నెట్‌లో ఫోటోలు.. 36 కోట్లు వసూలు.. ఇద్దరు పోకిరీలు..
posted on Jun 8, 2021 8:15AM
ఇద్దరు పోకిరీలు చేసిన పనికిమాలిన పనికి.. 36 కోట్లు చెల్లించాల్సి వచ్చింది యాపిల్ కంపెనీకి. పైసలతో పాటు పరువూ పోయింది. యాపిల్ అధీకృత సర్వీస్ సెంటర్‌లో పని చేసే ఇద్దరు టెక్నీషియన్లు.. రిపేర్‌కు వచ్చిన ఫోన్‌లోని పర్సనల్ ఫోటోలను కాపీ చేసుకున్నారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అంతే. విషయం ఎక్కడికో వెళ్లింది. ఏకంగా యాపిల్ సంస్థే దిగొచ్చింది. బాధితురాలికి ఏకంగా 36 కోట్లు చెల్లించింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
ఒరెగాన్‌లోని యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థిని.. తన యాపిల్ ఫోన్ రిపేర్‌కు రావడంతో 2016లో సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లింది. పెగట్రాన్ సంస్థ ఆ సర్వీస్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఫోన్ రిపేర్ చేసే క్రమంలో అక్కడ పనిచేసే ఇద్దరు టెక్నీషియన్లు ఆ ఫోన్‌లోని ఆమె వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను దొంగిలించి ఆన్‌లైన్‌లో ఉంచారు. కొన్ని రోజుల్లోనే ఆ ఫోటోలు వైరల్ అవటం.. ఆ విషయం తెలిసి బాధితురాలు అవాక్కవడం జరిగిపోయింది. తన ఫోటోలను యాపిల్ సర్వీస్ సెంటర్ సిబ్బంది తస్కరించారంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది. అమెరికా చట్టాలు కదా.. ఫుల్ ఖతర్నాక్ ఉంటాయి. డేటా చోరీ కేసులో యాపిల్ సంస్థకు భారీ మొత్తంలో ఫైన్ విధించింది అక్కడి కోర్టు.
బాధితురాలి తరఫు లాయర్ 5 మిలియన్ డాలర్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అంటే మన కరెన్సీలో దాదాపు 36 కోట్ల రూపాయలు. అయితే, ఈ కేసును యాపిల్ సంస్థ కోర్టు బయటే సెటిల్ చేసుకుంది. తమ సంస్థ సిబ్బంది వల్ల మెంటల్ టార్చర్ అనుభవించిన ఆ యువతికి భారీ మొత్తమే చెల్లించిందట యాపలి్ కంపెనీ. ఆ తర్వాత తప్పు చేసినట్లు తేలిన ఆ ఇద్దరు ఉద్యోగులను జాబ్ నుంచి తొలగించింది. అనంతరం ఆ ఉద్యోగులను నియమించిన పెగట్రాన్ సంస్థ నుంచి చెల్లించిన మొత్తాన్ని తిరిగి రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం విషయం రహస్యంగా జరిగినా.. అది ‘టెలిగ్రాఫ్’ లో రావడంతో విషయం ఆలస్యంగా బయటకొచ్చింది.