వాళ్లు కలిస్తే.. ఊహకే ఉలిక్కిపడుతున్న వైసీపీ
posted on Jun 29, 2021 @ 11:16AM
వాళ్లు కలుస్తారని కొందరు అనుకుంటున్నారు. కలిస్తే బాగుండని కొందరు ఫీలవుతున్నారు. కలవకూడదని బలంగా మరికొందరు ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఆయనేమనుకుంటున్నారో మాత్రం తెలియదు. ఆయన ఫ్యాన్స్ దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కాని రాతల పోటీలు మాత్రం సోషల్ మీడియాలో జరిగిపోతున్నాయి. కలుస్తారని కొందరు రాస్తుంటే... కలిస్తే అది బ్లండర్ అవుతుందని ఆ నాయకుడికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు మరికొందరు.
జగన్ ఈసారి కూడా వచ్చేటట్లు ఉన్నాడు. సంక్షేమ పథకాల పేరుతో జనానికి డబ్బులు వేసేస్తున్నాడు.. మిగతా విషయాలు మాత్రం పట్టించుకోరు. మళ్లీ ఆయనకే వేసేస్తారేమో. కాని టీడీపీ జనసేన కలిస్తే మాత్రం...ఓడగొట్టేస్తారు భయ్యా...ఇలా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. చాలా చోట్ల జగన్ ను తిట్టుకుంటున్నారు..వ్యతిరేకత ఉందనుకున్నా...స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆ అంచనాలను గందరగోళంలో పడేశాయి. అప్పటి నుంచే ఈ కొత్త ఈక్వేషన్ గురించి చర్చ మొదలైంది. చంద్రబాబు మనసులో ఏముందో తెలియదు...పవన్ మనసులో ఏమనుకుంటున్నారో అసలే తెలియదు.. కాని చర్చ మాత్రం నడుస్తోంది.
సోషల్ మీడియాలో కొందరు ఈ చర్చను పెడుతుంటే.. కొన్నిఛానళ్లు ఒక అడుగు ముందుకేసి కలిసిపోతున్నారని స్టోరీలు ప్రసారం చేస్తున్నాయి. టీడీపీ కోసం కొందరు ఈ పని చేస్తున్నారనుకోవచ్చు. కాని ఆశ్చర్యం ఏంటంటే.. వైసీపీని బహిరంగంగా సమర్ధిస్తున్న ఓ వెబ్ పోర్టల్ అయితే వారిద్దరూ కలవలేరని.. కలవకూడదని..ఒకవేళ పవన్ అలాంటి నిర్ణయం తీసుకుంటే తప్పు చేసినవాడే అవుతాడని..పైగా బిజెపికి దూరమైతే..భవిష్యత్ ఉండదని హెచ్చరించింది. ఎలాంటి మొహమాటం లేకుండా ఇవే మాటలు డైరెక్టుగా చెప్పేసింది.
ఆ కథనం చూస్తే.. టీడీపీ, జనసేన ఎట్టిపరిస్ధితుల్లో కలవకూడదని వైసీపీ బలంగా కోరుకుంటున్నట్లు అర్ధమవుతోంది. ఆ కలయుక ఊహల పట్లే భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఆ చర్చను కొనసాగించేలా చేసింది. లేదంటే పవన్ కేంద్ర మంత్రి పదవిలా కొన్నాళ్లు నడిచి ఆగిపోయేది. కాని ఇప్పుడు ఆ వెబ్ పోర్టల్ చర్చకు సశేషం మార్క్ పెట్టింది. అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలను సైతం ఆలోచనలో పడేసింది.
పవన్ జనసేన పెట్టిన వెంటనే బిజెపికి, ఆ తర్వాత టీడీపీకి మద్దతు పలికారు. 2014 ఎన్నికల్లో అది ఫలితాలను మార్చిందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత అమరావతి విషయంలో పవన్ ఆందోళన చేశారు. తర్వాత టీడీపీ పరిపాలనపైనా ధ్వజమెత్తారు. మరోవైపు జగన్ వైఖరిపైనా మండిపడ్డారు. ఎవరు బలమైన శత్రువో తేల్చుకోలేక గందరగోళంలో పడటం.. టీడీపీతో అవగాహనే అనే అనుమానాలు జనంలో పెరగడంతో ఫలితాలు వేరేగా వచ్చాయి. అప్పటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటూ..మెల్లగా బిజెపికి దగ్గరయ్యారు. కాని అక్కడా సంతృప్తి లేదు. అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా తదితర విషయాల్లో బిజెపి వైఖరి ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. అలాగే జగన్ పట్ల రహస్య ప్రేమ చూపిస్తూ బిజెపి పవన్ ఆగ్రహానికి గురవుతోంది. అందుకే మళ్లీ పవన్ టీడీపీ వైపు వస్తారా అనే అంచనాలు మొదలయ్యాయి. కలిస్తే ఏంటి..కలవకపోతే ఏంటి అనే చర్చ బలంగా సాగుతుండటంతో.. ఇరు పార్టీల అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. మరి ఏం జరగనున్నదో వేచి చూడాల్సిందే.