ఓటమి భయంతో కదిలిన కమలం
ఉత్తర ప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారి పోతోంది. ఒక విధంగా పశ్చిమ బెంగాల్’ సీన్ యూపీలో రిపీట్ అవుతోంది. పార్టీలు, పొత్తులతో సంబంధం లేకుండా బీజేపీ వ్యతిరేక ఓటర్లు, ముఖ్యంగా ముస్లిం ఓటర్లు, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా, ఓడించగల పార్టీతో ర్యాలీ అవుతున్నారు. మొన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే, ముస్లిం ఓటర్ల ఆధిక్యతగల సుమారు 60కి పైగా గల నియోజక వర్గాల్లో, ఒక్క సీటు బీరు పోకుండా, మొత్తానికి మొత్తం స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. లౌకికవాద పార్టీలుగా చొక్కాలు చించుకునే కాంగ్రెస్, లెఫ్ట్ కూటమికి ఒక్క సీటు కూడా దక్కలేదు. అలాగే, రాష్ట్రం మొత్తంలోనూ ముస్లింలు కాంగ్రెస్, లెఫ్ట్ వైపు కన్నెత్తికూడా చూడలేదు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా తృణమూల్’ కు బల్కగా ఓట్లు గుద్దారు. ఫలితంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు జీరో’కు చేరుకుంటే, తృణమూల్ కాంగ్రెస్ జెండా ఎగరేసింది. మూడింట రెండువంతుల మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
ఇప్పుడు యూపీలోనూ అదే లక్ష్యంతో, బీజేపీ వ్యతిరేక ఓటర్లు అందరూ, సమాజ్ వాదీ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నారు. గతంలో కాంగ్రెస్, బీఎస్పీల వైపు మొగ్గు చూపిన వర్గాలు కూడా, బీజేపీని ఓడించే సత్తా ఉన్న పార్టీగా సమాజవాదీ పార్టీని చూస్తున్నారు. బెగాల్లో’ లానే, యూపీలోనూ ముస్లిం ఆధిక్యత ఉన్న నియోజక వర్గాలు వందకు పైగానే ఉంటాయి.ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్’ లో అనేక నియోజక వర్గాల్లో ముస్లిం ఓటర్లే గెలుపు ఓటములని నిర్ణయించగల స్థాయిలో ఉన్నారు. గతంలోనూ ముస్లిం ఓటర్లు లౌకికవాద పార్టీల వైపే మొగ్గుచూపారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పార్టీకి జై కొట్టలేదు. ఈసారి ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు మొత్తానికి మొత్తంగా సమాజవాదీ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నారు. దీంతో బీజేపీలో గుబులు మొదలైంది. ఈ పరిణామం నేపధ్యంలో మరో ఆరేడు నెలలలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ మధ్య ద్విముఖ పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీహార్ ఫార్ముల ఫాలో అయి, అక్కడ ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నట్లు యూపీలో ఎస్పీతో జట్టు కడితే కొద్దిపాటి సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది.బెంగాల్ రూట్లో వెళితే అదే జీరో’ ఖాయం అవుతుంది .
అదలా ఉంటే, మరో వంక, బీజేపీ పొంచి ఉన్నప్రమాదాన్ని పసిగట్టి, పావులు కదుపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్’ నియోజక వర్గాల పర్యటన ప్రారంభించారు. కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశాలు ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే, కరోనాతో చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. మరో వంక జిల్లా అధ్యక్షులు కూడా తమతమ జిల్లాలో కొవిడ్ బాధితులను కలిసి పరామర్శింఛి, అవసరమైన సహాయం అందివ్వాలని సూచించారు.
అంతే కాదు, ఇంతకాలం అంతగా పట్టించుకోని మిత్రపక్షాలతో మళ్ళీ మాటకలిపే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల క్రితం, స్వతంత్ర దేవ్ సింగ్, అప్నా దళ్ నాయకురాలు అనుప్రియ పటేల్’తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పొత్తు కొనసాగించడంతో పాటుగా, త్వరలో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో అప్నా దళ్’కు ఒక బెర్త్’ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. అయితే, మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని , ఉండదని పార్టీలో విభిన్న అభిప్రాయాలున్నాయి. మంత్రి వర్గ విస్తరణ జరిగితే, దళిత్, ఓబీసీలకు స్థానం కల్పించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సమాచారం. పనిలో పనిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేల పని తీరును, సింగ్, బన్సల్ సమీక్షిస్తున్నారు. ఇది అభ్యర్ధుల ఎంపికకు ప్రాతిపదికగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి, గత ఎన్నికల్లో అనూహ్యంగా, మొత్తం 403 సీట్లకు గానూ 312 సీట్లు గెలుచుకున్న, బీజేపీ, ఎన్నికలు ఇంకా ఏడెనిమిది నెలల దూరంలో ఉండగానే, ఓటమి భయంతో ముదస్తు ఊహంతో కదులుతోంది. అయితే, ముస్లిం ఓటు ఎస్పీ వైపు ర్యాలీ అయితే, బీజీపీకి కష్టాలు తప్పవని, అదే కారణంగా హిందూ ఓటు పోలరైజ్ అయితే మాత్రం బీజేపీకి అచ్చేదిన్ వచ్చినట్లే’అని విశేషకులు అంటున్నారు.