రేవంత్‌తో 'రెడ్ల' కళ్లల్లో ఆనందం.. అధికారం కోసం ఏకమయ్యే ప్రయత్నం?
posted on Jun 28, 2021 @ 7:24PM
రెడ్డి. పాలించడానికే ఉన్నామనేది ఆ వర్గం భావన. అధికారం లేకుండా వాళ్లు మనశ్శాంతిగా ఉండలేరంటారు. పవర్ వాళ్ల చేతిలో లేకున్నా.. పవర్ సెంటర్ మాత్రం వాళ్లే. తెలంగాణలో ఏండ్లుగా రెడ్డి వర్గానిదే ఆధిపత్యం, అధికారం. ఇప్పటికీ గ్రామాలు వారి గుప్పిట్లోనే ఉంటాయి. తెలంగాణలో అనేక ఊళ్లల్లో రెడ్డి చెప్పిందే వేదం. ఆయన సూచించిన వారికే ఓటు. ఇక నల్గొండ జిల్లా పాలిటిక్స్‌లోనైతే రెడ్డి డామినేషన్ అంతా ఇంతా కాదు. ఏ పార్టీ తీసుకున్నా.. ఏ ప్రాంతం తీసుకున్నా.. రెడ్డి నాయకులదే హవా. వారికి వారే పోటీ. వారికి వారే సాటి. ఆఖరికి ఎస్సీ నియోజకవర్గమైనా.. రెడ్డి నేత కనుసన్నల్లోనే పాలన నడుస్తుంది. ఇంటి పాలేరును.. తమ ప్రతినిధిగా అసెంబ్లీకి పంపిన ఘటనలు కూడా ఉన్నాయి. అంతటి ఆధిపత్యం ఉన్న రెడ్ల ఆధిపత్యానికి తొలిసారి కేసీఆర్ రూపంలో అవరోధం ఎదురైంది. ఏడేళ్లుగా ముఖ్యమంత్రి పీఠానికి దూరమై.. అదును, అవకాశం కోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్నారు రెడ్డి నాయకులు.
ముఖ్యమంత్రి రెడ్డి కాకపోయినా... తెలంగాణలో ముఖ్యమైన పదవులన్నీ రెడ్ల చేతిలోనే ఉన్నాయంటారు. మంత్రి వర్గంలో వారిది చెప్పుకోదగ్గ సంఖ్య. కేసీఆర్ కుటుంబం మినహా మిగతా వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కిన ఉదాహారణలు తక్కువే. సీఎంవో నుంచి కీలక ప్రభుత్వ విభాగాల వరకూ.. అన్నిచోట్లా రెడ్డి అధికారులదే హవా. ముఖ్యమంత్రి ఎవరున్నా.. వారి ఆధిపత్యం లేనిదే ప్రభుత్వ మనుగడ సాధ్యం కాదంటారు.
గత కొంతకాలంగా వివిధ విభాగాల్లో ఉన్న రెడ్డి అధికారులు.. రేవంత్‌రెడ్డికి సహకరిస్తున్నారనే టాక్ ఉంది. ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని లీక్ చేస్తున్నారని.. సర్కారు లొసుగులను రేవంత్‌రెడ్డికి ఉప్పు అందిస్తున్నారనే అనుమానం వినిపిస్తోంది. రేవంత్‌రెడ్డి తన వర్గీయుల ద్వారా రాబట్టిన వివరాల ఆధారంగానే తన స్నేహితుడైన ఓ మీడియా డాన్‌కు ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేసి.. ఎప్పటికప్పుడు కేసీఆర్ సన్నిహితుల ఆర్థిక లావాదేవీలను, అక్రమాలను బ్రేకింగ్ న్యూస్‌గా నడిపిస్తున్నారని అంటున్నారు. అంతెందుకు, టీఆర్ఎస్‌పార్టీ అధికారిక మీడియాలో కీలక స్థానంలో ఉన్న రెడ్డి ఉద్యోగులను ఇటీవల కాలంలో వన్ బై వన్ పక్కన పెట్టేశారు. వారినలా సైడ్ చేయడానికి కారణం.. వారు లోపాయికారీగా రేవంత్‌రెడ్డికి సహకరిస్తున్నారనే సమాచారం కేసీఆర్ చెవిన పడటమే అంటున్నారు. ఇలా, ప్రభుత్వంలో చక్రం తిప్పగల సత్తా ఉంది కాబట్టే.. అప్పుడూ, ఇప్పుడు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం బలం, బలగం ఎవరినైనా భయపెట్టక మానదు. గట్టిపిండం కేసీఆర్ కాబట్టి.. ఆ వర్గాన్ని ఎక్కడా తక్కువ చేయకుండా, వారి ప్రాధాన్యం అలానే కొనసాగిస్తూ.. జాగ్రత్తగా మేనేజ్ చేసుకు వస్తున్నారని చెబుతారు.
అయినా.. ఆ వర్గం సంతృప్తిగా లేదని.. ముఖ్యమంత్రి పీఠమే వారి టార్గెట్ అని అంటున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఎంపికయ్యాక.. ఇప్పుడు మళ్లీ వారి కళ్లలో ఆనందం కనిపిస్తోందట. తమ వాడు ఎప్పటికైనా సీఎం కాకపోతాడనే ఆశ, అంచనా వారిలో కొత్త ఉత్సాహం నింపుతోందట. అందుకే, వివిధ చోట్ల సెటిల్ అయిపోయిన రెడ్డి వర్గమంతా మళ్లీ సమాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రేవంత్‌రెడ్డికి సహకరించి.. రాష్ట్రాన్ని తమ వాడి చేతిలో పెట్టాలనే ప్రయత్నాలు చిగురు తొడుగుతున్నాయని అంటున్నారు. రేవంత్‌రెడ్డిని ఆ సామాజిక వర్గమంతా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా చూస్తున్నారు. వైఎస్సార్ తర్వాత.. తెలంగాణలో తమ ఇమేజ్‌ను మళ్లీ ఆ స్థాయికి తీసుకొచ్చే లీడర్‌గా రేవంత్‌రెడ్డిపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. రేవంత్‌రెడ్డిది అప్పర్ హ్యాండ్ అయ్యే టైమ్ వచ్చే వరకు వెయిట్ చేసి.. అప్పుడు రెడ్ల పునరేకీకరణ చేపట్టేలా ఆ వర్గం పెద్దలు మంతనాలు జరుపుతున్నారట. అయితే.. గుత్తా సుఖేందర్‌రెడ్డిలాంటి నేత.. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోయి.. ఉత్తరకుమారుడు వచ్చాడంటూ సెటైర్లు వేయడం.. ఇప్పటికీ అనేక మంది బలమైన రెడ్డి నాయకులు కేసీఆర్ వెన్నంటే ఉన్నారనే విషయం గుర్తు చేస్తోంది. మరి, చూడాలి.. రేవంత్‌రెడ్డి దూకుడుతో.. రెడ్డి రాజకీయం ఎలా మారుతుందో....