అసత్యాలు.. ఉత్తమాటలు.. నిరుద్యోగులకు సజ్జల స్పెషల్ క్లాస్!
posted on Jun 28, 2021 @ 6:39PM
మీరు ఏడడుగులే వేయలేకపోతున్నారు... నేను వెయ్యి అడుగులు వేస్తాను..నాకు అవకాశం ఇవ్వండి అంటూ అప్పుడు ఊదరగొట్టారు. సోషల్ మీడియాలో అంతకు మించి అదరగొట్టారు. అవన్నీ చూసి నిజమే అనుకున్నారు చాలామంది. అవకాశం వచ్చింది. ఇప్పుడు వెయ్యి అడుగులు వేయవేమీ సామీ అంటే... అంతకు ముందు ఎన్నిఅడుగులు వేశారు... రెండేళ్లలోనే అన్ని అడగులు వేయాలా.. అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు వైసీపీ నేతలు. తాము చెప్పింది మర్చిపోయి... కంపేరిజన్ కథలు మొదలెట్టారు వారు. ఏదో సామెత చెప్పినట్లు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మరీ.. తిట్లు తింటున్నారు వైసీపీ పెద్దలు. అప్పటిదాకా ఆశతో ఎదురుచూసిన యువత.. ఆ క్యాలెండర్ చూడగానే కడుపు మండి రోడ్డుమీదకొచ్చేశారు. ఇది ఇప్పట్లో చల్లారేలా కూడా కనపడటం లేదు.
నిరుద్యోగుల సెగ గట్టిగానే తగిలినట్లుంది వైసీపీ ప్రభుత్వానికి. అందుకే మాటలు, లెక్కలు అన్నీమార్చేసి మరీ..కొత్త కథ వినిపించడానికి ముందుకొచ్చేశారు ప్రభుత్వ మీడియా సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. అదేంటో విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పాల్సిన సమాధానాలను.. ఈయన చెప్పటానికి వచ్చేశారు. అబద్ధాలను నిజాలుగా చెప్పాలన్నా.. దబాయించాలన్నా..కాస్త ట్యాలెంట్ కావాలి కదా...పాపం ఆదిమూలపు సురేష్ గారికి అది కాస్త తక్కువ ఉన్నట్లుంది...ఆ విషయంలో పర్ ఫెక్ట్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి సార్ వచ్చేశారు.
ఆయనేం చెప్పారంటే.. టీడీపీ గత ఐదేళ్లలో 34 వేల టీచర్ ఉద్యోగాలే ఇచ్చింది. మేమొచ్చి రెండేళ్లే కదా..అప్పుడే ఎలా ఇస్తాం ..ఇంకా టైమ్ పడుతుంది..వెయిట్ చేయండి అంటూ సెలవిచ్చారు. ఈ ముక్క జగనన్న ప్రచారంలో చెప్పలేదు కదా..అప్పుడు ప్రతి ఏడాది ఉద్యోగాలిస్తామని..డీఎస్సీ నోటిఫికేసన్ ఇస్తామని.. అసలు చుక్కలు చూపించారు కదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఇంకో మాట కూడా సెలవిచ్చారు సజ్జలవారు. అదేంటంటే ..టీచర్లు, విద్యార్ధుల మైండ్ సెట్ మార్చాలంట... ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్ వస్తున్నాయి..వాటికి తగ్గట్లు మారాలని కూడా అందరూ గైడ్ చేయాలట..అది వదిలేసి ఉద్యోగాలని మా మీద పడతారేంటి అంటూ కొత్త డైలాగులు వేశారు.
అంటే ఉన్న టీచర్లు పనికిరారు..వాళ్లనీ మార్చేస్తారా? అసలు ఖాళీలెన్ని ఉన్నాయి.. వాటిని ఎందుకు నింపటం లేదని ప్రజాసంఘాలు సూటిగా అడుగుతున్న ప్రశ్నకు మాత్రం సజ్జల సమాధానం చెప్పలేదు. పైగా ఇంగ్లీషు మీడియం దెబ్బకు ఉన్న టీచర్లే కాకుండా..క్వాలిఫైడ్ నిరుద్యోగులు సైతం వెనక్కి పోవాల్సిందేనన్నట్లు సజ్జల వినిపించారు. ఇంగ్లీషు మీడియం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి తగ్గ రిక్రూట్ మెంట్ చేయాలి...ఉన్నవారిని ట్రెయినింగ్ చేయాలి..అవన్నీవదిలేసి..ముఖ్యమంత్రి ఏమో ఇంగ్లీషు మీడియం అంటూ ఊదరగొడుతున్నారు. కింద మాత్రం దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం లేదు.. అధికారులకు బడ్జెట్ కనపడుతోంది..అధికార పార్టీ నేతలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం కనపడుతోంది.
కనీసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు..అడిగిన డిమాండ్లపైన వివరణ ఇవ్వకుండా...ఏదేదో మాట్లాడి వెళ్లడం సజ్జలకే చెల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ సంఘాలు చాలా స్పష్టంగా లెక్కలిచ్చారు. ఎన్నిఖాళీలెన్ని ఉన్నాయో చెప్పారు. కాని అన్ని ఖాళీలు ఉన్నాయా లేవా అన్న స్పష్టత కూడా ఇవ్వలేదు..పైగా మైండ్ సెట్ మారాలంటూ టీచర్లకు, విద్యార్ధులకు, నిరుద్యోగులకు అందరికీ క్లాసు పీకి వెళ్లిపోయారు. ఇంకా కొసమెరుపు ఏంటంటే.. ఉద్యమం చేస్తుంది నిరుద్యోగులైతే..వాళ్లేదో టీడీపీ వాళ్లన్నట్లు...మీ నాయకుడు చంద్రబాబు ఇప్పటికే దెబ్బతిన్నారు.. మీరు కూడా చూసుకోండి అన్నారు..అంటే ఏంటో..ఆయనకే తెలియాలి..మహానుభావుడు.