చిరంజీవిపై కాంగ్రెస్ నేత సంచలన కామెంట్లు..
posted on Jun 28, 2021 @ 7:03PM
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంతో... తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఏపీలోనూ పార్టీ బలోపేతంపై హైకమాండ్ ఫోకస్ చేసినట్లు ఉంది. అందుకే రెండు రోజుల పర్యటనకు ఏపీ వచ్చారు ఉమెన్ చాందీ. ఏపీలో పార్టీ పరిస్థితిని సమీక్షించడంతో పాటు భవిష్యత్ లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవిని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు చిరంజీవి. అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ 18 అసెంబ్లీ సీట్లు గెలిచింది. అయితే కొన్ని రోజుల తర్వాత ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. చిరంజీవి. ఆ తర్వాత చిరంజీవిని రాజ్యసభకు పంపి కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించింది కాంగ్రెస్. రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ ఏపీలో ఘోరంగా ఓడిపోవడంతో చిరంజీవి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు చిరంజీవి. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా రాజకీయాలు కొనసాగిస్తున్నప్పటికీ.. చిరంజీవి మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. సినిమాలపై దృష్టి సారించారు.
కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవిపై తాజాగా ఉమెన్ చాందీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని ఆయన అన్నారు. వచ్చే నెల 7 నుంచి 17 వరకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఉమెన్ చాందీతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అయితే ఈ నిరసనల్లో చిరంజీవి పాల్గొంటారా ? అని కొందరు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఉమెన్ చాందీ.. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో చిరంజీవి బంధం ముగిసిపోయిందనే అంశంపై ఆ పార్టీ దాదాపుగా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది
కాంగ్రెస్ సీనియర్ నేత ఉమన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌తో చిరంజీవి బంధం పూర్తిగా ముగిసిపోయిందని తెలుస్తోంది. చిరంజీవిని రాజ్యసభకు పంపాలని ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఉమెన్ చాంధీ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.