పీవీని కాంగ్రెస్ వదిలేసుకుందా?
posted on Jun 29, 2021 @ 10:45AM
ఆర్ధికవేత్తలకు ఆయనో మార్గదర్శి. బిజినెస్ సర్కిల్స్ కు ఆయనో కరుణామయుడు. మల్టీ నేషనల్, నేషనల్ కంపెనీలకు ఆయన దేవుడే. ఆయన పరిపాలన సామాన్య ప్రజలకు మాత్రం అర్ధం కాలేదు. అందుకే మాస్ లీడర్ కాలేకపోయారు. ఆర్ధికరంగంపై అవగాహన ఉన్నవారంతా నేటికి పీవీకీ థ్యాంక్స్ చెబుతుంటారు... ఎందుకంటే ప్రపంచాన్ని ఆర్ధిక సంక్షోభం చుట్టుముట్టిన వేళ.. ఆ సెగ తాగకుండా కాపాడినవాడని చెప్పుకుంటారు. ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడని కీర్తిస్తారు. సోనియా కుటుంబానికి మాత్రం ఆయనో ద్రోహి అనే టాక్ ఉంది. అందుకే ఆయనకు సరైన గౌరవం ఇవ్వరని ఆరోపిస్తూ ఉంటారు. ఆయనే పీవీ నరసింహారావు.
తెలంగాణలో విచిత్ర పరిస్ధితి ఏర్పడింది. పెద్దాయనని కేసీఆర్ భుజాన వేసుకుని మోస్తూ.. ముందుకు పోతున్నారు. పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి గెలిపించారు. పీవీ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఆయన కాంస్యవిగ్రహాన్ని సైతం ప్రతిష్టించి ఆవిష్కరించారు. అన్నీ ఒక ఏడాదిలోనే జరిగాయి. కాని ఈ ఒక్క ఏడాదిలోనే పీవీ నరసింహారావు టీఆర్ఎస్ నాయకుడా లేక కేసీఆర్ గురువా అన్నంతగా అయిపోయింది. అందరూ మర్చిపోయిన పీవీని గౌరవిస్తున్నాడే అంటూ కేసీఆర్ ను పొగిడేవారు చాలామందే కనపడుతున్నారు.
కేసీఆర్ ఏం చేసినా ఎక్స్ ట్రీమే... అభిమానించినా ఆ రేంజ్ లోనే... ద్వేషించినా అదే రేంజ్ లో. అరిచి గోల పెట్టగలడు.. వారినే అక్కున చేర్చుకోగలడు. ఏదైనా చేయగల నేర్పరితనం ఆయన సొంతం. ఇప్పుడు పీవీ నరసింహారావు విషయంలో అదే జరుగుతోంది. కాంగ్రెస్ ప్రధాని అయిన పీవీ నరసింహారావును ఆల్ మోస్ట్ హైజాక్ చేసేశారు. ఆయనకు ముఖ్యమంత్రి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయించి ఆవిష్కరిస్తే.. అదే రోజు గాంధీభవన్ లో ఓ మీటింగు పెట్టి మమ అనిపించారు కాంగ్రెస్ నేతలు.
ఆఖరికి బిజెపి సైతం పీవీనరసింహారావును ఎత్తుకోవడంలో పోటీ పడుతోంది. ఆయన పేరున స్టాంప్ రిలీజ్ చేస్తామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనే ఇందుకు సాక్ష్యం. కాని కాంగ్రెస్ మాత్రం ఈ పరిణామాలను డీల్ చేయడంలో వెనకబడింది. ఆ ఏముందిలే పీవీ నరసింహారావును వాళ్లు ఎత్తుకుంటే ఎత్తుకోనీ అనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాని చాలా నష్టం జరుగుతుందన్న విషయాన్ని గమనించడం లేదు. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ లో చాలామంది పీవీ ఫ్యాన్స్ ఉన్నారు. వీరంతా పైకి కనపడరు.. పెద్దగా ఆ విషయం చెప్పుకోరు. కాని వారంతా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. కేసీఆర్ వైఖరికి వారు లోలోపలే చప్పట్లు కొడుతున్నారు. ఆ చప్పుడు కాంగ్రెస్ వినిపించుకోకపోతే కష్టమే.
కొత్త నేత రేవంత్ రెడ్డి అయినా ఈ విషయంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. అసలు తమ నాయకుడి గురించి తాము చెప్పుకోవాల్సింది పోయి.. ప్రత్యర్ధులు చెబుతుంటే వినాల్సిన దుస్ధితి వచ్చిందని వారు ఆందోళన చెందుతున్నారు. పీవీని అభిమానించే కొన్ని వర్గాలు మాత్రం ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నాయి. కేసీఆర్ వ్యూహానికి రేవంత్ ప్రతి వ్యూహం అమలు చేయకపోతే నష్టం జరిగే అవకాశం ఎక్కువే కనపడుతోంది