సీతక్క తల్లికి సీరియస్.. రక్తం ఇచ్చేందుకు వెళుతున్న యువకులకు బ్రేక్! పోలీసులపై ఎమ్మెల్యే ఫైర్
posted on Jun 3, 2021 @ 3:04PM
తెలంగాణలో లాక్ డౌన్ కఠినంగా అమలవుతోంది. ఎవరిని రోడ్డు మీదకు అనుమతించడం లేదు. లాక్ డౌన్ అమలు బాగానే ఉన్న కొందరు అధికారుల తీరు మాత్రం విమర్శల పాలవుతోంది. కొందరు పోలీసులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క కుటుంబ సభ్యులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లికి రక్తదానం చేసేందుకు వెళ్తుండగా.. తమ బంధువులను పోలీసులు అడ్డుకున్నారని సీతక్క మండిపడ్డారు. ఈ-పాస్ ఉన్నప్పటికీ కనీస కనికరం లేకుండా ప్రవర్తించారని మల్కాజ్‌గిరి డీసీపీపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సీతక్క తల్లికి ఆరోగ్యం బాగాలేదు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. రక్తం అవసరం ఉండడంతో.. సీతక్క బంధువులు రక్తదానం చేసేందుకు ములుగు నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ములుగు జిల్లా కలెక్టర్ అనుమతి కూడా తీసుకున్నారు. ఐతే హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత వారిని మల్కాజ్‌గిరి డీసీసీ రక్షిత అడ్డుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆపేశారు. తాము ఈపాస్ తీసుకున్నామని చెప్పినా వినలేదని.. సీతక్క ఆరోపించారు. వీడియో కాల్ చేసి.. తన తల్లిని చూపించినా పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ఎమ్మెల్యేకే ఇలాంటి అనుభవం ఎదురయితే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని మండిపడ్డారు సీతక్క.
డీసీపీ రక్షిత తన డ్యూటీ నుంచి వెళ్లిపోయిన తర్వాత.. కింది స్థాయి సిబ్బంది వారిని అనుమతించినట్లు సీతక్క చెప్పారు. అందరినీ ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. ఎవరి పరిస్థితి ఏంటో.. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసుకోవాలని ఆమె సూచించారు. కనీసం మానవత్వంతో వ్యవహరించాలని.. ఇలాంటి వారుంటే చాలా మంది ప్రాణాలు పోతాయని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేశారు సీతక్క. ఫైన్లు, చలానాల కన్నా మానవత్వం ముఖ్యమని విమర్శించారు. మల్కాజ్‌గిరి డీసీసీ తీరుపై ట్విటర్ ద్వారా డీజీపీకి ఫిర్యాదు చేశారు సీతక్క. పోలీసుల తీరును మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలు తీవ్రంగా ఖండించారు.
ఎమ్మెల్యే సీతక్క కుటుంబ సభ్యులకు ఎదురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. లాక్ డౌన్ ఆంక్షల పేరుతో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే జనాలు మండిపడుతున్నారు. రక్తదానం చేసేందుకు వెళుతున్న వారినిఅడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినా వినకపోవడం మరీ దారుణమంటున్నారు. రక్తం సమయానికి అందక రోగి చనిపోతే... దానికి ఎవరూ బాధ్యత వహిస్తారని మండిపడుతున్నారు.