అన్నతో పోరాటానికి చెల్లెమ్మ సై.. జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్.. ఇక జగడమే..
posted on Jun 28, 2021 @ 7:03PM
కొన్నిరోజులుగా రెండు తెలుగురాష్ట్రాల మధ్య వాటర్ వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఏకంగా కేబినెట్ మీటింగ్‌లోనే సీఎం కేసీఆర్ ఏపీ ప్రాజెక్టులపై విరుచుకుపడ్డారు. కేంద్రానికీ ఫిర్యాదు చేశారు. ఇక తెలంగాణ మంత్రులైతే ఆంధ్రప్రదేశ్ పాలకులను మాటలతో ఓ తూట్లుపొడుస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని.. ఆయన కొడుకు జగన్‌రెడ్డినీ వదలకుండా విమర్శలతో కుళ్లబొడుస్తున్నారు. వైఎస్సార్ నీళ్ల దొంగ అయితే.. జగన్ గజదొంగ అంటూ ఘోరంగా అవమానిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారంటూ మండిపడుతున్నారు. తెలంగాణ మంత్రులు ఇంతగా నోరు పారేసుకుంటున్నా.. పౌరుషం ఉన్న కడప బిడ్డనని చెప్పుకునే సీఎం జగన్‌రెడ్డి మాత్రం నోరు తెరవకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అటు, ఏపీ మంత్రులు సైతం సుతిమెత్తగా తెలంగాణ మంత్రుల మాటలను ఖండిస్తున్నారే కానీ, ఇంత వరకూ అటునుంచి గట్టి కౌంటర్ పడనే లేదు. ఏపీ విషయం పక్కనపెడితే....
ఏపీ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని మంత్రులంతా మొత్తుకుంటుంటే.. తెలంగాణ కోడలినంటూ, రాజన్నరాజ్యం తీసుకొస్తానంటూ రాజకీయాల్లోకి రాబోతున్న వైఎస్ షర్మిల ఈ జల వివాదంపై ఇప్పటి వరకూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాల విషయంలో షర్మిల రాజకీయ చిత్తశుద్ధిపై అనుమానాలు కోడై కూస్తున్నాయి. గతంలో తెలంగాణ కోసం అది చేస్తా, ఇది చేస్తానంటూ గొప్పలు చెప్పిన షర్మిల.. రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్‌పై ఎందుకు మాట్లాడటం లేదంటూ తెలంగాణ వాదుల నుంచి నిలదీత మొదలైంది. ఏపీ సీఎంగా తన అన్న జగన్ ఉన్నందుకే.. జలజగడంపై షర్మిల మౌనం వహిస్తున్నారా? అంటూ నిగ్గదీసి అడుగుతోంది తెలంగాణ సమాజం. ఇలా, షర్మిలపై అనుమానపు మాటల తూటాలు వెల్లువెత్తుతుండటంతో.. లేటైనా.. లేటెస్టుగా స్పందించారు వైఎస్ షర్మిల.
తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం.. అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం.. అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్‌తోపాటు గతంలో పార్టీ సన్నాహకాల్లో భాగంగా నిర్వహించిన సభలో మాట్లాడిన మాటల వీడియోనూ షేర్ చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా అడ్డుకుంటామని.. తెలంగాణ ప్రజల కోసం నిలబడతా.. కొట్లాడుతా..నంటూ పంచ్ డైలాగ్‌తో ఉన్న వీడియోను ఇప్పుడు మరోసారి షేర్ చేశారు వైఎస్ షర్మిల.
అయితే, తాజా జల జగడంపై షర్మిల నేరుగా స్పందించకుండా.. డొంక తిరుగుడు సమాధానం చెప్పిందంటున్నారు విమర్శకులు. ఎప్పుడో మూడు నెలల క్రితం చేసిన స్టేట్‌మెంట్స్‌ను సేమ్ టు సేమ్ అలానే ట్వీట్ చేసి.. తాను తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాననే అర్థం వచ్చేలా తన స్టాండ్ స్పష్టం చేశారని అంటున్నారు. అయితే, స్టాండ్ ఓకే.. బట్, ప్రస్తుత గొడవపై జగన్‌ను ఎదిరిస్తారా? లేదా? అని నేరుగా మాత్రం చెప్పలేదు. అయితే, ఆమె మాటలని బట్టి చూస్తుంటే.. అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం.. అంటే.. ఆ ఎవరు ఇంకెవరు.. తన అన్న అయిన ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితోనేగా పోరాటం అని స్పష్టం చేస్తున్నారు షర్మిల అభిమానులు. ఏ ప్రాజెక్టునైనా అడ్డుకుంటామని అంటే.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు-ఆర్డీఎస్‌ను కూడా అడ్డుకుంటాననేగా అర్థం అని తేల్చి చెబుతున్నారు. తెలంగాణ ప్రజల కోసం నిలబడతా.. కొట్లాడతా.. అంటూ ఏపీతోనే కదా ఆమె కొట్లాడేది.. ఇంతకంటే సూటిగా ఇంకేం చెబుతారంటూ క్లారిటీ ఇచ్చేస్తున్నారు షర్మిల అనుచరులు. సో, షర్మిల తాజా ట్వీట్‌తో ఇక ముందుముందు అన్నాచెల్లెల్ల మధ్య నీళ్ల యుద్ధం తప్పకపోవచ్చు అంటున్నారు. మరి, అన్న మీద ఉత్తుత్తి పోరాటం చేస్తుందో.. లేక, జలఖడ్గం రువ్వుతుందో చూడాలి..
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. తన తండ్రిని నీళ్లదొంగ, తన అన్నను గజదొంగ అంటున్న తెలంగాణ మంత్రుల ఆరోపణలను కనీసం ఖండించనూ లేదు వైఎస్ షర్మిల. ఏ రాజన్నరాజ్యం తీసుకొస్తానంటూ రాజకీయాల్లోకి వస్తున్నారో.. అదే రాజన్నను తెలంగాణ నీళ్లు దోచుకున్న నీళ్లదొంగ అంటూ మంత్రులు మాట్లాడినా.. ఆ రాజన్న కూతురైన షర్మిల ఆ విషయాన్ని అసలేం పట్టించుకోనట్టు.. వదిలేయడాన్ని ఏమనుకోవాలి? తన అన్న జగనన్నను గజదొంగ అంటున్నా.. ఆమె మౌనం వహించడాన్ని ఎలా చూడాలి? అంటే, షర్మిల మౌనం అర్థ అంగీకారం అనుకోవాలా? వైఎస్సార్ నీళ్లదొంగ, జగన్ గజదొంగ అనే ఆరోపణలను ఆమె ఆమోదిస్తున్నట్టేనా? లేదంటే, ఆ మాటలను ఎందుకు ఖండించలేదు? తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం తన తండ్రిని, తన అన్నను అంతేసి మాటలు అంటున్నా.. భరిస్తున్నారా? ఆమె వరుస చూస్తుంటే.. షర్మిల రాజకీయంగా రాటుదేలినట్టేనా? షర్మిల రాజకీయ అరంగేట్రానికి ఆదిలోనే జలవివాదం అగ్నిపరీక్షగా నిలవడం ఆసక్తి రేపుతోంది....