కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్ రెడీ! ఆ మంత్రికి ఊస్టింగేనా?
posted on Jun 8, 2021 @ 11:55AM
తెలంగాణ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ చుట్టే తిరుగుతున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటలను కేసీఆర్ తొలగించడం కాక రేపింది. కేసీఆర్ తీరుపై రగిలిపోయిన రాజేందర్.. భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ చర్చలు జరిపారు. కొత్త పార్టీ పెట్టాలని ప్రయత్నించినా..చివరకి కమలం గూటికి చేరాలని డిసైడయ్యారు. ఇటీవల గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన ఈటల.. త్వరలో అధికారికంగా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటలకు రాజకీయంగా ఇబ్బందులు పెట్టేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. ఈటల రాజీనామాతో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ఆపరేషన్ మొదలుపెట్టారని చెబుతున్నారు.
ఈటలను తొలగించిన కేసీఆర్.. త్వరలో మరో మంత్రిని టార్గెట్ చేయనున్నారనే ప్రచారం తెలంగాణ భవన్ లో జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా ఆ మంత్రి తీరును గమనిస్తున్న గులాబీ బాస్.. త్వరలోనే చెక్ పెట్టనున్నారని సమాచారం. ఉద్యమం నుంచి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న సదరు మంత్రి... కొన్ని రోజలుగా కేసీఆర్ దగ్గరకు రావడం లేదని చెబుతున్నారు. కేబినెట్ సమావేశాలు, జిల్లాకు సంబంధించిన పాలనా వ్యవహారాలు తప్ప.. కేసీఆర్ ను కలవడం లేదని తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాలతోనే సదరు మంత్రిని ప్రగతి భవన్ లోనికి రానివ్వడం లేదనే చర్చ టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది.
సీఎం కేసీఆర్ తర్వాత వేటు వేస్తారనే ప్రచారం జరుగుతున్న ఆ మంత్రి ఎవరో కాదు.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జగదీశ్ రెడ్డి. అవును కేసీఆర్ కు మొదటి నుంచి అత్యంత సన్నిహితంగా ఉన్న జగదీశ్ రెడ్డిపైనే త్వరలో వేటు పడనుందని తెలుస్తోంది. ఇందుకు ఆయన నిర్వహించిన ఓ కార్యక్రమమే కారణమంటున్నారు. ఈ సంవత్సరం జనవరిలో మంత్రి జగదీశ్ రెడ్డి.. కర్ణాటకలోని హంపిలో ఓ పార్టీ ఏర్పాటు చేశారట. తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా అరేంజ్ చేసిన ఆ పార్టీకి నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారట. ఆ సమావేశంలోనే కేసీఆర్ పనితీరుపై చర్చ జరిగిందని తెలుస్తోంది. కొందరు నేతలు కేసీఆర్ కుటుంబంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని సమాచారం.
జగదీశ్ రెడ్డి పార్టీలో పాల్గొన్న నేతలు కేసీఆర్ ప్యామిలీ విషయాలతో పాటు ఈటల రాజేందర్ వ్యవహారంపైనా చర్చించారట. అప్పటికే పలుసార్లు రాజేందర్.. కేసీఆర్ ను టార్గెట్ చేసేలా మాట్లాడారు. ఈటల విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ మోనార్క్ లా వ్యవహరిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు లూజ్ టాక్ చేశారని సమాచారం. ఈటల సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందని కూడా మాట్లాడుకున్నారట. జగదీశ్ రెడ్డికి కూడా కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు మాట్లాడారని తెలుస్తోంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు మాట్లాడుతున్నా జగదీశ్ రెడ్డి వారించలేదని తెలుస్తోంది. మంత్రి సైలెంటుగా ఉండటంతో కొందరు ఎమ్మెల్యేలు, నేతలు రెచ్చిపోయి కేసీఆర్ పై మాట్లాడారని కూడా తెలుస్తోంది.
కర్ణాటక హంపిలో జరిగిన పార్టీలో జగదీశ్ రెడ్డితో పాటు ఆయన వర్గంగా చెప్పుకునే ఎమ్మెల్యేలు, నాయకుల వ్యవహారం పూర్తిగా కేసీఆర్ కు చేరిందంటున్నారు. హంపి వీడీయో పూటేజ్ ను పరిశీలించిన కేసీఆర్.. జగదీశ్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగాల్సి ఉండటంతో కూల్ అయ్యారని చెబుతున్నారు. ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్న గులాబీ బాస్.. ఈటల రాజేందర్ ను సాగనంపారు. త్వరలోనే జగదీశ్ రెడ్డిపై వేటు వేయనున్నారని తెలంగాణ భవన్ లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి.