గోల్డెన్ టైమ్.. బంగారం కొనడానికి ఇదే మంచి సమయమా?
posted on Jun 8, 2021 8:55AM
బంగారం మిడిసిపడుతోంది. పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వెండి సైతం తానేమి తక్కువా అన్నట్టు హొయలుపోతోంది. ఇలా, గోల్డ్-సిల్వర్‌లు జంటగుర్రాల్లా రంకెలుపెడుతున్నాయి. వీటి జోరు చస్తుంటే త్వరలోనే 60వేల మార్కును టచ్ చేసేలా కనిపిస్తోంది.
ఇన్నాళ్లూ కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చతికిలపడింది. ఆ ప్రభావం బంగారం కొనుగోళ్లపైనా పడింది. పెళ్లిళ్లు లేక జ్యువెల్లరీ షాపులు బోసి పోయాయి. అక్షయ తిధియ నాడు సైతం బిజినెస్ తగ్గిపోయింది. చాలా మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నారు. దీంతో, గిరాకీ లేక గోల్డ్ దిగుమతులు బాగా తగ్గాయి. డిమాండ్ పడిపోవడంతో ధర కూడా బాగానే తగ్గింది. అయితే, కొవిడ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పలు రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. మళ్లీ సాధారణ పరిస్థితుల వైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు. పోస్ట్‌పోన్ చేసుకున్న పెళ్లిళ్లు మళ్లీ మొదలుపెడుతున్నారు. కరోనా కారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఆ మేరకు బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. ఆగస్టు నాటికి రూ.60 వేల వరకు చేరే అవకాశం ఉందని బులియెన్ మార్కెట్ వర్గాల అంచనా.
ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందన్న కారణంతో బంగారం, వెండి ధరలు ఫామ్‌లోకి వస్తున్నాయి. మార్చి నెల 31న 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర రూ.41,100 ఉండగా.. అదిప్పుడు (మంగళవారం) రూ.47,800కు చేరింది. అంటే, 67 రోజుల్లో ధర రూ.6,700 పెరిగినట్టు. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా… ఇప్పుడు రూ.52,300 ఉంది. అంటే 67 రోజుల్లో ధర రూ.7,460 పెరిగింది. రాష్ట్రాలను బట్టి ఈ ధరల్లో కాస్త వ్యత్యాసం ఉంటుంది.
ఇక గత10 రోజుల్లో బంగారం ధర 7 సార్లు పెరగ్గా, రెండు సార్లు తగ్గింది. ఒకరోజు స్థిరంగా ఉంది. వెండి ధరలు గత 10 రోజుల్లో 6 సార్లు పెరగగా 3 సార్లు తగ్గాయి. ఒకరోజు స్థిరంగా ఉన్నాయి. నిన్న దేశీయంగా కిలో వెండి ధర రూ. 71 వేలు ఉంది.
బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలి అనుకునేవారికి ఇదే మంచి అవకాశమని అంటున్నారు బులియన్ వ్యాపారులు. గోల్డ్ రేట్ పెరగడం ఇప్పుడే మొదలైందని.. భవిష్యత్తులో మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు రూ.50వేల లోపే తులం బంగారం వస్తోంది కాబట్టి.. ఇప్పుడు కొనిపెట్టుకుంటే.. రానున్న రోజుల్లో రూ.60వేలకు చేరే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఈ లెక్కన.. దాదాపు 20 శాతం లాభం పొందినట్టు అవుతుందని అంటున్నారు. అన్‌లాక్ కంప్లీట్ అయి.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటే.. ఇక పసిడి పరుగులకు పగ్గాలు ఉండవని.. అందుకే, బంగారం కొనుగోలుకు ఇదే మంచి తరుణమని ఊరిస్తున్నారు వ్యాపారులు. ఈ ఏడాది పెళ్లిళ్లు మామూలుగా జరిగే అవకాశం ఉంది కాబట్టి.. అప్పటికల్లా బంగారం లాగే.. ధర కూడా ధగధగ మెరవడం ఖాయమంటున్నారు.