షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ.. జూలై8న ప్రకటన
posted on Jun 7, 2021 @ 9:34PM
గత కొంత కాలంగా, తెలంగాణలో ‘రాజన్న రాజ్యం’ లక్ష్యంగా, రాజకీయ పార్టీ ఏర్పాటుకు, సన్నాహాలు చేస్తున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల, ముందుగా ప్రకటించిన విధంగా జులై 8, వైఎస్సార్ జన్మదినం రోజున పార్టీ ప్రారంభానికి సిద్దవుతున్నారు. కాగా, పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లు, సమాచారం.పార్టీ పేరును వైఎస్సార్’ టీపీ గా ఖరారు చేశారు.
పార్టీ పేరు ఆంధ్ర ప్రదేశ్’లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును పోలి ఉన్నందున, ఆ పార్టీ నుంచి అబ్యంతరం రాకుండా, షర్మిల, వైఎస్సార్ సీపీ, గౌరవ అధ్యక్షురాలు, తల్లి విజయమ్మ నుంచి ‘నో అబ్జెక్షన్’ లేఖను ఎన్నికల సంఘానికి సమర్పించారు. దీంతో ఇక ఆమె పార్టీ రిజిస్ట్రేషన్’కు ఎలాంటి అడ్డంకులు ఉండవని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని షర్మిల భావిస్తున్నారు.ఆంధ్ర ప్రదేశ్’లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ (యువజన, శ్రామిక, రైతు, కాంగ్రెస్ పార్టీ)పేరు తమ పార్టీ పేరును పోలి ఉందని, ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ‘అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మహబూబ్ బాషా ఢిల్లీ హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం ఇటీవలనే కొట్టి వేసిన విషయం తెలిసిందే.
వైఎస్ షర్మిల, తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం విషయంలో, మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్త మావుతూనే ఉన్నాయి.ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వెనకబీజేపీ నుంచి తెరాస వరకు, ఎవరెవరి హస్తమో ఉందన్న ఆరోపణలు వచ్చాయి.అలాగే, జగనన్నవిడిచిన బాణం అన్న అనుమానాలు వ్యక్త మయ్యాయి.అయితే షర్మిల, మాత్రం ఆరోపణలను పట్టించుకోకుండా, ‘రాజన్న రాజ్యం’ ఒక్కటే నినాదంగా పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో మునిగిపోయారు. జిల్లాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహించడంతో పాటుగా, తెరాస ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ,ముఖ్యమంత్రి కేసీఆర్’ పై విమర్శలు చేస్తున్నారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారం కోరుతూ ఏప్రిల్ నెలలో ఇందిరా పార్క్ వద్ద,72 గంటల దీక్ష చేపట్టి సంచలనం సృష్టించారు.అయితే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనుమతిచ్చిన పోలీసుల సాయంత్రం దీక్షనుభగ్నం చేయడంతో, పోలీసుల తీరుకు నిరసనగా షర్మిల ధర్నాచౌక్ నుంచి లోటస్ పాండ్ వరకు కాలినడకన వెళ్లి సంచలనం సృష్టించారు. అంతే కాకుండా, ఆమె నిజమైన తెలంగాణ నాయకులకంటే, కేసీఆర్’ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.‘మనం ప్రశ్నించకపోతే తెలంగాణ మొత్తాన్ని దొరగారు లూటీ చేస్తారు’ అంటూ పరుషంగా విమర్శిస్తున్నారు.