తిట్టిన వీహెచ్ కు పరామర్శ.. తొలి రోజు రేవంత్ అదుర్స్..
posted on Jun 28, 2021 @ 4:11PM
తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎంపికైన ఎంపీ రేవంత్ రెడ్డి తన దైన శైలిలో అడుగులు వేస్తున్నారు. పార్టీలో నేతలందరిని కలుస్తూ మద్దతు తీసుకుంటున్నారు. దూకుడుగా వెళతారనే రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ పగ్గాలు వచ్చాక మాత్రం కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఏఐసీసీ ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అయితే సోమవారం మాత్రం కూల్ గా తన పని తాను చేసుకుపోయారు. పార్టీలోని సీనియర్ నేతలను కలిశారు. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించవద్దని బహిరంగంగానే చెప్పారు మాజీ ఎంపీ వీ హనుమంతరావు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వీహెచ్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరారు. హైదర్ గూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వి.హనుమంతరావును పరామర్శించారు రేవంత్ రెడ్డి. ఆయన అరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వీహెచ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు రేవంత్ రెడ్డి.
సీనియర్ నేత వి.హనుమంతరావు సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారు. వీహెచ్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చానని అన్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడిందన్నారు. హాస్పిటల్‌లో ఉన్నా.. ప్రజా సమస్యలపైనే వీహెచ్ దృష్టి అన్నారు. వాటిపైనే తనతో చర్చించారని తెలిపారు. దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్‌గా ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహంపై పోరాడాలని తనకు వీహెచ్ సూచించారని చెప్పారు. పార్టీ అభివృద్ధి విషయంలో కొన్ని సలహాలు ఇచ్చారని తెలిపారు. వీహెచ్ సూచనలను మేడమ్ సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్తానన్నారు రేవంత్ రెడ్డి.
హాస్పిటల్ లో రేవంత్, వీహెచ్ ఇంకా ఏమనుకున్నారంటే..
వీహెచ్: తమ్మీ కంగ్రాట్స్, నీకు పీసీసీ ఇవ్వొద్దన్నానని మనసులో పెట్టుకోకు
రేవంత్ : ఊకో అన్న.. అదేం ఉండదు. నాకు రావద్దని లోలోపల కుట్రలు చేసినోళ్ల కన్నా.... మనసులో మాట డైరెక్ట్ గా చెప్పిన నువ్వంటేనే నాకిష్టం. నీ పాణం మంచిగైనంక ఢిల్లీకి పోయోద్దాం
వీహెచ్: గట్లనే తమ్మీ..