ఎక్కడ ఏం జరిగినా..చంద్రబాబేనా..? ఇంకెంత కాలం ఈ డ్రామాలు?
posted on Jun 29, 2021 @ 12:27PM
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. ఇది మనకు స్పేస్ సైన్స్ చెప్పే విషయం. కాని తెలుగు రాష్ట్రాల్లో ఆ సైన్స్ వేరేగా వినిపిస్తున్నారు. రాజకీయాల చుట్టూ పార్టీలు తిరుగుతున్నాయి.. ఆ పార్టీల చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని చెబుతున్నారు. ఆ చెప్పేవారు మాత్రం చంద్రుడి చుట్టూనే తిరుగుతున్నారు. ఎక్కడ ఏం జరిగినా...ఆ తీగ తెగకుండా జాగ్రత్తగా లాగి చంద్రుడికి లింకు పెట్టేస్తున్నారు. ఎవరు పార్టీ మారినా.. ఎవరికి ఏ పదవి వచ్చినా.. కర్త కర్మ క్రియ ఈ చంద్రబాబునాయుడే అని కథలు చెబుతున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ఎలిజబుల్ పొలిటీషియన్ చంద్రబాబునాయుడు. ఆయనను పొగిడేవారున్నారు..నాన్ స్టాప్ గా తిట్టేవారున్నారు. కాని ఎవరు మాట్లాడినా ఆయన పేరు ఎత్తకుండా ఉండలేరు. స్పీచ్ లో ఆయన పేరు లేకపోతే గ్రామర్ కరెక్టుగా ఉండదని ఫీలవుతుంటారు. కంటెంట్ లో ఆయన పేరు లేకపోతే..కంప్లీట్ అవదని వాళ్ల స్ట్రాంగ్ ఫీలింగ్. అయితే ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. ఎవరు పార్టీ మారినా...ఎవరికి ఏ పార్టీలో ఏ పదవి వచ్చినా దాని వెనక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ మధ్య అధికార పార్టీ మానసపత్రిక అయితే ఏకంగాఎడిటోరియలే రాసింది.
టీడీపీ నుంచి బిజెపిలోకి వెళ్లినవారిని, టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లినవారిని..టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లినవారిని అందరినీ..చంద్రబాబే పంపిచాడనేది వారు చెప్పే వేదాంతం. కాని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లినవారిని గురించి మాత్రం ఆ కథనంలో ప్రస్తావన కూడా చేయరు..వారిని కూడా చంద్రబాబే పంపించాడని పొరపాటున కూడా రాయరు. అదే ఆ రాతల్లోని నైపుణ్యం. సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో మొదలవుతుంది ఈ కథ. వారిద్దరినీ బిజెపిలోకి పంపింది చంద్రబాబేనని.. వారిని, బాబును కాపాడటానికే బిజెపిలోకి పంపారని చెబుతున్నారు. ఇక లేటెస్టుగా రేవంత్ రెడ్డిదే హాట్ టాపిక్. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ చీఫ్ చేయడానికి బాబుగారు రాహుల్ గాంధీతో మంత్రాంగం నడిపించారనేది వారి ఆలోచన. రేవంత్ ని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా పంపించి.. తెలంగాణను గుప్పిట్లో పెట్టుకోవాలని బాబు ప్లాన్ వేశారనేది వారి ఆరోపణ. ఇక రమణను టీఆర్ఎస్ లోకి పంపి.. అంతకు ముందు పంపిన నేతలతో పాటు..ఈయన కూడా కలిసి... టీఆర్ఎస్ ను కూడా గుప్పిట్లో పెట్టుకుంటారంట. అంటే బిజెపిని, టీఆర్ఎస్ ని, కాంగ్రెస్ ని అన్నిటిని గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేదే వారు చెప్పేది.
రేవంత్ రెడ్డి సంగతి అందరికీ తెలిసిందే. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఏ పార్టీ అయినా వెనకాడడు. బిజెపి, టీఆర్ఎస్ లను టచ్ చేశాకే టీడీపీలో చేరాడు.. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరాడు. ఎక్కడున్నా నాయకత్వ స్థానానికి ఎదగగల సత్తా ఉన్నవాడు కాబట్టే ఎక్కడున్నా ఆ మోతే మోగిస్తాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు మాట వింటారనుకోవడం భ్రమే అవుతుంది. ఇక టీఆర్ఎస్ లోకి వెళ్లిన టీడీపీ నేతల సంగతి అందరికీ తెలిసిందే. అధికారం లేకపోతే బతకలేమనే స్ధితికి వెళ్లిపోయిన రాజకీయ నేతలు ఎలా పార్టీలు మారుతున్నారో ఏపీలో, తెలంగాణలో చూస్తూనే ఉన్నాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి..వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నుంచి ఎలా జంప్ చేశారో చూశాం. తెలంగాణలో కూడా అంతే. ఇవన్నీ వదిలేసి...ప్రతి పార్టీలో జరిగే రాజకీయ పరిణామాలకు చంద్రబాబుకు ముడిపెట్టడం అంటే వారే ఓ సిద్ధాంతాన్ని సృష్టించి రాద్ధాంతం చేయడమే.