క్యాట్ వాక్ మంత్రి.. బండి.. గుండు! రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి..
posted on Jun 29, 2021 @ 12:27PM
తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎంపికైన ఎంపీ మల్కాజ్ గిరి దూకుడు పెంచారు. తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చుతున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేశారు. పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించడంపై ఫైరయ్యారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కౌన్సిల్ మీటింగ్ విర్చువల్ గా చేయడం వెనక ఉన్న దురుద్ధేశాలు ఏంటని ప్రశ్నించారు. మీడియా ని ghmc లోకి ఎందుకు అనుమతించట్లేదని నిలదీశారు. పాలన అంతా పారదర్శకంగా జరుగుతున్నప్పుడు మీడియా ను ఎందుకు అనుమతించడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్ ను చెత్త నగరంగా మార్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తూతూ మంత్రంగా.. టూత్ పాలిష్ లాగా పనులు చేస్తూ షో చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని 16 నివాసాయోగ్యమైన పట్టణాల జాబితాలో హైదరాబాద్ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో జిహెచ్ఎంసి కి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డులు వచ్చాయని చెప్పారు. కేసీఆర్ పాలనలో మహా నగరం నరకంగా మారిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నే జిహెచ్ఎంసి అప్పుల్లోకి వెళ్ళిపోయిందన్నారు. నాలల్లో ముంపు సమస్య తీరలేదని ఆరోపించారు. కనీసం చెత్త కూడా తీయలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాబట్టడంలో బల్దియా అధికారులు విఫలం అయ్యారని విమర్శించారు.
ఫ్యాషన్ షో క్యాట్ వాక్..ktr క్యాట్ వాక్ రెండు ఒకేలా ఉంటాయంటూ హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి.హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే ఫలితం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. రూ.800 కోట్లతో వరద నివారణ చర్యలు చేపడతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. అంతేగాక. అన్ని రకాల పన్నులు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు కానీ, జీహెచ్ఎంసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన పన్నులు మాత్రం చెల్లించడం లేదని చెప్పారు.
బీజేపీ నేతలపైనా విరుచుకుపడ్డారు మల్కాజ్ గిరి ఎంపీ. బీజేపీ నేతలు పగటి వేషగాళ్లుగా మారిపోయారని విమర్శించారు.ప్రజా సమస్యలపై పనిచేయట్లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎటుపోయినాయ్ అని ప్రశ్నించారు. బండి సంజయ్ బండి ఎటుపాయో అంటూ సెటైర్లు వేశారు. బండి పాయో గుండు పాయే అంటూ సంజయ్ తో పాటు ఎంపీ అర్వింద్ ను టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి.
'ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చే విషయం దేవుడెరుగు. కనీసం ప్రభుత్వ బంగ్లాల పన్నులు చెల్లించడంలేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టట్లేదు. జీహెచ్ఎంసీలో అతిపెద్ద పన్ను ఎగవేతదారుడు కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వమే. ప్రగతి భవన్‌కు కూడా రూపాయి పన్ను కట్టలేదు' అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
'ఆ భవన్‌కు నీళ్లు, విద్యుత్ ఆపేయాలి. నేను జీహెచ్ఎంసీ మేయర్‌కు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నాకున్న సమాచారం మేరకు ప్రభుత్వం 2,600 కోట్ల రూపాయల పన్నులు కట్టాలి. ఆ పన్నులు రాబట్టితే జీహెచ్ఎంసీ అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం పన్నులు చెల్లించడం లేదు. హైదరాబాద్ నగరం తెలంగాణ గుండె. ఇక్కడి నాలాలు, చెరువులు కబ్జాకు గురి కాకుండా సీసీ కెమెరాలు పెట్టాలి. కానీ, మాఫియాకు మద్దతుగా ఉండేందుకే ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టట్లేదు. త్వరలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తాను' అని రేవంత్ రెడ్డి చెప్పారు.