సీఎం జగన్‌రెడ్డికి ఆనందయ్య లేఖతో కలకలం.. సర్కారు ఘోర వైఫల్యం.. చంద్రబాబు సీఎంగా ఉంటేనా..!
posted on Jun 8, 2021 @ 11:35AM
సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వ చేతగానితనం అన్ని విషయాల్లోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందనే విమర్శలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడిలో చేతులెత్తేసిన సర్కారు.. కనీసం ఆ కరోనా రాకుండా చేసే అవకాశం ఉన్న ఆనందయ్య మందుకైనా ప్రోత్సాహం ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఆనందయ్య తన మానాన తాను నిత్యం వేలాది మందికి ఉచితంగా మందు పంపిణీ చేస్తుంటే.. మధ్యలో ప్రభుత్వం జోక్యం చేసుకొని వారల తరబడి మందును ఆపేసింది. ఆ పరీక్షలు, ఈ పరీక్షలు చేసి.. అంతా ఓకే ఆయ్యాక కూడా మరో వారం పాటు ఆలస్యం చేసింది. ఈలోగా వేలది మంది.. కరోనా బారిన పడటానికి పరోక్షంగా కారణమైంది. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఆనందయ్య మందును అప్పుడే యధావిదిగా పంపిణీ చేయనిస్తే... ఇప్పటికే ఆ మందు తీసుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉండేది.
కరోనా విజృంభించాక.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చాక.. ఇటీవల మళ్లీ మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే. తన వంతుగా ఇంకేమీ చేయలేదు. ఆనందయ్య మందు ఉత్పత్తి పెంచడానికి కానీ, మరింత మంది ప్రజలకు ఆ సంజీవనిని చేరువ చేయడానికి కానీ.. జగన్‌రెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. చేయాల్సింది చేయకపోగా.. ఆనందయ్యను, ఆయన మందును హైజాక్ చేశారంటూ ప్రజలు మండిపడుతున్నారు. మా ఆనందయ్య మందును మాకు దూరం చేశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాకాని.. ముందుగా తన సర్వేపల్లి నియోజకవర్గానికి మాత్రమే మందు పంపిణీ చేయిస్తున్నారు. మరో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి.. ఆనందయ్య కుమారుడిని తన గుప్పిట్లో పెట్టుకొని.. తన ప్రాంత ప్రజలకే మందును అందుబాటులో ఉంచారు. పైగా ఆనందయ్య ఫోటో లేకుండా.. వైఎస్సార్, వైఎస్ జగన్, చెవిరెడ్డి ఫోటోలతో ఉన్న బాక్సుల్లో ఆ మందును సరఫరా చేస్తుండటం తీవ్ర విమర్శల పాలవుతోంది.
అందరి వాడైన ఆనందయ్యను కొందరి వాడిని చేసి.. ప్రజలందరికీ అందాల్సిన మందును.. కొందరికే పరిమితం చేసి.. కరోనా సమయంలో కుళ్లు రాజకీయాలకు పాల్పడుతున్నారని జనాలు జగన్‌రెడ్డి సర్కారును అసహ్యించుకుంటున్నారు.
ఆనందయ్య సైతం లోలోన కుమిలిపోతున్నా.. కోపంతో రగిలిపోతున్నా.. ప్రభుత్వానికి, వైసీపీ పాలకులకు భయపడి.. పైకి మాత్రం మామూలుగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎక్కడ ఏ మాట అంటే.. మళ్లీ తన మందును ప్రజలకు కాకుండా చేస్తారోనని తెగ ఆందోళన చెందుతున్నారు. అయినా.. ఉండబట్టలేక.. జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నించలేక.. కాస్త మెతక వైఖరి ప్రదర్శిస్తూ.. తనకు ప్రభుత్వ ప్రోత్సాహం అందించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆయన ఎంత ఇబ్బంది పడుతుంటే.. ఆయన ఎంత కష్ట, నష్టాలకు ఓరుస్తుంటే.. ఇక తన వల్ల కాదని.. సర్కారు సాయం చేయాల్సిందేనని.. నేరుగా సీఎంకే లేఖ రాసుంటారని అంటున్నారు.
ఔషధం తయారీ సామగ్రి తదితరాలకు సహకారం అందించాలని లేఖలో ముఖ్యమంత్రిని కోరారు ఆనందయ్య. ఎక్కువ మొత్తంలో మందును తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సైతం పంపిణీ చేసే విధంగా సహాయసహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని ఆనందయ్య లేఖలో రాసినట్టు తెలుస్తోంది.
ఏపీలో జగన్‌రెడ్డి కాకుండా చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటేనా.. ఈ పాటికి ఆనందయ్య మందు ఇంటర్నేషనల్‌గా ఫేమస్ అయి ఉండేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లా జిల్లాకు ప్రత్యేక భవనాలను కేటాయించి.. ప్రభుత్వ అటవీ శాఖ సిబ్బందితో మందు తయారీకి కావలసిన వనమూలికలను సమకూర్చి.. ఆనందయ్యతో పాటు ఆయన శిష్యులతో ఎక్కడికక్కడ.. ప్రభుత్వ ఆధ్యర్యంలో మందు తయారీ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన చేసుండేవారని అంటున్నారు. ఆనందయ్య మందు కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ ఏర్పాటు చేసి.. ప్రత్యేక కోడ్ కేటాయించి.. ముందే టైమ్ నిర్ణయించి.. ఆనందయ్య మందును డోర్ డెలివరీ చేయించేవారని.. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలకూ ఆనందయ్య మందును చేరువ చేసేవారని.. చంద్రబాబు వర్కింగ్‌స్టైల్ తెలిసిన వారంతా అంటున్నారు. కానీ, ఏం చేస్తాం.. జగన్‌రెడ్డిని అందలం ఎక్కించినందుకు అనుభవిస్తున్నాం అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆనందయ్య మందు కోసం సీఎం జగన్‌రెడ్డి తరఫున ఒక్కటంటే ఒక్క ప్రోత్సాహకమైనా లభించిందా అని ప్రజలు నిలదీస్తున్నారు. కనీసం, మందు తయారీకి అవసరమైన వనమూలికలను, సామాగ్రిని, కరెంట్ సరఫరాను సైతం అందించలేని ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం అంటూ జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ నేతలే ఆనందయ్యను కట్టడి చేస్తూ.. కేవలం రెండు నియోజకవర్గ ప్రజలకే మందును పంపిణీ చేస్తున్నా.. సీఎం జగన్ ఉదాసీనంగా ఉండటం దారుణమంటున్నారు. ఏపీ ప్రజలంతా మీ ప్రజలు కాదా? అని నిలదీస్తున్నారు. మందు తయారీ ఆనందయ్య వల్ల కాక.. సీఎం జగన్‌రెడ్డికి లేఖ రాసేవరకూ పరిస్థితి దిగజారడం దారుణమన్నారు. ఇప్పటికే కొవిడ్ మందులు, ఆక్సిజన్ సిలెండర్లు, ఆసుపత్రి బెడ్లు, వ్యాక్సిన్లు.. ఇలా కరోనా కట్టడి విషయంలో ఘోరంగా విఫలమైన సీఎం జగన్‌రెడ్డి.. ఉచితంగా ఇస్తూ, కరోనా పాలిట సంజీవనిగా మారిన ఆనందయ్య మందు పంపిణీ విషయంలోనూ వైఫల్యం చెందడం ముఖ్యమంత్రి చేతగానితనానికి నిదర్శనమంటున్నారు ప్రజలు.
మరో వైపు.. మంగళవారం నెల్లూరు జిల్లాలోని మునుబోలు మండలంలో ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నారు. కేవలం సర్వేపల్లి వాసులకు మాత్రమే మందు పంపిణీ కొనసాగుతోంది. వాలంటీర్ల ద్వారా ఔషధాన్ని ఇంటింటికీ చేరవేస్తున్నారు. మందు కోసం ఇతర ప్రాంతాల వారిని అనుమతించడం లేదు పోలీసులు. కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ అమలును కొనసాగిస్తున్నారు.
ఆనందయ్య ఔషధంలో ఒకటైన కె రకానికి హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మందును రాష్ట్ర ప్రజలందరికీ అందజేయడానికి ప్రభుత్వం సహకారం కావాలని.. ప్రభుత్వం నుంచి తనకు సాయం అందడం లేదని ఆనందయ్య ఇప్పటికే ప్రకటించారు. తాజాగా, సీఎం జగన్‌రెడ్డికి ఆ మేరకు లేఖ రాయడం సంచలనంగా మారింది.