కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి జోష్.. గంటల్లోనే కోమటిరెడ్డి కూల్..
posted on Jun 28, 2021 @ 9:16PM
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి సీనియర్ల మద్దతు పెరిగింది. గతంలో అతనికి వ్యతిరేకించిన నేతలు కూడా రేవంత్ కు సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ కు మంచి రోజులు రాబోతున్నాయని చెబుతున్నారు. పార్టీ నేతలంతా రేవంత్ జపం చేస్తుండంతో.. వ్యతిరేకంగా ముద్ర పడిన నేతలు సైలెంట్ గా ఉండిపోయారు. ఇక పీసీసీ చీఫ్ పదవిని అమ్ముకున్నారని ఆరోపించి కాక రేపిన సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కొన్ని గంటల్లోనే కూలై పోయారు. గాంధీభవన్ మెట్లెక్కను గాక ఎక్కను అంటూ శపథం చేసిన ఆయన.. ఇకపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు.
ఆదివారం సాయంత్రం నుంచి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఫోన్ స్విచ్ఛాప్ పెట్టిన కోమటిరెడ్డి... సోమవారం సాయంత్రం ఒక ప్రెస్ నోట్ జారీ చేశారు. తన ముందున్న లక్ష్యం ఏంటో ఆ ప్రకటనలో వెల్లడించారు. ప్రజాసమస్యలపై మాత్రం ఏ సమయంలో వచ్చినా స్పందిస్తానని, రాజకీయాల్లోకి మాత్రం తనను లాగొద్దని పేర్కొన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి గ్రామానికి వెళతానని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేసిన ప్రెస్ నోట్ ఇలా ఉంది...
ఇకపై ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని.. తనను రాజకీయాల్లోకి లాగవద్దని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి రాజకీయపరమైన విషయాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనని.. దానికి సహకరించాలని జర్నలిస్టులను కోరారు.
తను భువనగిరి ఎంపీ ఎన్నికైనా నుంచి అన్ని గ్రామాల్లో పర్యటించలేదని.. కరోనా కాలంగా కొద్ది గ్రామాలకు మాత్రమే వెళ్లినట్లు తెలిపారు. ఇక నుంచి భువనగిరి, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడ తిష్ట వేసిన సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తానని వివరించారు. అలాగే గ్రామాల అభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారానికి పూర్తిగా సమయం కేటాయిస్తానని తెలిపారు.
అలాగే పూర్తిస్థాయిలో సేవా కార్యక్రమాల మీదే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వీలైనంత ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేపడుతానని తెలిపారు. నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైనా తన తలుపు తట్టవచ్చని వెల్లడించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు జాప్యం వల్ల నల్గొండ జిల్లాలో వేలాది ఎకరాలు బీడు వారుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. అలాగే 90శాతం పూర్తయిన బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు వంద కోట్లు ఖర్చు చేస్తే పూర్తై వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తానని తెలిపారు. వీటితో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్లు త్వరగా అందుబాటులోకి వచ్చేలా సర్కార్‌పై ప్రజల పక్షాన యుద్దం చేస్తానని తెలిపారు.