ప్రధాని మోడీకి జగన్ మరో లేఖ.. ఎందుకో తెలుసా?
posted on Jun 8, 2021 @ 10:36AM
కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఇటీవలే ప్రధాని మోడీ నాలుగైదు లేఖలు రాశారు. వ్యాక్సిన్ కేటాయింపు, గ్లోబల్ టెండర్లపైనా కేంద్రానికి లేఖలు రాశారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీకి మరో లేఖ రాశారు సీఎం జగన్. ఈసారి ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకంలో రాష్ట్రానికి అదనపు సాయం కోసం కేంద్రాన్ని అభ్యర్థించారు.
ప్రధాని మోడీకి జగన్ రాసిన లేఖలో ఏముందంటే.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రపంచంలోనే ఉత్తమ పథకం. ఈ పథకం ద్వారా... 2022 నాటికి పేదవాళ్లకు పక్కా ఇళ్లు కల్పించాలి. అప్పటికి ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ PMAYని తెచ్చింది. ఇందులో భాగంగా... హౌసింగ్ కాలనీల అభివృద్ధి భారీ ఎత్తున జరుగుతోంది. గత 7 ఏళ్లలో 308.2 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.2.99 లక్షల కోట్ల సాయం చేసింది. ఈ పథకంలో 3 కీలక అంశాలున్నాయి. 1.లబ్దిదారులకు స్థలాలు కేటాయించడం 2.కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకునేలా లబ్దిదారులకు ప్రభుత్వం సాయం చేయడం 3.రోడ్లు, కరెంటు, నీటి సప్లై, డ్రైనేజ్ సదుపాయాలను కాలనీల్లో నిర్మించడం.
అందరికీ ఇళ్లు అనే కేంద్రం ఆలోచనను ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 68,381 ఎకరాల స్థలాన్ని ఈ పథకం కోసం కేటాయించింది. మొత్తం 17,005 గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో... 30.76 లక్షల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందబోతున్నారు. ఇందుకు అంచనా వ్యయం రూ.23,535 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్దిదారులు 28.30 లక్షల పక్కా ఇళ్లు కట్టుకునేలా సాయం చేస్తోంది. ఇందుకు అంచనా వ్యయం రూ.50,944 కోట్లు కానుంది.
ఇళ్ల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండేలా చేసేందుకు రెండు పోస్టులను ఏపీ ప్రభుత్వం సృష్టించింది. 2022 నాటికి ఈ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందనే ఆశతో తాను ఉన్నట్లు ఏపీ సీఎం జగన్ తన లేఖలో తెలిపారు. ఐతే... మౌలిక వసతులు కల్పించకుండా ఇళ్లు నిర్మిస్తే సరిపోదన్న సీఎం జగన్... మౌలిక వసతుల నిర్మాణానికి రూ.34,109 కోట్లు అంచనా వ్యయం అవసరం అవుతుందన్నారు. ఇంతటి భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదన్న సీఎం జగన్... ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఇళ్ల నిర్మాణం పూర్తైనా... మౌలిక వసతులు లేకపోతే... ప్రయోజనం ఉండదు అన్నారు. పెట్టిన ఖర్చంతా వేస్ట్ అవుతుందన్నారు, ఈ విషయాన్ని పరిశీలించి... పట్టణాభివృద్ది శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల వారితో చర్చించి... గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా చర్యలు తీసుకోవాలని వినతి.
ఇదీ ప్రధాని మోడీకి సీఎం జగన్ రాసిన లేఖ. ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థనపై కేంద్రం ఎలా స్పందిస్తున్నది త్వరలో తేలనుంది. ఇటీవలే ఏపీలో ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతలో 15 లక్షలపైగా ఇళ్ల నిర్మాణం కోసం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.