడా గతంలో సీఎం జగన్ కు సలహాదారుగా చేసి.. తర్వాత అతనితో విభేదించి బయటికి వెళ్లిన అధికారి కుటుంబ సభ్యులకు ఆ సందేశాలు రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రఘురామ ఫోన్ సీఐడీ దగ్గరే ఉందా లేక ఎవరైనా బయటివ్యక్తుల చేతికి వెళ్లిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మరోవైపు ఏపీ సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌కుమార్‌కు రఘురామ లీగల్‌ నోటీసు ఇచ్చారు. తన అరెస్ట్‌ సమయంలో పోలీసులు తీసుకున్న ఐ-ఫోన్‌ను తిరిగి ఇవ్వాలంటూ నోటీసులో ఎంపీ పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఐ-ఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదన్న విషయాన్ని కూడా నోటీసులో ఆయన చెప్పుకొచ్చారు. ఫోన్‌లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం ఫోన్‌లోనే ఉందని.. పార్లమెంట్‌ విధులను నిర్వర్తించడానికి ఫోన్ తిరిగి ఇవ్వాలని నోటీసులో తెలిపారు. ఫోన్‌ తిరిగి ఇవ్వని పక్షంలో సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని కూడా నోటీసులో రఘురామ ఒకింత హెచ్చరించారు. అయితే ఈ లేఖపై ఇంతవరకూ సునీల్ స్పందించలేదు.   

జగన్ రెడ్డికి తీన్మారేనా? రఫ్పాడిస్తున్న రఘురామ.. 

ర‌ఘురామ‌. వీడు మామూలోడు కాదురా బాబూ అని జ‌గ‌న్‌రెడ్డి త‌ల ప‌ట్టుకుంటున్నారట. అన‌వ‌స‌రంగా ఎందుకు పెట్టుకున్నామా అని తెగ బాధ‌ప‌డుతున్నారట.. ర‌చ్చ‌బండ‌తో రాజీ ప‌డితే.. ఢిల్లీ స్థాయిలో డ్యామేజీ జ‌రిగేది కాదుగా అని వెక్కి వెక్కి ఏడుస్తున్నారట.. వీడియోల‌తోనే వాడిని వ‌దిలేస్తే.. పార్ల‌మెంట్ స్థాయిలో ప‌రువు పోయేది కాదుగా అని నిద్ర‌లేని రాత్రులు గుడుపుతున్నారట. ర‌ఘురామ అనే పేరు వింటేనే.. జ‌గ‌న్‌రెడ్డి ఉలిక్కిప‌డుతున్నాడరట‌. ఎవ‌రైనా కాంప్ర‌మైజ్ చేస్తే బాగుండంటూ క‌నిపించిన వారిన‌ల్లా వేడుకుంటున్నారట‌. ఇది కాస్త వెట‌కార‌మే అయినా.. ర‌ఘురామ కౌంట‌ర్ అటాక్‌తో గొడ్డుకారం తిన్న వాడిలా త‌యారైంది జ‌గ‌న్‌రెడ్డి ప‌రిస్థితి అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. అవును మ‌రి, ర‌ఘురామ ఎదురుదాడి మామూలుగా లేదు. సుప్రీంకోర్టు, పార్ల‌మెంట్‌, ఎన్‌హెచ్ఆర్‌సీ.. ఇలా దేనినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. త‌న‌కు జ‌రిగిన దారుణంపై, త‌న‌పై జ‌రిపిన థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగంపై.. ఢిల్లీ స్థాయిలో జ‌గ‌న్‌రెడ్డితో చెడుగుడు ఆడుకుంటున్నారు. ర‌ఘురామ‌. ఇక త‌న అరెస్టులో పాత్ర‌ధారులు, సూత్ర‌ధారులైన ప్ర‌తీ ఒక్క‌రినీ.. పేరు పేరుగా శిక్షిస్తున్నారు. గుంటూరు అర్బ‌న్ ఎస్పీ అమ్మిరెడ్డి, ఆర్మీ హాస్పిట‌ల్ రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి, ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్‌రెడ్డి.. ఇలా ఏ ఒక్క రెడ్డినీ వ‌ద‌ల‌డం లేదు ర‌ఘురామ‌. రాజు గారి దెబ్బ‌కు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది చాలామందికి. ఇంట్లోకి చొర‌బ‌డి అరెస్ట్ చేశామా! క‌స్ట‌డీలో కుమ్మేశామా! జైల్లో పెట్టి మూసేశామా! అంతే. క‌ట్టె.. కొట్టె.. తెచ్చె. ఇంతే సింపుల్ అనుకున్నారు. ర‌ఘురామ ఖేల్ ఖ‌తం.. వీడియోల‌ దుకాణం బంద్ అనుకున్నారు. కానీ, మొండిఘ‌టం ర‌ఘురామ ఆ త‌ర్వాత జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు చుక్క‌లు చూపిస్తారని ఆ స‌మ‌యంలో వారికి తెలీదు. సుప్రీంకోర్టులో పోరాడి మ‌రీ బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఢిల్లీ ఎగిరిపోయి.. ఇక అక్క‌డి నుంచి అస‌లైన ఆట మొద‌లుపెట్టారు. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. వీల్‌చెయిర్‌లో వెళ్లి మ‌రీ ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు క‌లిశారు. సీఐడీ క‌స్ట‌డీలో త‌న‌ను కొట్టిన తీరును క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివ‌రించారు. లోక్‌స‌భ స్పీక‌ర్‌ను క‌లిశారు. కాలి గాయాల‌ను చూపించారు. ఎంపీ అయిన త‌న‌పై జరిగిన దాడిని పార్లమెంటుపై జరిగిన దాడిగానే పరిగణించాలని కోరారు. జాతీయ మ‌న‌వ హ‌క్కుల సంఘాన్నీ ఆశ్ర‌యించారు. త‌న‌ను దారుణంగా కొట్టి.. మాన‌వ హ‌క్కుల‌ను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు. ఇలా.. త‌న‌పై ఏపీ ప్ర‌భుత్వం జ‌రిపిన అమానుషంపై దేశ అత్యున్న‌త‌ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌న్నింటి దృష్టికీ తీసుకెళ్లారు ర‌ఘురామ‌. జ‌గ‌న్‌రెడ్డిని ఢిల్లీ స్థాయిలో దోషిగా నిల‌బెట్టారు.  అక్క‌డితో ఆగలేదు ర‌ఘురామ‌. పార్లమెంటు న్యాయ, ప్రజా ఫిర్యాదుల స్థాయీ సంఘం చైర్మన్ భూపేంద్రయాదవ్‌తో పాటు.. వివిధ పార్టీల‌కు చెందిన‌ స‌హ‌చ‌ర పార్ల‌మెంట్ స‌భ్యుల‌కూ లేఖ రాశారు. త‌న‌ను సీఐడీ క‌స్ట‌డీలో ఎలా కొట్టింది.. త‌న‌పై రాజ‌ద్రోహం కేసు పెట్టి ఎలా హింసించిందీ.. అంతా పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రిస్తూ తోటి ఎంపీల‌కు లేఖ రాశారు. దెబ్బ‌ల‌తో క‌మిలిన త‌న కాలి గాయాల ఫోటోల‌నూ లేఖ‌కు జ‌త చేశారు. ఆ ఫోటోలు చేసి.. ఆ లేఖ చ‌దివి.. స‌హ‌చ‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు అవాక్క‌వుతున్నారు. ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఒక గౌర‌వ ఎంపీ ప‌ట్ల‌.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తుందా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  జగన్‌పై 11 సీబీఐ, 6 ఈడీ కేసులున్నాయని, వాటిలో జగన్ ఏ1 నిందితుడిగా ఉన్నారని, జగన్ తో పాటు కేసులు ఎదుర్కొంటున్నవారు జగన్ మంత్రివర్గంలో సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారని.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని తాను సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేసినందుకే త‌న‌ను ఇలా హింసించార‌ని లేఖలో వివ‌రించారు ర‌ఘురామ‌. ఆయ‌న‌ రాసిన లేఖ‌, పంపిన ఫోటోల‌ను.. త‌మ అధికారికి సోష‌ల్ మీడియా వాల్స్‌పై పోస్ట్ చేస్తున్నారు. ర‌ఘురామ‌కు సంఘీభావం వ్య‌క్తం చేస్తున్నారు ప‌లువురు ఎంపీలు. ర‌ఘురామ‌పై జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు చేసిన దారుణాల‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా దుయ్య‌బ‌డుతున్నారు.  ఏపీలో హిట్ల‌ర్ రాజ్య‌మా? అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు  తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, ఎంపీ మాణికం ఠాగూర్. సైద్ధాంతికంగా తాను రఘురామతో విభేదిస్తానని, కానీ ఒక పార్లమెంటేరియన్‌ పట్ల ఈ విధంగా జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య రాజకీయ కార్యకర్తల మాటేమిటి?ఏపీ ప్రభుత్వ క్రూరత్వానికి ఇది నిదర్శనమంటూ ట్వీట్ చేశారు మాణికం ఠాగూర్‌.  క‌ర్ణాట‌కకు చెందిన ఎంపీ హేమ‌ల‌త అంబ‌రీష్‌.. శివ‌సేన‌కు చెందిన ప్రియాంక చ‌తుర్వేది.. ఇలా అనేక మంది ఏపీ ప్ర‌భుత్వ తీరును సోష‌ల్ మీడియాలో నిప్పుల‌తో క‌డిగేస్తున్నారు. అనేక మంది ఎంపీల పోస్టుల‌తో.. ఈ రాష్ట్రం, ఆ పార్టీ అనే తేడా లేకుండా.. యావ‌త్ దేశానికి ఇప్పుడు ర‌ఘురామ ఎపిసోడ్ చేరింది. దేశ‌ ప్ర‌జ‌లంద‌రి ముందు జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం దోషిగా నిల‌బ‌డింది. ఒక ఎంపీని కొట్టిన వైనం.. ఆయ‌న కాలికి అయిన గాయాల ఫోటోలు చూసి.. పార్ల‌మెంట్ స‌భ్యులంతా ఉలిక్కిప‌డుతున్నారు.  ఒక ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డం ఏంట‌ని.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు తీరుపై మండిప‌డుతున్నారు. ప్ర‌స్తుతానికి సోష‌ల్ మీడియాలోనే జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని శిక్షిస్తున్న ఎంపీలు.. రాబోవు పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అస‌లైన శిక్ష విధించ‌డానికి.. ఏపీ స‌ర్కారును పార్ల‌మెంట్ కోర్టులోకి లాగేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే త‌న‌కు న్యాయం చేయ‌మంటూ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు ర‌ఘురామ‌. మ‌రోవైపు, ఎంపీలంతా ముక్త‌కంఠంతో ర‌ఘురామ‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. తాజా వ్య‌వ‌హారంపై కేంద్రం సైతం ఆగ్ర‌హంగా ఉంది. అటు, జాతీయ మాన‌వ‌ హ‌క్కుల సంఘం సైతం విచార‌ణ ప్రారంభించింది. వ‌రుస ప‌రిణామాలు చూస్తుంటే.. వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఎంపీ ర‌ఘురామ‌పై జ‌రిగిన దాడి వ్య‌వ‌హారం ప్ర‌ధాన ఎజెండాగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు పార్ల‌మెంట్ క‌న్నెర్ర‌కు గురికాక త‌ప్ప‌దు. వెయిటింగ్ ఇక్క‌డ అంటూ.. ర‌ఘురామ ఢిల్లీలో కూర్చొని.. తొడ‌గొట్టి స‌వాల్ విసురుతుంటే.. ఏపీలో జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారులో ద‌డ మొద‌లైంది.

పొడుగోడి నెత్తి పోశ‌మ్మ కొట్ట‌డం ఖాయ‌మా? ఈట‌ల మ‌త‌ల‌బేంటి?

పొట్టోడి నెత్తి.. పొడుగోడు కొడితే, పొడుగోడి నెత్తి.. పోశ‌మ్మ కొడుతుంది. ఈ తెలంగాణ‌ సామెత‌ను ప్ర‌స్తావిస్తూ.. ఈట‌ల రాజేంద‌ర్ సీఎం కేసీఆర్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మాట‌లు ఏదో ఆవేశంలో వ‌చ్చిన‌వి కావ‌ని.. వ్యూహాత్మ‌కందా అన్న డైలాగేన‌ని అంటున్నారు. రాజీనామాకు ముందే అంతా క్లారిటీ తెచ్చుకున్నాకే.. భ‌విష్య‌త్ ప‌రిణామం ఇదేనంటూ.. ప్ర‌గతిభ‌వ‌న్‌లో రీసౌండ్ వ‌చ్చేలా ఈ మెసేజ్ ఇచ్చార‌ని చెబుతున్నారు. ఈ సామెత‌లో పొట్టోడు, పొడుగోడు, పోశ‌మ్మ గురించి చ‌ర్చ జ‌రుగుతోంది.  ఈ సామెత‌లోని పొట్టోడు ఇంకెవ‌రు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌రే. ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు పొడుగోడు. అధికారం చేతిలో ఉండ‌టంతో.. పొట్టోడైన ఈట‌ల నెత్తి కొట్టాడు పొడుగోడైన‌ కేసీఆర్‌. భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో ఈట‌ల‌ను కేబినెట్ నుంచి గెంటేసి.. కేసులు బ‌నాయించి.. కొడుకుపైనా కేసులు పెట్టించి.. మ‌స్తు స‌తాయించి.. ఆయ‌నే పార్టీ వీడేలా చేశారు కేసీఆర్‌. ఈ ఎపిసోడ్‌తో పొట్టోడి నెత్తి పొడుగోడు కొడితే.. అనే టాపిక్ కంప్లీట్ అయిపోన‌ట్టే. మ‌రి, పొడుగోడి నెత్తి కొట్టే పోశ‌మ్మ ఎవ‌ర‌నేదే ఇక్క‌డి ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  ఇంకెవ‌రు.. కేంద్ర ప్ర‌భుత్వ‌మే.. బీజేపీనే.. మోదీనే.. అంటున్నారు విశ్లేష‌కులు. అందుకు, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ పదే ప‌దే చేసే వ్యాఖ్య‌ల‌ను ముందుంచుతున్నారు. "కేసీఆర్ జైలుకు వెళ్ల‌డం ఖాయం". బండి సంజ‌య్ నోటి నుంచి అనేకసార్లు వ‌చ్చింది ఈ మాట‌. ఆయ‌న ఊరికే అన‌డం లేద‌ట ఈ డైలాగ్‌. కేంద్రం నుంచి ఆ మేర‌కు లీకులుంటేనే బండి నోటి నుంచి ఈ డైలాగ్ వ‌స్తోందని తెలుస్తోంది. తాజాగా, ఈటల రాజేంద‌ర్ సైతం అదే త‌ర‌హా అర్థం వ‌చ్చే సామెత చెప్ప‌డంతో.. కేసీఆర్ నెత్తి కొట్టేందుకు కేంద్రం సిద్ధ‌మ‌వుతోంద‌నే చ‌ర్చ మ‌రోసారి ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. . తాజాగా ఈట‌ల రాజేందర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరపడం.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో.. త్వ‌ర‌లో తెలంగాణ‌లో సంచలనాలు జరగబోతున్నాయనే సంకేతం వస్తోంది. గులాబీ బాస్ టార్గెట్ గా ఢిల్లీలో కీలక ప‌రిణామాల‌కు ప్లాట్‌ఫాం సిద్ద‌మ‌వుతోందని తెలుస్తోంది. ఏడేండ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతి చేసిందని విపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ నేతలు కూడా పదేపదే ఇవే ఆరోపణలు చేస్తున్నారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో బండి సంజయ్.. త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. తాజాగా మరోసారి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమ వ్యూహం తమకుందన్నారు. సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు పూర్తిగా బ‌య‌ట‌కు తీస్తున్నాం. వారం రోజులుగా సీఎం కేసుల పైనే ఆరా తీస్తున్నాం. ఈ స్కాంలు చూశాకే  కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయింది. త్వరలో ఆయనును జైలుకు పంపించడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున బండి సంజయ్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. పార్టీ పెద్దల నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆధారంగానే సంజయ్ అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. ఇటీవ‌ల ఈట‌ల రాజేంద‌ర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అయిన‌ప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ క‌రెప్ష‌న్ గురించే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. తనపై భూకబ్జా ఆరోపణలు చేసి కేబినెట్ నుంచి తప్పించడంపై రగిలిపోతున్న రాజేందర్.. కేసీఆర్ పైనా అదే స్థాయిలో రివేంజ్ తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకే తాను బీజేపీలో చేరాలంటే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారట ఈట‌ల‌. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క విచారణ కూడా చేపట్టకపోవడాన్ని ప్రజలు అనుమానిస్తున్నారని రాజేందర్ చెప్పారట. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్‌కు ఉన్న ఆస్తులు.. అధికారంలోకి వ‌చ్చాక‌ కేసీఆర్ కుటుంబ స‌భ్యులకు విప‌రీతంగా పెరిగిన సంప‌ద గురించి వివ‌రించార‌ట‌. ప్రాజెక్టుల్లో భారీగా ముడుపులు తీసుకోవ‌డం, పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయ‌డం, ప‌లు కంపెనీల్లో వాటాలు, రిసార్టులు, స్టార్ హోట‌ళ్లు, ఫామ్‌హౌజుల య‌వ్వారం గురించి ఈటల త‌న‌కు తెలిసిన స‌మాచార‌మంతా కేంద్రం ముందుంచార‌ని అంటున్నారు. అవ‌న్నీ ప‌రిశీలించి.. స‌రైన స‌మ‌యంలో కేసీఆర్ కుటుంబ కుంభకోణాలపై విచారణ చేపడతామని జేపీ న‌డ్డా ఈట‌ల‌కు హామీ ఇచ్చారని అంటున్నారు. ప‌శ్చిమ బెంగాల్ తరహాలో.. కేసీఆర్ ముంద‌రి కాళ్ల‌కు బంధాలు వేస్తామ‌ని జేపీ న‌డ్డా గ్యారంటీ ఇచ్చార‌ని స‌మాచారం.  కేంద్రం నుంచి వ‌చ్చిన హింట్ మేర‌కే.. ఈట‌ల రాజేంద‌ర్ న‌ర్మ‌గ‌ర్బంగా ఆ సామెత‌ను ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. పొట్టోడినైన త‌న నెత్తిని పొడుగోడైన కేసీఆర్ కొడితే.. పొడుగోడైన కేసీఆర్ నెత్తిని.. పోచ‌మ్మ అయిన కేంద్రం కొడుతుంద‌ని ఆ సామెత.. అర్థం.. ప‌ర‌మార్థం.. అంటున్నారు. ఇదే తెలంగాణ‌లో జ‌ర‌గ‌బోయే భ‌విష్య‌త్ రాజ‌కీయ ముఖ‌చిత్రం అని ఆ సామెత‌ను విశ్లేషిస్తున్నారు. 

కమ్యూనిస్ట్ కాషాయంలో ఇమడగలరా! ఈటలది చరిత్రాత్మక తప్పిదమా? 

కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. రాజకీయ గమనంపై క్లారిటీ వచ్చేసింది. కారు దిగిన కమలాపుర్ నేత కమలం గూటికి చేరుతున్నారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసిన రాజేందర్.. రేపోమాపో అధికారికంగా బీజేపీ జెండా ఎత్తనున్నారు. కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటల తొలగించగానే.. ఆయన కొత్త పార్టీ పెడతారనే ప్రచారమే ఎక్కువగా జరిగింది. ఎక్కువగా ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల.. బడుగు,బలహీన వర్గాల వాయిస్ గా కొత్త పార్టీ పెడతారనే అంతా భావించారు.  కొత్త పార్టీ లేదంటే కాంగ్రెస్ లో ఈటల చేరతారనే రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. కాని అనూహ్యంగా ఈటల కమలం పార్టీకి జై కొట్టారు. ఆయన నిర్ణయం కొన్ని వర్గాలను ఆశ్చర్యపరిచింది కూడా. కమ్యూనిస్ట్ భావజాలంతో రాజకీయంగా ఎదిగిన రాజేందర్.. కాషాయ పార్టీలో ఇమడగలరా లేదా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.   ఈటల విషయంలో ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజానీకం నుంచి కూడా వస్తోంది. ఈటల రాజేందర్ కూడా అంతర్గత సంభాషణల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారని తెలుస్తోంది. శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఈటల.. తాను లెఫ్టిస్ట్ అయిన తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరాల్సి వస్తుందని చెప్పారట. అంటే ఆయన కూడా అయిష్టంగానే నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈటల రాజకీయ రాజకీయ జీవితం అతివాద వామపక్ష భావజాలంలో మొదలైంది. కొంత కాలం నక్సల్ ఉద్యమంలోనూ ఈటల పని చేశారని అంటారు. ప్రాంతీయ ఉద్యమాలలో కీలక పాత్రను పోషించారు. సుమారు 18 సంవత్సరాల పాటు కేసీఆర్ శిష్యరికం చేశారు. అలాంటి ఈటల బీజేపీ జాతీయ భావజాలం, హిందుత్వ నినాదం, విధానం చట్రంలో ఇమడగలరా? అనేది ఒక కీలక ప్రశ్న.  టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్న సమయంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు.. ఆయనలోని కమ్యూనిస్ట్ భావజాలాన్ని బయటికి తెచ్చాయి. విరసం నేత వరవరరావు అరెస్టును ప్రస్తావించారు రాజేందర్. వరవరరావు విషయంలో ప్రజా సంఘాలు కోరినా కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు.  ఇక్కడే రాజేందర్ లోపలి మనిషి బయటికి వచ్చారంటున్నారు. వరవరరావును కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. ఆయనపై నమోదైన కేసులు కేంద్ర సర్కార్ పరిధిలోనివే. అలాంటప్పుడు వరవరరావు విషయంలో కేసీఆర్ ను తప్పుపడుతున్న రాజేందర్.. ఆయనపై కేసు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీలో ఎలా చేరుతున్నారన్నదే ప్రజా సంఘాల ప్రశ్న. కమ్యూనిస్టుల నిలదీత. దీనిపై క్లారిటీ ఇచ్చే ధైర్యం ఉందా అంటే రాజేందర్ కు లేదని చెప్పాల్సిందే..  ఇక రైతుల గురించి, ఐకేపీ సంఘాల గురించి మాట్లాడారు రాజేందర్. నిజానికి కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టు అని ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తొమ్మిది నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. కేంద్ర చట్టాల ప్రకారం వ్యవసాయ మార్కెట్లు ఎత్తివేయాల్సిందే. కాని తెలంగాణ సర్కార్ మాత్రం వాటిని కొనసాగిస్తోంది. అంతేకాదు దేశంలోని ఏ రాష్ట్రంలో ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా పంట కొనుగోలు చేయడం లేదని, ఒక్క తెలంగాణలోనే కొంటున్నామని టీఆర్ఎస్ చెబుతోంది. గతంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను ఈటల కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐకేపీ సెంటర్ల అంశంలో కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేయడం... ఆయనకే రివర్స్ అవుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ పార్టీలో చేరుతూ.. కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు, పంట కొనుగోళ్లపై మాట్లాడటం వల్ల ఆయనకే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.  మరోవైపు ఎంత చెడ్డా గులాబీ పార్టీలో ఈటలకు ఒక స్థానం గుర్తింపు ఉన్నాయి. బీజేపీలో ఆయనకు అంత గుర్తింపు ఉండక పోవచ్చు. ఎందుకంటే బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి గర్భగుడి ప్రవేశం, అంత ఈజీ కాదు. ఇతర పార్టీలలో కీలక పదవులు, బాధ్యతలు పోషించిన వారు.. బీజేపీలో  ఎక్కువ కాలం ఉన్న సందర్భాలు చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లోనూ అదే జరుగుతోంది. ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన నేతలంతా ఇప్పుడు.. అక్కడ ఇమడలేక సొంత గూటికి తిరిగివెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దగ్గుబాటి వెంకటేశ్వర రావు నుంచి నాగం జనార్ధన రెడ్డి వరకు అనేక మంది  సీనియర్ నాయకులు బీజేపీ చేరినంత  వేగంగా తిరిగి వెళ్ళి పోయారు. దీంతో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ఈటల రాజేందర్ కాషాయ పార్టీలో ఇమడగలరా.. బీజేపీలో ఎంతవరకు ఆయన నెట్టుకురాగలరు.. తన లక్ష్యాన్ని ఆయన సాధించుకుంటారా.. అంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.. 

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబం.. 4  నెలల బాలుడు.. 

వాడికి ఏంట్రా వాడు ఫైనాన్స్ చేస్తాడు వాడి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి. ఫైనాన్స్ చేసేవాడు దగ్గర కుక్కను కొడితే డబ్బులు రాలుతాయి అనే డైలాగ్ నిత్యం ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఫైనాన్స్ అందరికి చేయాలనీ ఉంటుంది. ఫైనాన్స్  అంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా డబ్బులు సంపాదించొచ్చు అనే ధీమా ఉంటుంది. ఈ ఫైనాన్స్ లో సంపాదించి కుబేరులు అయిన వాళ్ళు వున్నారు. అదే ఫైనాన్స్ చేసి అన్ని పోగొట్టుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఫైనాన్స్ లో లాభాలే కాదు, నష్టాలు ఉంటాయి. సరైన మనీ మేనేజ్ మెంట్ లేకపోయినా, సరైన కస్టమర్లు లేకపోయినా ఇక అంతే దుకాణం ముయాల్సిందే. తాజాగా తీవ్రంగా నష్టపోయిన రామకృష్ణ భార్య అనూష సహా ఇద్దరు పిల్లలతో కలిసి బి.కోడేరు మండలంలోని సగిలేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.   ఓపెన్ చేస్తే.. అది  కడప జిల్లా. బి.కోడూరు మండలం. సగిలేరు జలాశయంలో శుక్రవారం ఉదయం దంపతులు, ఇద్దరు పిల్లల మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించడంతో సమీప గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి, బి.కోడూరు ఎస్‌.ఐ.వరలక్ష్మీదేవి ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహాలను వెలికి తీశారు. పూర్తి వివరాలు తెలియరాకపోవడంతో మృతదేహాలను పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సోషల్‌మీడియాలో మృతుల ఫొటోలు వైరల్‌ కావడంతో వీరు పోరుమామిళ్ల పట్టణం శ్రీరామనగర్‌ కాలనీకి చెందిన బళ్లారి రామకృష్ణ (43), అనూష (35) దంపతులు తమ పిల్లలు నిఖిల్‌ (4), కల్యాణ్‌ (నాలుగు నెలలు)గా తెలిసింది. దీంతో పోలీసులు రామకృష్ణ తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. రామకృష్ణ ఫైనాన్స్ వ్యాపారం చేసి తలకు మించిన అప్పులు చేశాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక శుక్రవారం  మధ్యాహ్నం రామకృష్ణ, స్వరూప దంపతులు పిల్లలతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయారని, అప్పటినుంచి వారి సమాచారం తమకు తెలియలేదని రామకృష్ణ తండ్రి పోలీసులకు చెప్పాడు. సోషల్‌మీడియాలో వారి ఫోటోలు చూసి తమవారేనని తెలుసుకున్నామని తెలిపాడు. ఫైనాన్స్ వ్యాపారం చేసే రామకృష్ణ అప్పుల పాలు కావడంతోనే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఫ్రీ వాక్సిన్ ప్లీజ్.. కేంద్రానికి రాష్ట్రాల అభ్యర్ధన 

కరోనా సెకండ్ వేవ్ కొంత సర్దుమనిగింది. దేశంలో కొత్తగా నమోదవుతున్నరోజు వారీ కేసుల సంఖ్య తగ్గుతోంది. మరణాలు కొంత నెమ్మదించాయి. రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. క్రియాశీల కేసులు ఆరు శాతానికి దిగివచ్చాయి. ఇదొక శుభ పరిణామం. కొంత ఊరట ఇచ్చే విషయం. మరో వంక అస్తవ్యస్థంగా మొదలైన టీకాల  కార్యక్రమం (వాక్సినేషన్) మెల్లిమెల్లిగా గాడిన పడుతోంది. దేశంలో తయారవుతున్న వాక్సిన్లతో పాటుగా అందుబాటులో ఉన్న మేరకు విదేశాల నుంచి వాక్సిన్ దిగుమతి చేసుకునే ప్రయత్నాలు  జరుగుతున్నాయి. ఇది కూడా కొవిడ్ ఫ్రంట్’లో స్వాగతించదగిన పరిణామం.  అయితే, అదే సమయంలో వాక్సిన్ విషయంలో, కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సయోధ్యత, సహకారం అవగాహన, ఉండవలసిన విధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.ఒక విధంగా చూస్తే, ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ , రాజకీయ పార్టీలు, ‘దయ్యమా నీ పేరు రాజకీకీయం’ (Devil thy name is politics) అన్న నానుడిని గుర్తుకు తెస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విబేధాల కారణంగా ఒక విధమైన యుద్ద వాతావరణం నెలకొంది. మరో వంక న్యాయస్థానాలు, ప్రభుత్వాలను అంకుశంతో పొడుస్తున్నాయి.  దేశంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కళ్లకూ ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందజేయాలని ఆశిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం గత సోమవారం తెలియజేసింది. కానీ, కేంద్రం, రాష్ట్రాలు, ప్రయివేట్ ఆస్పత్రులకు వేర్వేరు ధరలకు టీకాలు అమ్మకంపై సుప్రీం కోర్టు సందేహలు వ్యక్తం చేసింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ వంటి దేశీయ సంస్థలు ఉత్పత్తి చేసిన టీకాలను దేశంలోని అర్హులైన మొత్తం ప్రజలకు డిసెంబరు చివరినాటికి  ఉచితంగానే అందజేస్తామని సొలిసిటర్ జనరల్ తుషాప్ మెహతా తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరో వంక, అప్పులు చేసైనా, సంక్షేమం పథకాలు అమలు  చేస్తామని చెప్పే ఆంధ్రప్రదేశ్ సహా, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, టీకాల విషయంలో మాత్రం కేంద్రం ముందు చేతులు చాస్తున్నాయి. టీకాల ఖర్చు మొత్తానికి మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే భరించాలని, కేంద్రానికి విన్నవించు కుంటున్నాయి.ఈ విషయంలో దేశంలో మిగిలిన ఏకైక కమ్యూనిస్ట్ రాష్ట్రం కేరళ ముందుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఉచితంగా టీకాలు పంపిణీ చేయాలని, ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకంగా ఏకగ్రీవ తీర్మానమేచేసింది. రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ప్రవేశ పెట్టిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు మద్దతు తెలిపారు. అలాగే, సకాలంలో టీకాల పంపిణీ జరగాలని కూడా కేరళ అసెంబ్లీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది.  ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినాయకురాలు,మమతా బెనర్జీ మరో అడుగు ముందు కేశారు. ఆమె తమదైన స్టైల్లో, ఈ సంవత్సరం అంతానికి దేశంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా వేస్తామని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన మాటను, ఆమె అదంతా బూటకం, డిసెంబర్ ఎండింగ్ నాటికి అందరికీ వాక్సిన్ అయ్యేపనికాదని, అంటున్నారు. మరో వంక మమతా దీదీ, రాష్ట్రాలకు కేంద్రమే ఉచితంగా టీకాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.  నిజమే, ఇప్పుడు కరోనా టీకా ప్రతి ఒక్కరికీ అవసరం. అది కూడా వేగంగా జరగవలసిన అవసరం కాదనలేనిది. సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదు.. మరో వంక  థర్డ్ వేవ్, తలుపులు తడుతోంది. ఇలాంటి పరిస్థితిలో , టీకాకు  అన్నిటికంటే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం వుంది. అయితే, ఈ విషయంలో రాజకీయ డిమాండ్లు చేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం తప్పు మాత్రమే  కాదు , నేరం ... మహాపరాధం.నిజానికి అనేక సంస్థలు తమ ఉద్యోగులకు టీకాలు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నాయి. అలాగే స్వచ్చంద సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి.అదే విధంగా ఇంకా అనేక విధాల సహాయం అందుతోంది. నిజానికి ఇప్పుడు కావలసింది ‘టీకా’ /వాక్సిన్. మార్కెట్’లో లభ్యమైతే కొనుక్కుని తీసుకునేందుకు ఆర్థిక స్థోమతగల ప్రజలు సిద్దంగానే ఉన్నారు.  సో.. రాజకీయ పార్టీలు, ఇతర బాధ్యతాయుత వ్యవస్థలు అనవసర గందరగోళం సృష్టించడం కంటే ... ప్రజల్లో భరోసా పెంచడం మానవత్వం, మనిషితనం అనిపించుకుంటుంది.

దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ ఎప్పుడంటే..!

దేశాన్ని అతలాకతులం చేసిన కొవిడ్ సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టింది. నెల రోజుల క్రితం రోజూ నాలుగు లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం లక్షా 20 వేలకు తగ్గింది. రెండు నెలల కనిష్టానికి దేశంలో కొత్త కేసులు , యాక్టివ్ కేసులు చేరుకున్నాయి. జూన్ చివరికి సెకండ్ వేవ్ పూర్తిగా కట్టడిలోకి వస్తుందని కేంద్ర వైద్యశాఖ అంచనా వేస్తోంది. అయితే సెకండ్ వేవ్ తగ్గుతున్నా.. త్వరలోనే థర్డ్ వేవ్ వస్తుందనే హెచ్చరికలకు వస్తున్నాయి. భారత్ లో థర్డ్ వేవ్ రావడం ఖాయమని కేంద్ర సంస్థ కూడా చెబుతోంది. అయితే అది ఎప్పుడు వస్తుందన్నది స్పష్టత లేదు.  దేశానికి థర్డ్ వేవ్ ముప్పుకు సంబంధించి నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో థర్డ్ వేవ్ రావడం ఖాయమన్నది వైద్య నిపుణుల అభిప్రాయంగా చెప్పారు. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశముందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అప్పటిలోగా వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సిన అవసరముందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియతో మాత్రమే థర్డ్ వేవ్‌తో పాటు తదుపరి వేవ్‌లను కట్టడి చేయగలమని వారు సూచిస్తున్నారు. సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో దేశం విజయం సాధించిందని…అందుకే దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు వీకే సారస్వత్ చెప్పారు. మన శాస్త్ర సాంకేతికత, ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు, ఆక్సిజన్ సరఫరా కోసం రైల్వే సేవల వినియోగం, విమానాశ్రయాల వినియోగం, ఆర్మీ సేవల వినియోగం తదితర చర్యలు మంచి ఫలితాలు ఇచ్చినట్లు విశ్లేషించారు. సెకండ్ వేవ్‌కు ముందు తొలి వేవ్‌ను కూడా దేశం సమర్థవంతంగా కట్టడి చేయగలిగినట్లు వీకే సారస్వత్ చెప్పారు. ఎమర్జెన్సీ మెడికల్ మ్యానేజ్‌మెంట్‌లో దేశం పనితీరు సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్యానించారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశం సన్నద్ధంకావాల్సిన అవసరముందన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్. 

చిత్తూరులో ప్రేమ ఉన్మాదం..

ప్రాంతం ఏదైనా, ప్రభుత్వాలు ఎన్ని మారిన, సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, పేరు ఏదైనా గాని నిత్యం ఆడవారిపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు కొత్తకొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చిత్తూరు నగరంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమోన్మాది కసాయిగా మారి ఆ  యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చివరకు తను కూడా గొంతు కోసుకుని పడిపోయాడు.   ఆమె పేరు సుష్మితకు చిన్నప్పటి నుంచి చదువంటే చచ్చేంత ఇష్టం. అందుకే సుష్మిత అప్పులు చేసి మరీ కూతురిని చదివిచారు. పేద వారమైనా.. ఇరుకు ఇంట్లో ఉంటున్నా ఏనాడూ ఇబ్బంది పడలేదు తాను. చదువే తన సర్వాంగ, చదువే తన కష్టాలు తీరుస్తుందని కష్టపడి చదివింది. కానీ శుక్రవారం ఉదయం సుష్మితను చిన్నా అనే యువడుకు గొంతు కోసి చంపేయగా.. ఆమె కుటుంబసభ్యుల చేతిలో చిన్నా హతమయ్యాడు. ఈ ఘటన చిత్తూరు నగరంతో పాటు రాష్ట్రంలోనే తీవ్ర అలజడి సృష్టించింది. ఈ దారుణ ఘటనతో గతంలో జరిగిన ప్రేమోన్మాద దాడులు ప్రజల కళ్లముందు కదలాడాయి. అసలు వివరాలు..  చీలాపల్లి సీఎంసీలో  సుష్మిత నర్సుగా పనిచేస్తుంది. డ్యూటీ నిమిత్తం ఆమె సోదరుడు సునీల్‌ రోజూ మధ్యాహ్నం బైక్‌పై తీసుకెళ్లి.. మరుసటి రోజు ఉదయం ఇంటికి తీసుకొచ్చేవాడు. కట్ చేస్తే.. అదే ప్రాంతానికి చెందిన  పని లేని ఒక పోరంబోకు, వాడి పేరు చిన్న సుస్మితను కొంతకాలంగా ప్రేమిస్తున్నాను అంటూ, ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో ఈ ఏడాది జనవరిలో సుస్మిత కుటుంబ సభ్యులు చిన్నాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆయినా వాడి ఆగడాలు ఆగలేదు మళ్ళీ చిన్నా వేధింపులపై తిరిగి రెండు నెలల కిందట వరదయ్య మళ్లీ పోలీసులకు చెప్పగా.. పోలీసులు చిన్నాకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా సుస్మితపై పగ పెంచుకుని ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో విధులు ముగించుకుని రోజులాగే శుక్రవారం ఉదయం 7.30గంటలకు తన అన్నతో కలిసి సుష్మిత ఇంటికి వచ్చింది. డ్యూటీ చేసి వచ్చిన కూతురికి టీ ఇద్దామని తల్లి తల పాల కోసం కొట్టుకి  వెళ్ళింది. పనిలో పని అని టిఫిక్ కోసం సునీల్ హోటల్‌కు వెళ్లాడు. ఊరు వాతావరణం కదా అప్పటికే  అప్పటికే సుష్మిత ఒంటరిగా ఉందని పసిగట్టిన చిన్న. పధకం ప్రకారం మిద్దెలు దూకుతూ వెళ్లి సుష్మిత ఇంటి మేడపైకి వెళ్ళాడు. వెనుక ఉన్న మెట్లు దిగి వెంట తెచ్చుకున్న కత్తితో ఇంటి గడియను విరగ్గొట్టాడు. సౌండ్ లేకుండా లోపలి ఎంటర్ అయ్యాడు. సుస్మిత గాఢనిద్రలో ఉంది. ఒక్కసారిగా తనకు జరిగిన విషయాలు అన్ని గుర్తుకు చేసుకున్నాడు చిన్న.. ఒక్కసారిగా  మెరుపు దాడి చేసినట్లు గదిలో నిద్రిస్తున్న సుష్మితపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు. ఆ రక్తపు మడుగులో పడిఉన్న సుస్మిత చూసి మరి ఆ కసాయి వాడు ఏమనుకున్నాడో  అనంతరం అదే గదిలో తానూ కూడా  గొంతు కోసున్నాడు. పాలకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి సుష్మిత, చిన్నా ఇద్దరూ రక్తపుమడుగులో ఉండటంతో స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సునీల్‌ కొనఊపిరితో ఉన్న చిన్నాను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి రాయితో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఈ ఘటనపై స్థానికంగా ఉండే మహిళా సంరక్షణ కార్యదర్శి చిత్తూరు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్‌ టీం హత్యకు ఉపయోగించిన కత్తి, ఇతర ఆధారాలను సేకరించింది. చిన్నాను హతమార్చిన సునీల్‌పై పోలీసులు హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి షాక్! 

ఇండియాతో వివాదాన్ని కొనసాగిస్తోంది సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్. భారత్ రూపొందించిన కొత్త ఐటీ రూల్స్ ను అంగీకరించడానికి ముందుకు రావడం లేదు. ఇతర సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు దిగొచ్చినా.. ట్విట్టర్ మాత్రం వాదనకు దిగుతోంది. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు షాకిచ్చింది ట్విట్టర్. వెంకయ్య నాయుడు అకౌంట్ నుంచి అధికారిక బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యూడ్జ్‌ను తొలగించింది.  అయితే ప్రస్తుతం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉండటంతో... ఆయన కార్యాలయం సెక్రటేరియట్ నిర్వహిస్తున్న... VPసెక్రటేరియట్ (వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా) మాత్రం బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌తో కొనసాగుతోంది. "ట్విట్టర్... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధికారిక అకౌంట్ నుంచి బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ని తొలగించింది." అని ANI న్యూస్ ఏజెన్సీకి... ఉపరాష్ట్రపతి కార్యాలయం స్వయంగా తెలిపింది.ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అకౌంట్‌కి 13 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఉపరాష్ట్రపతి కార్యాలయ అధికారిక అకౌంట్‌కి 9,31,000 ఫాలోయర్స్ ఉన్నారు. వెంకయ్యనాయుడు అధికారిక అకౌంట్ నుంచి గతేడాది జులై 23న చివరి ట్వీట్ వచ్చింది.  కొత్త ఐటీ రూల్స్‌కి సంబంధించి... గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు కేంద్రంతో డీల్ ఓకే చేసుకోగా... ట్విట్టర్ మాత్రం ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి అంగీకరించలేదు. కేంద్రంతో వాదనకు దిగుతోంది. ఇలాంటి సమయంలో... ఈ సంచలన పరిణామం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

స్వరూపానంద పరమ డూప్లికేటు! గోవిందానంద సరస్వతి సంచలనం.. 

విశాఖ శారదా పీఠంపై సంచలన వ్యాఖ్యలు చేశారు  గోవిందానంద సరస్వతి. విశాఖ శారదా పీఠం ఒక డూప్లికేటు అంటూ విమర్శించారు. స్వరూపానంద శంకరాచార్యులు కాదు.. పరమ డూప్లికేటు అని ఆరోపించారు. దేశంలో డూప్లికేటు పీఠాలు చాలా చోట్ల ఉన్నాయని తెలిపారు. స్వరూపానంద ఎక్కడో సన్యాసం తీసుకుని సాధన చేశారని, ఆయన జనాలను మోసం చేస్తున్నారని గోవిందానంద సరస్వతి మండిపడ్డారు. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక స్వరూపానంద భయపడి పారిపోయారని చెప్పారు.  ఆంజనేయ స్వామి జన్మస్థలంపై టీటీడీ, కిష్కింధ సంస్థాన్ ట్రస్టు మధ్య వివాదం ముదురుతోంది. దే. ఈ విషయంపై హనుమత్ జన్మస్థల తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతీ స్పందించారు. హన్మంతుడి జన్మస్థలం వివాదానికి కారణం టీటీటీ తొందరపాటేనని తప్పుబట్టారు. టీటీడీ అధికారులు తప్పుడు మార్గంలో వెళ్లారని గోవిందానంద సరస్వతి విమర్శించారు. టీటీడీపైనా గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పుస్తకంలో అన్నీ తప్పులేనని తోచిపుచ్చారు. సంపూర్ణ అవగాహన, పరిశోధన చేయకుండా హనుమంతుడి జన్మస్థలాన్ని అసంపూర్ణ జ్ఞానంతో ప్రకటించారని తప్పుబట్టారు. టీటీడీ ప్రమాణంగా చూపిస్తున్న.. వెంకటాచలం మహత్యం సంకలనం తప్పుల తడక అని కొట్టిపారేశారు. వెంకటాచలం మహత్యం బుర్రలేని వారు రాశారని మండిపడ్డారు. ద్వాపరయుగం అంతంలో 5 వేల ఏళ్ల క్రితం పురాణాలు పుట్టాయని, టీటీడీ రామాయణాన్ని ప్రమాణంగా తీసుకోవడం లేదని గోవిందానంద విమర్శించారు. హనుమంతుడు పుట్టిన శ్లోకంతో తిధికి సంబంధం లేదన్నారు. 

కారుణ ఉద్యోగం కోసం కోడలు, కూతురు పోటీ!  హైకోర్టు ఏం తేల్చిందంటే..

ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో మరణిస్తే కారుణ నియామకం కింద అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. మన దేశంలో ఇది చాలా కాలంగా అమలులో ఉంది. ఇలాంటి ఉద్యోగాల్లో ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి కొడుక్కి... కుమారులు లేకపోతే కూతురుకు వస్తుంటాయి. కాని తమిళనాడులో మాత్రం ఓ ప్రభుత్వ ఉద్యోగి అకాల మరణంతో.. కారుణ్య నియామకం కింద వచ్చే ఉద్యోగం కోసం కూతురు, కోడలు పోటీ పడ్డారు. పంచాయితీ ఎటూ తేలకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న మద్రాసు హైకోర్టు ఎట్టకేలకు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చింది.  విలేజ్ అస్టిస్టెంట్​గా విధులు నిర్వర్తిస్తున్న అరుముగం అనే వ్యక్తి.. 2019లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన కుమారుడు కూడా గతంలోనే చనిపోయాడు. కూతురు గోమతి భర్త సైతం మృతి చెందగా.. పిల్లలతో సహా ఆమె అరుముగం కుటుంబంతో కలిసి ఉంటోంది. అరుముగం కుమారుడు చనిపోవడంతో.. కోడలు సంగీత జీవనం కూడా కష్టమైపోయింది. దీంతో మామగారి ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని అధికారులను కోరింది. ఇదే సమయంలో తనూ భర్తను కోల్పోయానని కుటుంబ పోషణ భారంగా మారిందని అరుముగం కూతురు కూడా ఈ ఉద్యోగం తనకే కావాలని కోరింది. అరుముగం ఉద్యోగం కోసం ఒకే కుటుంబంలో వివాదం తలెత్తడంతో అధికారులు  ఏమీ చేయలేకపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో గోమతి, సంగీత వేర్వేరుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ ఎక్ వైద్యనాథన్ విచారించారు. ఈ విషయంలో ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, ఓ ఒప్పందానికి రావాలని సూచించారు. న్యాయమూర్తి సూచనకు ఇద్దరూ అంగీకరించారు. కోర్టు సూచనతో సంగీతతో ఒప్పందం కుదుర్చుకుంది అరుముగం కూతురు గోమతి. ఉద్యోగం తనకు ఇస్తే.. ప్రతీనెల వేతనంలో 30 శాతం సంగీతకు ఇస్తానని చెప్పింది. అలాగే, ఆమె పిల్లల చదువు కోసం సంవత్సరానికి రూ.20వేలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇద్దరి మధ్య ఆ ఒప్పందాన్ని న్యాయమూర్తి ఆమోదించారు. దీంతో రెండు పిటిషన్లను కొట్టేశారు జస్టిస్ వైద్యనాథన్. ప్రతీనెలా గోమతి వేతనంలో 30 శాతం కట్​ చేసి సంగీత బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయాలని ఆదేశించారు. మూడు నెలల్లో గోమతిని విధుల్లోకి తీసుకోవాలని ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. రెండేళ్లుగా నడుస్తున్న ఈ వివాదం సామరస్యపూర్వకంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

కేంద్రమంటే కేసీఆర్ కు భయమా?

మాజీ మంత్రి ఈటల రాజేందర్, తెరాస ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు.ఇది అనూహ్య పరిణామం కాదు. అనుకున్నదే జరిగింది. అలాగే, తమ నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా, సహజంగానే  ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే, గతంలో ఇవే విమర్శలు మరొకరు చేసినప్పుడు, ఈయనే ఆ విమర్శలను ఖండించారు. ఇప్పుడు ఈయన చేసిన విమర్శలను, తెరాస ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర రెడ్డి ఖండించారు. అయితే కేసీఆర్’ని ఈటల విమర్శించడం ఎంత సహజమో, ఈటలను పల్లా ఓ పట్టుపట్టడం కూడా అంతే సహజం. ఈటల ప్రధానంగా తెరాసలో తమ ఆత్మగౌరవానికి భంగంకలిగిందని, అంటున్నారు. నిజంగా అంతగా ఆయన ఆత్మగౌరవానికి భంగం కలిగిందే నిజం అయితే,  మెడ పట్టి గెంటే వరకు చూరుపట్టుకు ఎందుకు వెళ్ళాడారు,అనే ప్రశ్నకు ఈటల దగ్గర సమాధానం లేదు. అందుకే, ఆయన ఆ ఒక్కటి పక్కన పెట్టి మిగిలిన విషయాలు అన్నీ మాట్లాడుతున్నారు.   అదలా ఉంటే, పల్లా రాజేశ్వర రెడ్డితో పాటుగా ఇతర తెరాస నాయకులు కూడా ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆస్తుల రక్షణ అని మండిపడ్డారు. అక్రమంగా సంపాందించిన తన ఆస్తులను కాపాడుకునేందుకు ఈటల అత్మగౌరవం, ట్యాగ్ తగిలింఛి నాటకాలు ఆడుతున్నారని టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. అయితే, ఈటల ఆత్మగౌరవం వంటి పెద్ద పెద్ద అంతాలు మాట్లాడి ఉన్న గౌరవం పోగొట్టుకున్నట్లుగానే, ఈటల అక్రమాస్తుల విషయం ప్రస్తావించి, తమ పరువు తామే తీసుకున్నారు.  అందుకే, తెరాస నేతల ఆరోపణలు నిజమే అయితే , ఆ ఆరోపణలకు  ఈటల కంటే ముందు అదికార పార్టీ నేతలే సమాధానం ఇవ్వవలసి ఉంటుందని, అంటున్నారు.   ఈ నేపధ్యంలో తెరాస నాయకుల మాటలను విశ్లేషించుకుంటే,  తెరాస మంత్రిగా ఉంటూ, ఈటల రాజేందర్ అవినీతికి పాల్పడ్డారు.. లక్షలు కోట్లు వెనకేసుకున్నారని తెరాస నాయకులే అంగీకరించినట్లు అవుతుంది. అంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రి వర్గం అవినీతిమయం అని విపక్షాలు చేస్తున్న విమర్శలను పాక్షికంగా అయినా అంగీకరించినట్లు అవుతుంది. ఎవరైనా ఈ తీగ పట్టుకు లాగి,ఏ ‘పిల్లో’  (ప్రజాప్రయోజన వ్యాజ్యం) వేస్తే, మొత్తంగా ఏడేళ్ళలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి డొంకంతా కదిలే ప్రమాదం లేక పోలేదు.నిజానికి ఈటల మీద వచ్చిన ఆరోపణలకు మించిన ఆరోపణలు ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్ల్యేల పై కూడా ఉన్నాయి. భూకబ్జాకేసుల్లో ఇరుకున్నఇతర పార్టీల ఎమ్మెల్యేలను భయపెట్టి పార్టులోకి లాక్కున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇవ్వనీ పబ్లిక్ డొమైన్’ ఉన్న విషయాలే. ఇప్పుడు, ఆ లోతుల్లోకి వెళితే, సూది కోసం సోది కెళితే, పాత తప్పుడు తిరుగుళ్ళు   బయట పడ్డాయి అన్నట్లు, అవుతుందని అంటున్నారు.  అదలా ఉంటే, ఈటలల పై పోటాపోటీగా విమర్శలుచేసే  ఉత్సాహంలో తెరాస నాయకులు మరో సెల్ఫ్ గోల్ కూడా చేసుకున్నారని, విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈటల తమ అక్రమాస్తులను రక్షించుకుకునేందుకే, బీజేపీ పంచన చేరారని పల్లా రాజేశ్వర రెడ్డి చేసిన ఆరోపణని విశ్లేషించుకుంటే, అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలు బీజేపీలో చేరితే, ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం వారిని ఏమీ చేయలేదని, సర్కార్ తరపుయన్ రాజేశ్వర రెడ్డి చేతులెత్తేసారా, అని ప్రశ్నిస్తున్నారు.అలాగే, కేంద్రానికి కేసీఆర్ భయపడుతున్నారని  ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కూడా ఈ వ్యాఖ్యలు బలం చేకురుస్తున్నాయని  వివిశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే కేంద్రానికి ఎందుకు భయాడుతున్నారు? అన్న ప్రశ్న కూడా బలంగ్ వినవస్తోంది.  దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు, రైతు చట్టాలకు సంబంధించి కరీంనగర్, నిజామబాద్ సభల్లో మోడీ మీద ఓ రేంజిలో రెచ్చిపోయిన కీసీఅర్, తర్వతా ఢిల్లీ వెళ్లి కాళ్ళ బేరానికి వచ్చారని, ఇక అక్కడి  నుంచి రైతు చట్టాల ఊసే లేదని  విపక్షాలు ఎప్పటినుంచో విమర్శిస్తున్నాయి. ఇప్పుడు, పల్లా పలుకులతో నిజంగానే కేసీఆర్ కేంద్రానికి భయపడుతున్నారు అనుకోవలసి వస్తోందని అంటున్నారు. అయితే, ఎందుకు భయడుతున్నారు .. అదేమీ రహస్యం కాదు .. దాల్ మే కుచ్’ నహీ .. బహుత్ ... బహుత్  కాలాహై.

వేల కోట్ల అవినీతి నిగ్గు తేల్చండి!ప్రధానికి జైలు నుంచి జర్నలిస్ట్ రఘు లేఖ.. 

తొలివెలుగు యూట్యూబ్​ చానల్​ జర్నలిస్ట్​, యాంకర్​ రఘు అరెస్ట్ తెలంగాణలో కలకలం రేపుతోంది. జర్నలిస్ట్ రఘు అరెస్టును విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ అవినీతి ప్రశ్నిస్తున్నారనే కసితోనే కేసీఆర్ సర్కార్ అక్రమ కేసులు పెడుతుందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు మానుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు కోరుతున్నాయి.  గురువారం ఉదయం జర్నలిస్టును రఘును నెంబర్ లేని కారులో తీసుకెళ్లడంలో .. కిడ్నాప్ జరిగిందనే ప్రచారం జరిగింది. తలకు ముసుగు కప్పి, చేతులు కట్టి బలవంతంగా రఘును తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పడం దుమారం రేపింది.  "కోకాపేట కాందిశీకుల  భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కథనాలను ప్రసారం చేస్తే.. ఖబడ్దార్" అంటూ దుండగులు పెద్దపెట్టున కేకలు వేస్తూ జర్నలిస్ట్ రఘును బలవంతంగా జీపు ఎక్కించినట్లు రఘు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సాయంత్రానికి తామే అరెస్ట్ చేశామంటూ సూర్యాపేట పోలీసులు ప్రకటన చేశారు. గుర్రంపోడులో జరిగిన గొడవకు సంబంధించి  జర్నలిస్ట్​ రఘుపై ఐపీసీ IPC 143, 144, 147, 148, 149, 332, 333 r/w, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈకేసులో రఘు A-19గా ఉన్నాడు.  కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం హజూర్ నగర్ జైలులో ఉన్నారు  జర్నలిస్ట్ రఘు. అక్కడి నుంచే రఘు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వేల కోట్ల అవినీతికి సంబంధించిన కథనాలు ప్రసారం చేస్తుండటం వల్లే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రధానికి రాసిన లేఖలో రఘు ఆరోపించారు. ప్రధాని మోడీకి రఘు రాసిన లేఖ.. ఉన్నది ఉన్నట్లుగా ఇస్తున్నాం.. కింద చూడండి..  గౌర‌వ‌నీయులైన ప్ర‌ధాన‌మంత్రిగారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా... విష‌యం: తెలంగాణ‌లో ఎమ‌ర్జెన్సీ మ‌రియు వేలకోట్ల దోపిడి గురించి. నా పేరు ర‌ఘు గంజి. తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. నిన్న ఉద‌యం నా ఇంటి స‌మీపంలో కొంద‌రు న‌న్ను కిడ్నాప్ చేశారు. ఐదు అంశాల గురించి వార్త‌ల ప్ర‌సారం ఆపితేనే  నేను ప్రాణాల‌తో బ‌తుకుతాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాత కిడ్నాప్ చేసిన‌వారు పోలీసుల‌ని తెలిసింది. సోష‌ల్ మీడియాలో నా కిడ్నాప్ అంశం వైర‌ల్ కావ‌డంతో న‌న్ను వారు కోర్టులో హాజ‌రుప‌రిచి జైలుకు పంపించారు. ప్ర‌స్తుతం నేను జైలు నుంచి మీకు ఈ లేఖ రాస్తున్నాను. కిడ్నాప్ చేసిన పోలీసులు.. న‌న్ను వార్త‌లు ప్ర‌సారం చేయొద్ద‌ని కోరిన 5 అంశాలు 1. పుప్పాల‌గూడ కాందీశీకుల భూమి ఆక్ర‌మ‌ణ‌ 2. ఐడీపీఎల్ 500 ఎక‌రాల ఆక్ర‌మ‌ణ‌ 3. ఐకియా ముందు 43 ఎక‌రాల భూమి ఆక్ర‌మ‌ణ‌ 4. ప్రాజెక్టుల దోపిడి 5. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో క‌రోనా ట్రీట్‌మెంట్ దోపిడి 1. పుప్పాల‌గూడ‌లో 100 ఎక‌రాల కాందీశీకుల భూమి ప్ర‌స్తుతం ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతోంది. ఈ భూమి విలువ రూ.50 వేల కోట్లు. రైతుల‌ను బెదిరించి, నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూక‌బ్జా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు అధికార పార్టీ నేత‌లు, వారి బంధు మిత్రులు. చట్ట వ్యతిరేకంగా అక్ర‌మ నిర్మాణాల‌కు అనుమ‌తిలిస్తున్నారు. నేను ఆ విష‌యం గురించి రిపోర్ట్ చేయ‌కూడ‌ద‌ట‌. 2. ఐడీపీఎల్/ హిందుజ /గ‌ల్ప్ ఆయిల్‌కు చెందిన 500 ఎకరాల భూమిని మింగుతున్నారు ప్ర‌భుత్వ పెద్ద‌లు. దీని విలువ రూ.10 వేల కోట్లు. ఈ విష‌యం గురించి కూడా నేను మాట్లాడ‌కూడ‌ద‌ట‌ 3. హైటెక్ సిటీ స‌మీపంలో ఐకియాకు ముందు యూఎల్‌సీకి స‌రెండ‌ర్ చేసిన 35,36,47,53 స‌ర్వే నెంబ‌ర్ల భూమి ప్ర‌భుత్వం చేతిలో నుంచి ప్రైవేట్ చేతిలోకి ఎలా వ‌చ్చిందో ప్ర‌శ్నించ‌కూడ‌ద‌ట‌. 4. రాష్ట్రంలో మిష‌న్ భ‌గీరథ‌తో పాటు ప్రాజెక్టుల‌న్నింటిలో రూ.60 వేల కోట్ల అవినీతి జ‌రిగింది. ఆ డ‌బ్బంతా రాజ‌కీయ నాయ‌కుల‌కు చేరింది. ప‌క్క రాష్ట్రం క‌ర్నాట‌క‌తో పోలిస్తే అదే కాంట్రాక్టర్ చేసిన రేట్లతో పోలిస్తే తెలంగాణ ప్రాజెక్టుల్లో విప‌రీత దోపిడి జ‌రిగింది. ఆ ప్రాజెక్టులు, టెండ‌ర్ల దోపిడి గురించి నేను మాట్లాడకూడ‌ద‌ట‌. 5. క‌రోనా స‌మ‌యంలో విప‌రీత‌మైన దోపిడికి తెగ‌బ‌డి శ‌వాల‌తో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై క‌థ‌నాల‌ను త‌క్ష‌ణం ఆపివేయాల‌ట‌. ప్ర‌ధానమంత్రిగా మిమ్మ‌ల్ని ఈ అంశాల‌పై దృష్టి సారించాల‌ని కోరుతున్నాను.  క‌నీస పౌర‌హ‌క్కులు, ప‌త్రికా స్వేచ్ఛ‌లేని తెలంగాణ ప‌రిస్థితిని మీరు   మారుస్తార‌ని ఆశిస్తున్నాను. నా ప్రాణాలకు భద్రత లేదు, నాకు రక్షణ కలిపించాలని కోరుతున్నా...                       గౌర‌వంతో                                  ర‌ఘు గంజి       (    హుజూర్‌న‌గ‌ర్  జైలు నుంచి) 

జగన్ సర్కార్ కు మరో షాక్! 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. అమూల్‌ తో ఎంవోయూ విషయంలో ఏపీ ప్రభుత్వ దూకుడుకు బ్రేక్ పడింది. అమూల్‌తో కుదుర్చుకున్న ఎంవోయూపై ఎలాంటి నిధులు వెచ్చించొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు.. గుజరాత్‌లోని అమూల్‌కి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 14వ తేదీకి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.  ఏపీడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ సీఎం జగన్ అధ్యక్షత కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని  సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ వేశారు. ఈ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించి, రద్దు చేయాలని కోరుతూ ఆయన పిల్ దాఖలు చేశారు.రఘురామ తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు  వాదనలు వినిపించారు.  పాల ఉత్పత్తుల సంస్థ  అమూల్‌ ఏపీలో పాగా వేసేందుకు రంగం సిద్ధమైంది. ఏపీలో పాల సేకరణపై అమూల్‌ దశల వారీ కార్యాచరణ చేపట్టింది. ప్రైవేట్‌ డెయిరీలకు చెక్‌ పెట్టి, సహకార డెయిరీలను నిర్వీర్యం చేసేలా ఆ సంస్థకు ప్రభుత్వమే వత్తా సు పలుకుతోంది.  ఈ క్రమంలోనే అమూల్‌, ఏపీ డెయిరీ డెవల్‌పమెం ట్‌ ఫెడరేషన్‌ మధ్య ఒప్పందం కుదిర్చింది. రాష్ట్రంలో పాల సేకరణకు యం త్రాంగమే లేని అమూల్‌కు రైతు భరోసా కేంద్రాల ద్వారా పాలు సేకరించి ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఇప్పటికే జిల్లాకో ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు జిల్లాస్థాయి కమిటీలు వేసింది. తొలిదశలో సీఎం సొంత జిల్లా కడపతోపాటు పాల ఉత్పత్తి అధికంగా ఉన్న చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అమూల్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 

భార్యకు కరోనా.. బాత్ రూంలో బంధించిన భర్త.. 

కరోనా ఏంటో మందిని అనాథలను చేసింది. ఎన్నో కుటుంబాలను కన్నీటి పర్వంలో ముంచింది. దాదాపు అందరిని ఆర్థికంగా కుదిపేసింది. మరికొందరిలో మానవత్వాన్ని కూడా చంపేసింది. బంధువులను బంధుత్వాన్ని దూరం చేసింది. కరోనా వల్ల మనిషిలో మానవత్వం నశించిపోయి చనిపోయిన శవం తో ఒకడు వాడి కోరిక తీర్చుకుంటే, ఆ పేషేంట్స్ మేడలో ఉన్న బంగారాన్ని దొంగిలించాడు మరొకడు. అత్తకు కరోనా వచ్చిందని తాను చనిపోతే కోడలు హాయిగా ఉంటుందని కోడలికి కరోనా అంటించిన అత్తని చూశాం.. తాజాగా అలాంటిదే  ఇంకో సంఘటన వెలుగులోకి వచ్చింది. అదేంటో తెలుసుకుందాం..?  అది మంచిర్యాల జిల్లా. ఒక వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. తన భార్య కరోనా సోకిందని ఆమెను ఏకంగా బాత్రూంలో బంధించాడు. తెలియని తనమో, లేక కరోనా తనకు కూడా సోకుందనే భయమో తెలీదు గానీ తన భార్యను స్నానాల గది నుంచి రానివ్వకుండా చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టి పేట పట్టణంలో చోటు చేసుకుంది. అయితే, ఆమె గత ఏడు రోజులుగా బాత్రూంలో ఉంటున్నట్లుగా స్థానికులు చెప్పారు. బాత్రూంలోనే ఉంటూ ఆమె నరకయాతన అనుభవించింది. తన భర్త తనకు అన్నం, నీళ్లు కూడా ఇవ్వలేదని రోదించింది.  ఏదో విధంగా ఆమె బాధ స్థానికులకు తెలిసింది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే ఆమె ఇంటికి వెళ్లి బాత్రూంలో ఉన్న ఆమెను బయటకు తీసుకొచ్చి ఓ గదిలో హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు. ఆమె భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కరోనా వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్లే భర్తని చూశాం గాని మరి ఇంత దారుణంగా ప్రవర్తించే భర్తలు కూడా ఉంటారని చెలిసింది.. ఈ ఘటన పబ్లిక్ అయింది కాబట్టి తెలిసింది. ఇంకా ఇలాంటి ఘటనలు చీకటి చాటున ఎన్ని ఉన్నాయో.. ఏది ఏమైనా కరోనా టైం లో ఫ్యామిలి వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలేగాని.. ఇలా వ్యాదికంటే ముందే మనం చంపొద్దు.. ఏదేమైనా కరోనా చాలా గుణపాఠాలు నేర్పిందనే చెప్పాలి.. అందులో ముఖ్య మన వాళ్ళు ఎవరో.. మన మేలు కోరేవాళ్ళు ఎవరో.. ఎవరు నటిస్తున్నారో.. ఎవరు జీవిస్తున్నారో ఎవరు బంధువులో ఎవరు బద్మాష్ గాల్లో అందరికి తెలిసివచ్చింది.   

కలిసిపోయిన రేవంత్, కోమటిరెడ్డి! కాంగ్రెస్ కథ మారినట్టేనా.. 

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రగతి భవన్ టార్గెట్ గా ఈటల చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా మారాయి. ఈటల కమలం గూటికి చేరుతుండటంతో కాంగ్రెస్ నేతలు కూడా అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. విభేదాలు పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.  కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు టి కాంగ్రెస్ నేతలప. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ఈ బృందంలో  ఉన్న ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి క్లోజ్ మూవ్అయ్యారు. ఇద్దరు నేతలు రాజ్ భవన్ దగ్గర కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం చాలామంది నేతల దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్ ఎంపికపై మాట్లాడారు. త్వరలోనే కొత్త టీపీసీసీ చీప్ ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. తమలో ఎవరికి ఆ పదవి దక్కినా.. అంతా కలిసే పని చేస్తామని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.  టీపీసీసీ చీఫ్ పదవి కోసం కొంత కాలంగా తీవ్ర పోటీ నెలకొంది. మరో వారం రోజుల్లో టీపీసీసీ ఎంపికపై క్లారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పదవి ఆశిస్తున్న వారిలో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ వంటి వాళ్లు బాహాటంగానే కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ రెడ్డి సామాజికవర్గానికి ఈ పదవి ఇవ్వాలని భావిస్తే.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇవ్వాలని అన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం తాను టీపీసీసీ రేసులో ఉన్నానని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతల వర్గపోరుతో ఈసారి పీసీసీ చీఫ్ ను ప్రకటిస్తారా లేద వాయిదా వేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే రాజ్ భవన్ లో కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి తిరిగిన తీరు, తర్వాత వెంకట్ రెడ్డి మాట్లాడిన మాటలతో.. పీసీసీ విషయంలో ఆ ఇద్దరు ఒక అవగాహనకు వచ్చారనే చర్చ జరుగుతోంది. ఎవరికి పదవి వచ్చినా కలిసి పనిచేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ దూకుడు పెంచినందున అంతా కలిసి పని చేసి వాళ్లకు చెక్ పెట్టాలని హస్తం నేతలు భావిస్తున్నారట. కేసీఆర్ సర్కార్ పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, బీజేపీ కంటే ముందుంటే.. అది తమకు లాభిస్తుందని, అధికారం ఈజీగానే వస్తుందని కాంగ్రెస్ నేతలు అంచనాలు వేసుకుంటున్నారని సమాచారం. చూడాలి మరీ.. హస్తం నేతల మధ్య ఐక్యత ఎంతకాలం ఉంటుందో..