ఏఐసీసీ తర్వాతనే పీసీసీ! టీకాంగ్రెస్ లో ముదిరిన లొల్లీ..
posted on Jun 8, 2021 @ 2:18PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుని ఎన్నిక ప్రహసనం రోజుకో మలుపు తిరుగుతోంది. మరో వంక అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుని ఎన్నికనే ఇప్పటికి మూడుసార్లు వాయిదా వేసిన కాంగ్రెస్ అధినాయకత్వం, తెలంగాణా పీసీసీ విషయంలోనూ, ఎటూ తేల్చుకోలేక, కొత్త పాత ఫార్ములాల చుట్టూ తిరుగుతోంది. ఫలితంగా ఎంపిక ప్రక్రియ ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఇదిగో అంటే ఆరు నెలలు, అన్నట్లుగా ఎప్పుడో ఆరేడు నెలల క్రితమే పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయించారని, సోనియా గాంధీ ఓకే చేశారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉపఎన్నిక వరకు ఆగమని, పార్టీ అభ్యర్ధి, సీనియర్ నాయకుడు జానారెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు, వాయిదా పడిన ప్రకటన, సాగర్ కథ ముగిసినా, బయటకు రాలేదు. అంతేకాదు, కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పుడు తాజాగా కర్ణాటక ఫార్ములా మీద కసరత్తు సాగుతోంది. ఈ ఫార్ములా ప్రకారం కింది నుంచి పైదాకా అందరి అభిప్రాయాలు తెలుసుకుని అప్పుడు పీసీసీ అధ్యక్షుని ఎంపిక చేస్తారని అనటున్నారు. అయితే, ఈ ప్రక్రియ అంత తేలిగా జరిగేది కాదని కూడా పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.
పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ‘ఒపీనియన్స్ మార్చుకొని వాడు పాలిటీషియన్’ కాలేడు’ అన్న గిరీశం ఫార్ములాను ఫాలో అయిపోతూ.. ‘ఒపినియన్ మార్చుకుని, తాను పక్కా పాలిటీషియన్’ అని నిరుపించుకున్నారు. రెండు రోజుల క్రితం, రాజ్ భవన్’ వద్ద, పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చినా ఓకే అన్న సంకేతాలు ఇచ్చిన కోమటి రెడ్డి, సోమవారం గాంధీ భవన్ ప్రాంగణంలో జరిగిన సత్యాగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో తాను పీసీసీ రేసులో ఉన్నానని, ఆ పదవికి తాను మాత్రమే అన్ని విధాల అర్హుడినని, నొక్కి వక్కాణించారు. కేవలం రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఓకే అన్నాఆయన ఇంతలోనే, తాను మాత్రమే అర్హుడిని అని, పీసీసీ అధ్యక్ష పదవి తప్పఇంకే పదవి ఇచ్చినా తీసుకోనని స్పష్టం చేశారు. కొసమెరుపుగా, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అన్నారు. అయితే అదే సమయంలో, పార్టీ సీనియర్ నాయకుడు హనుమంత రావును కొందరు బెదిరిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను అంటూ, రేవంత్ రెడ్డికి చురక అంటించారు.అంతే కాదు, అయన సోదరుడు, ముగుగోడు ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి పార్టీ మారాలా, వద్దా అనేది ఆయన వ్యక్తిగతమని చెప్పడం ద్వారా, భవిష్య వాణి చెప్పకనే చెప్పారు.
పీసీసీ రేసులో ఉన్న మరో నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్, తనను చిన్న చూపు చూస్తున్నారని వాపోయారు. అంతే కాదు ముఖ్యమంత్రి కేసీఆర్’ను రాజకీయంగా ఎదుర్కోవడం, తనకు మాత్రమే సాధ్యమని అన్నారు. నిజానికి కోమటి రెడ్డి, జగ్గా రెడ్డి తము మాత్రమే పీసీసీ పదవికి వన్నె తెస్తామని బయట పడ్డారు, కానీ, పార్టీలో అదే అభిప్రాయంతో ఉన్న నాయకులు ఇంకా అనేకులున్నారు.
ఇదిలా ఉంటే, పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకున్న కీలక నేతలతో పాటుగా, రేసులో ఉన్నామంటున్న నేతలు కూడా పదవి రాకుంటే పక్క పార్టీలోకి జంప్’కు సిద్దమవుతున్నారని వార్తలొస్తున్నాయి. మరో వంక రేవంత్ రెడ్డి అనుచరుల నుంచి పార్టీ సీనియర్ నాయకుడు, వీహెచ్’కి బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం పార్టీలో మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్’గాచర్చకు వచ్చింది. చర్చకు దారి తీసింది. గతంలో ఇదే విషయంలో వీహెచ్, అసలు , పీసీసీ క్రమశిక్షణ సంఘం ఉందా, అని ప్రశ్నించిన నేపధ్యంలో, క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డి సీరియస్’గా స్పందించారు.
కాగా, ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న పార్టీ నేతలు, పీసీసీ పంచాయతి ఇప్పట్లో తేలదని, ఏఐసీసీ తర్వాతనే పీసీసీ సమస్య పరిష్కారం అవుతుందని అంతవరకు ఈ తమషా క్రతువు ఇలా సాగుతూనే ఉంటుందని అంటున్నారు.