కిషన్ రెడ్డి సైలెంట్.. ఈటల గప్ చుప్! కేసీఆరే నడిపిస్తున్నారా..?
posted on Jun 29, 2021 9:04AM
తెలంగాణ పీసీసీ చీఫ్ గా ప్రకటించిన కాసేపటికే మీడియాతో మాట్లాడిన ఎంపీ రేవంత్ రెడ్డి బాంబ్ పేల్చారు. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయి ఇటీవలే బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. ఈటలపై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు రాజకీయంగా కాక రేపాయి. జనాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఈటల ఎపిసోడ్ లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి అన్నివర్గాల్లో కనిపించింది. అయితే రేవంత్ రెడ్డి తనను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా ఈటల రాజేందర్ గాని, బీజేపీ నేతలు కాని స్పందించకపోవడంతో.. అది నిజమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈటలను దారుణంగా ఇరికించారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే రాజేందర్ బీజేపీలో చేరారని ఆరోపించి కాక రేపారు రేవంత్ రెడ్డి. అందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పారు. బీజేపీలోకి రావాలని ఈటలను ఆహ్వానించేందుకు కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన స్పెషల్ ఫ్లైట్ ఎవరిదో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే వ్యక్తికి చెందిన ఫ్లైట్ లోనే కిషన్ రెడ్డి వచ్చారన్నారు. తన మంత్రివర్గం నుంచి తొలగించిన ఈటలను బీజేపీలో చేరాలని చర్చించేందుకు వచ్చిన కిషన్ రెడ్డికి.. కేసీఆర్ సన్నిహితుడు ఫ్లైట్ ఎందుకు ఇస్తారని, ఇదంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ.
రేవంత్ రెడ్డి ఆరోపణలు తెలంగాణలో కలకలం రేపాయి. బీజేపీలో ప్రకంపనలు స్పష్టించాయి. నిజానికి ఒక నేతపై ఎవరైనా ఆరోపణలు చేస్తే.. సదరు నేతలు వెంటనే స్పందిస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి నేరుగానే కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయినా ఇంతవరకు వాళ్లిద్దరు స్పందించలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లో విస్తృతంగా పర్యటించారు. పలు వ్యాక్సినేషన్ సెంటర్లను పరిశీలించారు. పీవీ శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మీడియాతోనూ మాట్లాడారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పై, రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. కాని తనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాత్రం కిషన్ రెడ్డి స్పందించలేదు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. కిషన్ రెడ్డి మౌనం దేనికి సంకేతమనే అనుమానాలు వస్తున్నాయి. కిషన్ రెడ్డి మౌనంగా ఉన్నారంటే.. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలే నిజమేనా అన్న సందేహాలు వస్తున్నాయి.
ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్ ది ఇదే పరిస్థితి. సోమవారం నుంచి ఆయన ఎక్కడా కనిపించలేదు. కేసీఆర్ పై రివేంజ్ తీర్చుకుంటానని చెబుతున్న రాజేందర్.. రేవంత్ రెడ్డి ఆరోపణలపై మాట్లాడకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అసలు రేవంత్ రెడ్డి ఆరోపణలపై వెంటనే స్పందించాల్సి పోయి.. రెండు రోజులైనా సైలెంటుగా ఉండటం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. కేసీఆర్ డైరెక్షన్ లోనే ఈటల నడుస్తున్నారన్న ఆరోపణపైనా స్పందించపోతే జనాల్లోకి తప్పుడు సంకేతం వెళుతుందనే ఆందోళన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి ఆరోపణలకు సమాధానం ఇవ్వకపోతే.. ఆయన చేసిన ఆరోపణలు నిజం అనే భావన జనాల్లో వస్తుందని, అదే జరిగితే చాలా ప్రమాదమని కొందరు ఈటల మద్దతుదారులు కలవరపడుతున్నారు. ఇది త్వరలో జరగబోయే ఉప ఎన్నికలోనూ తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.