ఈటల డీఎన్ఏ పే చర్చ! ఆత్మగౌరవమా.. ఆస్తుల రక్షణా?
మాజీ మంత్రి, మాజీ తెరాస నాయకుడు ఈటల రాజేందర్ తనంతట తానుగా,మంత్రి పదవికి రాజీనామా చేయలేదు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఐదేళ్లకు పైగా ఆయన అవమానాలను భరిస్తూ వచ్చారు. అవమానాలకు ఆత్మగౌరవం బలవుతున్నా పెదవి విప్పలేదు. ఆయన తమ ఆవేదను, తమలోనే దాచుకున్నారు. మంత్రి పదవికంటే ఆత్మగౌరవం ముఖ్యమని, మంత్రిపదవిని, బానిస భవన్ ముఖాన కొట్టి రాలేదు.చివరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆయన్ని బర్తరఫ్ చేశారు. బర్తరఫ్ అయిన తర్వాత కూడా ఆయన మీసాలు మేలేయ లేదు తొడలు కొట్టలేదు. అవమానాలను గుర్తుచేసుకుని ఆత్మాభిమానాన్ని చూపలేదు. తెగిన బంధం అటుకుతుందేమో అని ఆశగా ఎదురు చూసారు. కాదని తేలిన తర్వాత ప్రత్యాన్మాయ రాజకీయ వేదిక వేటలో పడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరక వర్గాల నాయకులను కలిసి చర్చలు జరిపారు ఈటల. సలహాలు, సూచనలు తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టడమా, ఉన్న పార్టీలలోచేరడమా, ఉన్న పార్టీలలో ఏది ఉత్తమం? కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీలో చేరాలి ... ఏ పార్టీలో చేరితే ఎంత లాభం, ఇలా అనేక కోణాల్లో లాభ నష్టాలను బేరీజు వేసుకున్నారు, చివరకు, కేంద్రంలో అధికారంలో ఉన్న కమల దళాన్ని ఎంచుకున్నారు. అయన బీజేపీని ఎంచుకోవడానికి, ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం ఒక కారణం అయితే,రాష్రంలోనూ అంతో ఇంతో బలము, భవిష్యత్ ఉన్న పార్టీ కావడమే కారణం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో భవిష్యత్ ఉందన్న భరోసా చిక్కితే, ఒక క్షణం అలోచించకుండా, హస్తం పార్టీతోనే చేతులు కలిపేవారు. ఇదీమి బ్రహ్మ పదార్ధం కాదు. ఎవరికీ తెలియని రహస్యం కాదు. అయినా, చిత్రంగా ఆయన పూర్వాశ్రయంలోకి తొంగి చూస్తున్నారు. అయన ఎప్పుడో వదిలేసినా ఎర్ర చొక్కాను, రెడ్ ఫ్లాగ్, నాటు తుపాకిని గుర్తు చేస్తున్నారు. చిత్రంగా ఆయన డీఎన్ఏ గురించి మాట్లాడుతున్నారు.
కమ్యూనిస్ట్ నాయకులు,మాజీ కమ్యూనిస్టులు ఈటల బీజేపీలో చేరి మైల పడి పోయారని, ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు, అలాగే, అయన, వామ పక్షాల గురింఛి చేసిన కొన్ని వ్యాఖ్యలకు నొచ్చుకుంటున్నారు. ఈటల బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం ఆత్మహత్యా సదృశమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వామపక్ష రాజకీయాలతో ప్రారంభమై.. ప్రజాస్వామికవాదిగా కొనసాగి..ఇప్పుడు మతోన్మాద ఫాసిస్ట్ బీజేపీ పంచన చేరడం సిగ్గుపడాల్సిన విషయమని విమర్శించారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడే శక్తిగా ఈటల తయారవుతారని తెలంగాణ ప్రజలు భావించారని, అయితే ఆయన నిర్ణయంతో వారందరూ చల్లబడిపోయారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తన ఉనికి కోసమే బీజేపీలోకి ఈటల వెళ్తున్నట్లు స్పష్టమవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఈటల తన అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకు బీజేపీలోకి వెళ్తున్నారా? అని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఎద్దేవా చేశారు.
మరో వైపు సీపీఐపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తప్పుపట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమన్నారు. టీఆర్ఎస్‌తో తమకు లోపాయకారి ఒప్పందం ఉంటే నిరూపించాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని తప్పుపట్టారు. ఆత్మగౌరవం కాదని.. ఆస్తుల రక్షణ కోసమే వెళుతున్నారని విమర్శించారు.
నిజానికి ఈ చర్చ అంతా అనవసరం. ఎందుకంటే, ఈరోజు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సిద్దాంతాలకు ఎప్పుడోనే విడాకులు ఇచ్చేశారు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా కోరుకునేది, కట్టుబడేది అధికారానికి, ఆత్మరక్షణకు. ఈటల అందుకు మినహాయింపు కాదు, ఆయన బీజేపీలో చేరి చేదిపోయాడని, అనుకునే వాళ్ళు అంతే.