ఫ్రస్టేషన్లో డీజీపీ గౌతమ్ సవాంగ్.. జగన్ రెడ్డే కారణమా?
posted on Jun 8, 2021 @ 2:27PM
మహాభారతంలో విదురుడు దుర్యోధనుడి దుర్మార్గాలను భరించలేక నోరు విప్పాడు. రామాయణంలో రావణాసురుడి రాక్షసత్వాన్ని తట్టుకోలేక విభీషణుడు సైతం నోరు విప్పాడు. కాని అటు నోరు విప్పలేక.. మనసులో ఉన్నది కక్కలేక.. ఫుల్లు ఫ్రస్టేషన్ తో ఆంధ్రప్రదేశ్ లో ఆ అధికారి అల్లాడిపోతున్నాడు. వద్దు వద్దని చెప్పాడు.. చేస్తే చేసుకోండి.. కాని ఇధి పద్ధతి కాదని చిలక్కి చెప్పినట్లు చెప్పాడు.. ఆ తర్వాత అతడిని అడగటమే మానేశారు.. సబార్డినేట్ సైతం తనను పక్కన పెట్టి ప్రొసీడ్ అయిపోవటంతో సైలెంట్ అవడం తప్ప ఏం చేయలేకపోయారు. కాని ఇప్పుడు సబార్డినేట్ చేసిన ఆ తప్పుల వల్ల మొత్తానికే ఎసరొస్తుందని.. చెప్పినా వినలేదని పిడికిలితో బల్ల మీద గుద్దడం తప్ప ఏం చేయలేక ఫ్రస్టేషన్ తో అల్లాడిపోతున్నారట. ఆయనే గౌతమ్ సవాంగ్..ఏపీ డీజీపీ. ఇప్పుడు అమరావతి సర్కిల్స్ లో ఇదే స్టోరీ రీసౌండ్ తో వినిపిస్తోంది.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ లో సీఐడీ వాళ్లు చూపించిన దూకుడు ఇప్పుడు సుప్రీంకోర్టులోనే కాకుండా పార్లమెంట్ లోనూ ప్రశ్నలకు గురయ్యే అవకాశం కనపడుతోంది. అరెస్టు చేయడమే సినీఫక్కీలో చేశారు. ఆ తర్వాత గుంటూరు సీఐడీ ఆఫీసులో ఇంటరాగేషన్ చేశారు. మామూలుగానే ఓ నిందితుడిని.. అందులోనూ ఆయనను అరెస్ట్ చేసిన కేసులో.. అందులోనూ ఓ ఎంపీని చేయి చేసుకోకూడదు. కాని చేసుకున్నారనేది ఎంపీ వాదన. ఇందుకు ఆయన తన శరీరంలోని భాగాలనే సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో మేనేజ్ చేశారు.. వేరే ఆస్పత్రికి వెళ్లకుండా సాంకేతికంగా ఉన్న అవకాశాలన్నీ వాడుకుని జైలుకు తీసుకుపోవాలని చూశారు. కాని సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తీసుకుపోవాల్సి వచ్చింది. అక్కడే కథ అడ్డం తిరిగింది. దెబ్బలున్నాయని నివేదిక వచ్చింది. సుప్రీం ఎంపీకి బెయిల్ ఇచ్చింది.
ఇప్పుడు రఘురామకృష్ణరాజు హోంమంత్రికి, రక్షణశాఖ మంత్రికి, పార్లమెంటరీ కమిటీలకు, స్పీకర్ కి, రేపో మాపో రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి కూడా తన ఆరోపణలన్నీ వినిపించారు..వినిపిస్తున్నారు.. వినిపిస్తారు. ఇవన్నీ ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కి చక్రబంధాలు వేస్తున్నాయ్. ఇదే జరుగుతుందని ముందే చెప్పిన డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం ఇరుకునపడే అవకాశం కనపడుతోంది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో పని చేశారని.. డీజీపీని సైతం పట్టించుకోలేదనే టాక్ వినపడుతోంది. ప్రభుత్వ రాజకీయ వ్యూహాలు శృతి మించినప్పుడు అధికారులే ఆ వ్యూహాల్లో బలిపశువులుగా మారతారనేది చరిత్ర చెబుతోన్న సత్యం.
డీజీపీ గౌతమ్ సవాంగ్ మొదటి నుంచి సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. మాట పడటమంటేనే ఇష్టముండదని సన్నిహితులు చెబుతుంటారు. కెరీర్ లో రిమార్క్స్ లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తారు.. అదే సమయంలో ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటూనే ఇఫ్, బట్స్ మెయిన్ టెయిన్ చేస్తుంటారని అంటుంటారు. కాని రిమార్కులు కాదు.. వైసీపీ హయాంలో డీజీపీకి పదవి చేపట్టిన సవాంగ్ పై ఏకంగా మరకలే పడ్డాయి. హైకోర్టు మూడు సందర్భాల్లో డీజీపీని నేరుగా విమర్శించింది. కోర్టుకే రప్పించింది. అలాంటి పరిస్ధితులను చూసిన సవాంగ్.. తట్టుకున్నారో లేదో ఆయన మనస్సాక్షికే తెలియాలి. మొదట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాసిన లేఖలకు, ఆరోపణలు,విమర్శలకు కౌంటర్ ఇవ్వటానికి గౌతమ్ సవాంగ్ ప్రయత్నించారు. కాని పరిస్ధితి అదుపు తప్పుతుండటంతో.. మీడియా ముందుకు రావడమే తగ్గించేశారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ గురించి ఇప్పటివరకు డీజీపీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం.. తనకు సంబంధం లేనట్లుగా ఉండటం.. చూస్తుంటే.. సవాంగ్ ఎలా ఫీలవుతున్నారో అర్ధమవుతుందనే కామెంట్లు డిపార్టుమెంట్లోనే వినపడుతున్నాయి.