కురుక్షేత్ర యుద్ధంలో గెలుపు నాదే! కేసీఆర్ కాస్కో అన్న రాజేందర్..
posted on Jun 8, 2021 @ 1:41PM
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచే తెలంగాణలో కొత్త శకం రాబోతుందన్నారు ఈటల రాజేందర్. రాష్ట్రంలో మరో ఉద్యమం మొదలైందన్నారు. హుజురాబాద్ గెలుపే ఆత్మగౌరవంపై పోరాడుతున్న వారి గెలుపు అవుతుందన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వారు రాష్ట్రంలో తమ ప్రాంతాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారుని.. వాళ్లంతా హుజురాబాద్‌కి వచ్చి తనకు మద్దతు తెలపాలని ఈటల పిలుపిచ్చారు.
తెలంగాణలో నీతి, నిజాయతి కాకుండా అవినీతి, మభ్యపెట్టే తీరుతో పాలన కొనసాగుతోందని ఈటల ఆరోపించారు. అక్రమంగా సంపాదించుకున్న వందల కోట్ల రూపాయలను వాడుకుంటూ కొందరు నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గొర్ల మందల మీద తొడేళ్లు పడ్డట్లుగా తన మద్దతు దారులపై దాడులు చేస్తున్నారని చెప్పారు. బ్లాక్ మెయిల్ చేసినా, దాడులు చేసినా తన వారిని కొనలేరని ఈటల తేల్చిచెప్పారు. 19 ఏళ్ల పాటు గులాబీ జెండాను, తెలంగాణ ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటే తెలంగాణ ద్రోహులను పక్కకు పెట్టుకుని, కష్టకాలంలో అండగా ఉన్న తన లాంటి వారికి కేసీఆర్ ద్రోహం చేస్తున్నారని చెప్పారు.
ప్రగతి భవన్ కేంద్రంగా స్క్రిప్టులు రాసి ఇస్తే కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఈటల అన్నారు. తాను ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసని.. తన గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వారే నష్టపోతారని చెప్పారు. తన రాజీనామా తర్వాత వచ్చే ఎన్నికలో కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారని ఈటల అన్నారు.అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓటర్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని ఈటల ధ్వజమెత్తారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో జరిగే సంగ్రామం కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలా ఉంటుంద్న ఈటల.. కేసీఆర్ విజయం సాధించే అవకాశం లేదని చెప్పారు.
టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన తర్వాత తన సొంత హుజూరాబాద్ నియోజక వర్గంలో తొలిసారి పర్యటిస్తున్న ఈటల రాజేందర్.. శంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీలో నిర్వహించారు. కొందరు వ్యక్తులు ఈ రోజు టీఆర్ఎస్ తొత్తులుగా, బానిసలుగా మారిపోయి నా మద్దతుదారులు, ప్రజలపై ఆరోపణలు చేస్తూ అవమానిస్తున్నారు. రాజకీయంగా మిమ్మల్ని బొంద పెడతాం అంటూ రాజేందర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.