కమలంలో కట్టు తప్పిన క్రమశిక్షణ! బండి పట్టాలు తప్పిందా..?
posted on Jun 29, 2021 @ 11:26AM
ముఠాలు, కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీలోనే కానీ, క్రమశిక్షణకు మారు పేరైన బీజేపీలో ఉండవు అని ఎవరైనా అనుకుంటే వారు తప్పులో కాలేసినట్లే ... ఒకప్పడు అధికారానికి దూరంగా ఉన్న రోజుల్లో బీజేపీలో మడీ ఆచార కట్టుబాట్లు ఉంటే ఉండేవేమో కానీ, ఇప్పుడు అంత సీన్ లేదు. అప్పట్లో కాంగ్రెస్, ఇతర మధ్యేవాద పార్టీలకు కొంత భిన్నంగా, విభిన్నంగా బీజేపీ ఉండేదేమో,కానీ, అధికారం రుచి మరిగిన తర్వాత,ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చి పోయే వాళ్ళు ఎక్కువైన తర్వాత,అన్ని పార్టీల అవలక్షణాలు కమల దళానికి అంటుకున్నాయి. నిజానికి, ఈమధ్య కాలంలో ఇతర పార్టీలలో కంటే కూడా బీజేపీలో క్రమశిక్షణా రాహిత్యం కొంచెం ఎక్కువగా కనిపిస్తోందని, కమలదళం పాత కాపులు బాధను వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో అయితే బీజేపీలో క్రమశిక్షణ రాహిత్యం, తరచూ వార్తల్లో వినవస్తోంది. కొద్ది కాలం క్రితం, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు సారధ్యంలో ప్రతి నాయాకుల బృందం, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్’ ను కలిశారు. పార్టీ నాయకులు బృందం మరో పార్టీ నాయకుడిని కలవడం తప్పు కాకపోయినా, పార్టీకి సమాచారమే లేకుండా, కనీసం పార్టీ అధ్యక్షుడి అనుమతి అయినా లేకుండా కలవడం పార్టీలో దుమారం సృష్టించింది. షోకాజు నోటీసులు, విచారణలు,వివరణలు, సంజాయిషీలు ఇలా చాలా కథ నడిచింది.
ఇక ప్రస్తుతానికి వస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం దళిత సాధికరితఫై ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హాజరు కావడం పార్టీలో దుమారం రేపుతోంది. ఎస్సీ సాధికారతపై ముఖ్యమత్రి కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ నాయకత్వం బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా.. పార్టీని కాదని మోత్కుపల్లి హాజరు కావడంపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పార్టీ నిర్ణయాన్ని కదాని కేసీఆర్‌తో భేటీకి మోత్కుపల్లి ఎలా హాజరవుతారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే మోత్కుపల్లి తమను తాము గట్టిగా సమర్ధించుకుంటున్నారు. అఖిల పక్ష సమావేశానికి హాజరై బీజేపీని రక్షించానని చెప్పుకుంటున్నారు. లేదంటే బీజేపీపై దళిత వ్యతిరేక ముద్ర పడేదంటూ ఆయన పార్టీ నేతలకు పాఠాలు చెపుతున్నారు. ఒక విధంగా సవాలు విసురుతున్నారు.
అదలా ఉంటే,అనుమతి లేకుండా మీటింగ్’కు వెళ్ళిన మోత్కుపల్లి, మీడియా ఇంటర్వ్యూ లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ఎంతో గొప్పగా పనిచేస్తున్నారని కొనియాడుతున్నారు. ఇలాంటి నిర్ణయం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదని ప్రశంసిస్తున్నారు. మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో చర్యలు తీసుకుని.. ప్రభుత్వంపై విశ్వాసం కల్గించారని కితాబు నిచ్చారు.
నిజానికి, మోత్కుపల్లి బీజేపీలో చేరక ముందు నుంచే తెరాసలో చేరుతున్నారని వార్తలొచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కారెక్కేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే, అటునుంచి ఎంతకీ గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో .. ఎదురు చూసి చూసి చివరకు బీజేపీ చేరారు. ఇక ప్రస్తుతానికి వస్తే, మోత్కుపల్లి త్వరలో కారెక్కడం ఖాయంగా కనిపిస్తోందని, బీజేపీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే స్వలాభం కోసం పార్టీలు మారనని, తాను కేసీఆర్‌కు దగ్గర కాలేదని, భారతీయ జనతాపార్టీలోనే ఉంటానని మోత్కుపల్లి స్పష్టం చేశారు. బహుశా గతంలో ఎదురైన చేదు అనుభవం దృష్టిలో ఉంచుకుని కావచ్చు,జాగ్రత్త పడుతున్నారు. అందులోనూ అసలే ఆయన కేసీఆర్, ఆయనకు ఎప్పుడు ఎవరు ఎదుకు ముద్దోస్తారో.. ఎవరు ఎప్పుడు కంపవుతారో .. ఆయనకే తెలియదు. అదీ గాక మోత్కుపల్లి తీరని కోరిక ఎదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కావడం,ఆ కోరిక తీరాలంటే బీజేపీలో ఉండవలసిందే, అందుకే కావచ్చు.. ఆయన అటూ ఇటూ అవుతున్నారు. అయితే, కేసీఆర్ పిలిస్తే మాత్రం ... మిత్కుపల్లి నిముషం ఆలోచించకుండా వెళ్లి కారెక్కుతారు. అందులో సందేహంలేడంటున్నారు ఆయన సన్నిహితులు.